శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవటం తెలుగు వారి సంప్రదాయం. సర్వసౌభాగ్యాలను, పుత్ర పౌత్రాదులను, సుఖ జీవితాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో  శ్రద్దాభక్తులతో జరుపుకుంటారు.  వరలక్ష్మీ వ్రత విధానం, అందుకు అవసరమైన ఏర్పాట్లు, పాటించవలసిన నియమాల్ గురించి ఇప్పుడు  తెలుసుకుందాం.

సమకూర్చుకోవాల్సినవి

  • అమ్మవారి ఫోటో లేక విగ్రహము.
  • పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరొత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరి కాయలు, కలశము, కలశ వస్త్రము, పంచామృతము (ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార), దీపారాధన కుందులు, నెయ్యి లేదా నువ్వులనూనె
  • కొత్తచీర, రవిక పూజా సమయంలో అమ్మ వారికి సమర్పించి తర్వాత కట్టుకోవచ్చు . లేనివారు పత్తితో చేసిన మాలను సమర్పించవచ్చు. కొత్త నగలు ఉంటే పూజలో పెట్టి తర్వాత వేసుకోవచ్చు.
  • శక్తి ఉన్నవారు నేతితో చేసిన 12 రకముల పిండివంటలు సమర్పిస్తారు. వీలు కాకపోతే ఎవరి శక్తి కొలది వారు నైవేద్యం పెట్టుకోవచ్చు.
  • 9 ముడులు వేసిన 9 తోరములు సిద్ధం చేసుకోవాలి. పసుపు దారములో ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. (ఒకటి అమ్మవారికి, మరొకటి వ్రతం చేసే వ్యక్తికి, మిగతావి ముత్తయిదువులకు).
  • మంచి నీటితో గ్లాసు, ఉద్దరిణా ఉంచుకోవాలి. 

వ్రత విధానం 

వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు వేకువనే లేచి, ఇంటిని శుభ్రపరిచి, గడపలకు పసుపు రాసి, బొట్టు పెట్టుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. స్నానాదులు ముగించి, కొత్త బట్టలు ధరించి, పుష్పాక్షతలు సమర్పించి లక్ష్మీ దేవికి నమస్కరించి అనంతరం వ్రాత ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందులో భాగంగా ముందుగా వ్రతం సందర్భంగా కలశ స్థాపన చేసే చోట ఆవుపేడతో అలికి,  పిండితో నేలపై గోమాత పాదాలు, పద్మాన్ని వేస్తారు. కలశానికి పసుపు రాసి, గంధం పూసి, ఆపై కుంకుమ బొట్టు పెట్టిన కలశాన్ని నీటితో నింపి, అందులో  మామిడి ఆకులు, అక్షతలు వేసి పైన కొబ్బరికాయను పెట్టి పిండితో వేసిన పద్మం ఆకారంలో వేసిన ముగ్గు మీద కొత్త రవికెల గుడ్డతో చుట్టి ప్రతిష్టించాలి. తర్వాత పసుపు ముద్దతో త్రికోణాకారంలో వినాయకుడిని చేసి తమలపాకు మీద పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు, అక్షతలు వేసి నమస్కరించి గణేశ ప్రార్ధన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్నీ ఆరంభించాలి. ముందుగా లక్ష్మీ స్తోత్రం చదివి అమ్మవారిని షోడశోపచారాలతో  ఆహ్వానించాలి. 9 పోగులు, 9 ముడులు వేసిన తోరాన్ని దేవికి సమర్పించి, అమ్మవారి రక్షగా మరో తోరాన్ని ఎడమ చేతికి కట్టుకుంటారు. అనంతరం కొన్ని అక్షతలను చేతిలోకి తీసుకొని భక్తి, శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రత కథ చదవాలి.   

వరలక్ష్మీ వ్రత కథ 

 స్త్రీలకు సర్వ సౌభాగ్యములను అందించే  ఈ వరలక్ష్మీ వ్రతమును సాక్షాత్తు పరమ శివుడు పార్వతికి చెప్పాడు. దానిని సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులకు వివరించాడు. ఒక రోజు కైలాస శిఖరాన శివుడు ఆసీనుడై ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి, 'స్వామీ! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేయటం ద్వారా సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో చెప్పమ'ని ప్రార్ధించింది. అప్పుడాయన వరలక్ష్మీ వ్రతం గురించి వివరించి, శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజున దీనిని ఆచరించాలని వివరించాడు. 

పూర్వము మగధ దేశంలో బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళతో కూడిన కుండినమనే గొప్ప పట్టణం ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి సేవించేది. ఉదయాన్నే లేచి, స్నానం చేసి, భర్తను పూజించి, అత్తమామలకు తగు సేవలు చేసేది. ఇరుగుపొరుగు వారితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. ఆమె సద్గుణాలను చూసిన మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగి  కలలో ప్రత్యక్షమై శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను పూజించమని చెప్పింది. అమ్మవారు చెప్పినట్లుగానే శ్రావణ మాసపు పౌర్ణమి ముందు శుక్రవారము రోజున ఎంతో ఉత్సాహంతో చారుమతి, ఆమె బంధువులు, ఇరుగుపొరుగు స్త్రీలందరూ ఉదయమే తలారా స్నానం చేసి, పట్టు బట్టలను ధరించి గోమయముతో అలికిన పీఠంపై మంటపం ఏర్పరచి కలశ స్థాపన చేసి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసి షోడశోపచార సేవలతో పూజించారు. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకొని అమ్మవారు చెప్పిన తీరుగానే వ్రతం పూర్తి చేసి వరలక్ష్మీ దేవికి పలు పిండి వంటలు చేసి నైవేద్యంగా సమర్పించారు. వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి, ఇతర స్త్రీలంతా మంటపం చుట్టూ ప్రదక్షణలు చేస్తుండగానే అమ్మవారి అనుగ్రహం చేత వారు నవరత్నాలతో కూడిన బంగారు ఆభరణాలతో అలంకరించబడ్డారు. చారుమతి మొదలు వ్రతంలో పాల్గొన్న వారి ఇళ్ళు స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు సిద్దించాయి. జీవితాంతం వారు ఆయా ఐశ్వర్యాలను అనుభవించారు. కావున 'ఓ పార్వతీ! ఎవరైనా భక్తి, శ్రద్దలతో ఈ వ్రతమును చేసినా,ఇతరులకు చెప్పి చేయించినా, ఈ కథను వినినా సర్వసౌభాగ్యములు పొందుతారు' అని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు.

 దీంతో వరలక్ష్మీ వ్రత కథ పూర్తవుతుంది. అనంతరం అరచేతిలోని అక్షతలను కలశం మీద చల్లి నమస్కరించి, కొన్ని అక్షతలను మీ మీదా, మిగిలిన వారిమీదా చల్లాలి. అనంతరం  అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంగళ హారతి ఇవ్వాలి. చివరగా ముత్తయిదువులకు నానబెట్టిన శెనగలు, తాంబూలం, అమ్మవారి నైవేద్యం ఇచ్చి నమస్కరించుకోవాలి. దీంతో వ్రతం పూర్తయినట్లే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE