భారతీయ సంప్రదాయంలో శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది రాఖీ పూర్ణిమ లేక రక్షా బంధన్ పండుగగా ప్రాచుర్యంలో ఉంది. దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండగ రోజున సోదరుల శ్రేయస్సును, భద్రాన్ని కోరుతూ అక్క, చెల్లెళ్ళు రాఖీ కడతారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఈ పూర్ణిమను నారికేళ పూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారికేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు.  శ్రీ మహా విష్ణువు హయగ్రీవునిగా ఆవిర్భవించిన రోజు, వైఖానస ఆగమాన్ని రూపొందించిన విఖనస మహర్షి జయతి కూడా ఈ రోజే. 

పురాణ, చారిత్రక  ప్రస్తావన

 మహాభారతాల్లోనూ రక్షాబంధన ప్రస్తావన ఉంది.  ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాడు. దానిప్రకారం పూర్వం జరిగిన  దేవ దానవ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చిందట. అప్పుడు దేవేంద్రుడి భార్య శచీదేవి భర్తకు రక్ష కట్టి యుద్ధానికి పంపగా  ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడి  విజయం సాధించాడట.

ఈ రోజున హయగ్రీవ జయంతి జరుపుకోవటం  వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు అమ్మవారిని తన తపస్సు ద్వారా మెప్పించి మరణం లేకుండా వరాన్ని కోరగా, అది సాధ్యపడదని చెప్పింది. అప్పుడు ఆ రాక్షసుడు తనకు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే మరణం పొందేలా వరం కోరగా అమ్మవారు అనుగ్రహించింది. వరగర్వంతో పెట్రేగి పోయిన ఆ  రాక్షసుడు ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెడుతుండగా దేవతల కోరికపై విష్ణుమూర్తి వాడితో యుద్దానికి దిగి ఓడిపోయాడు. యుద్ధం చేసి అలసిన విష్ణువు వింటికి బాణాన్ని ఎక్కుపెట్టి నిద్రకు ఉపక్రమించిన సమయంలో శివుని సలహాపై దేవతలు వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరికేలా ప్రేరేపిస్తారు. ఆ ధ్వనికి ఆయన నిద్ర లేస్తాడని దేవతలు భావిస్తారు. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల తెగి ఎగిరి వెళ్ళింది. అప్పుడు అమ్మవారి సూచన మేరకు దేవతలు ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించగా ఆయన గుర్రపు తలతో యుద్ధ రంగాన నిలిచి ఆ రాక్షసుడిని సంహరించాడట. ఆయన తిరిగి  లేచిన శ్రావణ పూర్ణిమ  నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.ఈ రోజున హయగ్రీవుడిని పూజించినవారికి  ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి. 

అలెగ్జాండరు చక్రవర్తి భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు పురుషోత్తముడనే రాజు ఆయనను తీవ్రంగా ప్రతిఘటిస్తాడు. ఆయన  ప్రాభవాన్ని విని భయపడిన అలెగ్జాండరు భార్య పురుషోత్తముని కలిసి శ్రావణ పూర్ణిమనాడు రాఖీ కట్టి తన భర్తకు హాని తలపెట్ట వద్దని  పురుషోత్తముని అర్ధిస్తుంది. ఆమెను తన ఆడపడుచుగా భావించిన పురుషోత్తముడు మరునాటి యుద్ధంలో అలెగ్జాండరు తనకు పట్టుబడినా వదిలి పెట్టినట్లు చరిత్ర చెబుతోంది.  

ఇతర విశేషాలు 

జంధ్యాన్ని యజ్ఞోపవీతం, బ్రహ్మసూత్రమనే పేర్లతోనూ  పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్షాత్తూ  గాయత్రి దేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. అందుకే బ్రాహ్మణులు ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వేదాధ్యయనం నిమిత్తం చేరిన విద్యార్థులకు ఈ రోజునుంచే వేదాన్ని బోధిస్తారు.

 విధులు

శ్రావణ పూర్ణిమ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి నూతన వస్త్రాలు లేదా ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి ఇష్టదైవాన్ని పూజిస్తారు. పూజలో ఉంచిన రక్షాబంధనాన్ని మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అక్కచెల్లెళ్ళు సోదరులకు కడతారు. అనంతరం వారికి హారతి ఇచ్చి తీపి పదార్థాలను తినిపిస్తారు. అనంతరం  రాఖీ కట్టిన వారికి సోదరులు యధాశక్తి కానుకలు ఇవ్వటం ఆనవాయితీ!Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE