ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢంలో వచ్చే ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది. దీనినే తొలిఏకాదశి అంటారు. పద్మ పురాణం ప్రకారం ఈ రోజునుంచే శ్రీ మహ విష్ణువు క్షీర సముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమించి తిరిగి నాలుగు నెలల తర్వాత అంటే.. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి మునులు, యోగులంతా చాతుర్మాస్యదీక్ష చేస్తారు. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అనీ అంటారు. ఈ రోజునుంచే సూర్యుని గమనం దక్షిణం వైపు మళ్లుతుంది. అంటే ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ఆరంభం అవుతుంది. ఈ రోజు నుంచి పగటి సమయం తగ్గి రాత్రివేళలు మరింత పెరుగుతాయి. కృష్ణ భక్తురాలు సతీ సక్కుబాయి ఈ రోజునే వైకుంఠ ప్రాప్తి పొందినట్లు చెబుతారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర లోని పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ పండుగను కేవలం వైష్ణవులే గాక సౌర, శైవ విధానాల వారూ జరుపుకోవటం విశేషం. 

పండుగ విశేషాలు

తెలుగు పంచాగం ప్రకారం ఈ ఏకాదశితో మన పండుగలు మొదలవుతాయి. అప్పటికి రెండు నెలలుగా ఎలాంటి పండుగలూ లేక బోసిపోయిన ఇళ్ళకి కొత్తకళ వస్తుంది. ఈ పండుగ 4 రోజుల తర్వాత గురుపూర్ణిమ, తర్వాత శ్రావణమాసం నోములు, వ్రతాలు, ఆ పైన వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి పండుగలు వస్తాయి. ఈ పండుగను జరుపుకోవటం వెనుక పలు ఆరోగ్య, ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. ఏకాదశి అంటే 11. మనిషికున్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సుతో కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోకి తెచ్చుకున్నప్పుడే నిగ్రహం, ఏకాగ్రత పెరుగుతాయనే సందేశం ఈ పండుగలో ఉంది. వర్షాకాలంలో మొదలయ్యే సమయం గనుక ప్రకృతి, పర్యావరణ మార్పుల వల్ల శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. దీనికి విరుగుడుగా ఈ రోజు చేసే ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. 

తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేస్తారు. ఏకాదశి ఘడియలు వెళ్లేవరకూ హరినామ సంకీర్తన, స్మరణతో గడిపి ద్వాదశి రాగానే విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తారు. ఇలా నియమ బద్ధంగా ఉన్నవారికి విశేష ఫలం లభిస్తుందని పెద్దల మాట. తెలుగు నాట ఈ పండుగ నాడు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేసి దేవునికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటారు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE