ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం. మొత్తం భూమండలానికి శ్రీశైలం మధ్యభాగమని చెబుతారు. అందుకే ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ పూజ, వ్రతాలు చేసుకునే వారైనా తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో సంకల్పంలో స్పష్టంగా ప్రస్తావిస్తారు. అటు ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇటు అష్టాదశ శక్తి పీఠాల జాబితాలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రంగా శ్రీశైలం పేరొందింది. పలు శాశనాల ప్రకారం క్రీ.శ.6వ శతాబ్ది నాటికే ఇప్పటి ఈ ఆలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకైలాసం, సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము అనే పేర్లతోనూ ఈ క్షేత్రం పిలువబడుతోంది.

ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలమనీ, ఇక్కడి శిఖర దర్శనం చేసుకున్నవారికి ఇక జన్మనెత్తాల్సిన అవసరం లేదని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, దక్షిణ ద్వారంగా కడప జిల్లా సిద్ధవట క్షేత్రం , పశ్చిమ, ఉత్తర దిశల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపురం, ఉమామహేశ్వర క్షేత్రాలు విలసిల్లుతున్నాయి. కర్నూలు నుంచి 180 కి.మీ, హైదరాబాద్ నుంచి సుమారు 210 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది.

స్థలపురాణం

 పూర్వం శిలాదుడనే మహర్షి శివుని వరం చేత నంది, పర్వతుడు అనే ఇద్దరు కుమారులను పొందాడట.అనంతర కాలంలో నంది తండ్రి మాదిరిగానే తపం ఆచరించి శివుని వాహనంగానే గాక స్వామి సన్నిధిలోనే ఉండేలా వరం పొందాడట. సోదరుడి మార్గంలోనే పర్వతుడు కూడా తపం ఆచరించి శివపార్వతులిద్దరూ తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందటంతో పార్వతీపరమేశ్వరులు ఇద్దరూ ఇక్కడే కొలువయ్యారట.

మరో కథ ప్రకారం అరుణాసురుడనే రాక్షసుడు గాయత్రీ మంత్రజప ఫలంతో 2, 4 కాళ్ళ జీవుల చేతిలో మరణం రాకుండా బ్రహ్మవరం పొందాడట. అతని వరం పట్ల అభద్రతాభావానికి లోనైన దేవతలు ఆదిశక్తిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకోగా అరుణాసురుడు తన భక్తుడనీ, గాయత్రీ మంత్రం జపించినంత కాలం అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారట. తర్వాత దేవతలు పథకం ప్రకారం బృహస్పతిని ఆ రాక్షసుని వద్దకు పంపి 'దేవతలు పూజించే గాయత్రీ మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావా?' అని ఎగతాళి చేయించటంతో ఆ రాక్షసుడు అహంకరించి గాయత్రీ మంత్రం జపాన్ని ఆపివేసాడట. ఆ తర్వాత అమ్మవారు తుమ్మెద (భ్రమరం) రూపంలో కోట్లాది తుమ్మెదలతో ఆ రాక్షసుని మీద దాడిచేసి అంతమొందించిందని చెబుతారు. అప్పటినుంచే అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు వచ్చింది.

మరో గాధను బట్టి రావణ వధ కారణంగా చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకునేందుకు శ్రీరాముడు రామేశ్వరంలో లింగ స్థాపన జేసి నారదుని సలహాపై స్వామిని సేవించారట. ఆనాడు రాముడు ఏ ప్రదేశం నుంచి స్వామిని దర్శించారో ఆ ప్రదేశం నుంచే భక్తులు శిఖరదర్శనం చేస్తారు.

ఆలయ వైభవం..ఇతర విశేషాలు

ఇక్కడి ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. పాతాళగంగలో స్నానం ఆచరించిన భక్తులు ముందుగా రాజ గోపురం, వీరశిరోమండపం గుండా గర్భాలయం చేరుకుంటారు. ఇతర శైవక్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ స్వామి చిన్న సైజు లింగాకారంలో దర్శనమిస్తారు. ఆలయంలో ఆయా కళల నాటి శిల్పాలు నాటి కళావైభవాన్ని కళ్ళకుకడతాయి. ఈ ఆలయ ప్రాకారాలపై ఉన్న శిల్పాలు, చిత్రాలు పురాణ ఘట్టాలను , ఇతర చారిత్రాత్మక విశేషాలను స్ఫురణకుతెస్తాయి. ఇదే ఆలయ ప్రాంగణంలోనే సప్తమాతృకలు, మనోహర కుండం, బ్రహ్మకుండం, విష్ణుకుండం, నవబ్రహ్మాలయాలు ఉన్నాయి. పాండవ ప్రతిష్ఠిత లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. స్వామిని దర్శించుకుని ముందుకు వెళితే కాస్త పై భాగాన అమ్మవారు భ్రమరాంబికగా దర్శనమిస్తుంది. స్వామి, అమ్మవారిని దర్శించిన భక్తులు ఆలయానికి తూర్పున 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి కోవెలను దర్శిస్తారు. శ్రీశైల దర్శనం చేసిన భక్తుల గురించి కైలాశంలో గణేశుడు సాక్షమిస్తాడని చెబుతారు. ఆ తర్వాత వృద్ధ మల్లికార్జుని ఆలయం, శంకరాచార్యులవారు తపస్సుచేసిన పవిత్ర స్థలమైన పాలధార, పంచధారలను దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్నప్పుడే శంకరాచార్యులవారు శివానందలహరి , సౌందర్యలహరి’లను రచించినట్లు చెబుతారు. అనంతరం హఠకేశ్వరం, శిఖర దర్శనం చేసి, ఆలయానికి దూరంగా దట్టమైన అడవిలో ఉన్న ఇష్ట కామేశ్వరీ ఆలయం, కదళీవనాలను దర్శించుకుంటారు. శ్రీశైలంలోని గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే మ్యూజియం, కృష్ణానది మీద నిర్మించిన విద్యుత్ కేంద్రం, రోప్ వే యాత్రీకులకు కొత్త అనుభూతినిస్తాయి. .

రవాణా, వసతి, ఆలయ సమాచారం

హైదరాబాద్, మార్కాపురం, కర్నూలు నుంచి రోడ్డు మార్గాన శ్రీ శైలానికి చేరుకోవచ్చు. ఇక్కడ యాత్రీకుల వసతి నిమిత్తం లెక్కకు మించిన సత్రాలు, దేవస్థానపు కాటేజీలు, ప్రైవేటు హొటల్స్ కలవు. తెలుగునాట ఎక్కడా లేని విధంగా ప్రతి సామాజిక వర్గానికీ ఒక్కో సత్రం ఇక్కడ కనిపిస్తుంది గనుక వసతికి ఎలాంటి సమస్యా ఉండదు. మంగళ, బుధ, గురు శుక్రవారాల్లో ఉదయం 4.30 గంటలకు, శని, ఆది, సోమవారాల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. తొలుత సుప్రభాతసేవ, అనంతరం మహామంగళ హారతి నిర్వహిస్తారు. శ్రీశైల దేవస్థానం కల్పించే వసతో పొందగోరేవారు 08524-288888, 28735, ఆలయ సేవల వివరాలు పొందాలనుకుంటే ఆలయ 288887, ఇతర సమాచారామ్ కోసం 288885లో సంప్రదించొచ్చు.మహా శివరాత్రి, తొలిఏకాదశి, కార్తీకమాసాలలో శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE