ఉపనిషత్తుల కాలంలో ఉద్భవించిన సత్యం, శివం, సుందరం, ప్రేమ పవనాలు అనంతరకాలంలో ఒకే ఒక మహా మహితాత్మునిలో కేంద్రీకృతమై భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా, రాజకీయంగా స్పందింపజేశాయి. గీతాకారుడైన శ్రీకృష్ణుని వాక్కులు నేటికీ భారతీయ జీవనంపై అమోఘమైన ప్రభావాన్ని ప్రసరింపజేస్తూనే ఉన్నాయి. భారతీయ సంస్కృతినుంచి శ్రీకృష్ణుని పాత్రను తొలగిస్తే మిగిలేది అత్యల్పం అంటారు స్వామి రంగనాథానంద. మన ధర్మం, తత్వశాస్త్రం, భక్తిమార్గం, వాఞ్మయం, చిత్రలేఖనం, శిల్పం, నృత్యం, సంగీతం- జాతి సంస్కృతి నాగరికతలకు సంబంధించిన అన్ని అంశాల్లో శ్రీకృష్ణుని ముద్ర గోచరిస్తుంది. బహుజన హితం, బహుజన సుఖం లక్ష్యంగా సుసంపన్నమైన వ్యక్తిత్వం కలిగినవారే అవతారపురుషులు. కృష్ణావతారం పరిపూర్ణమైనది. ఆయన పరిపూర్ణ పురుషుడు. ఆయన రసస్వరూపుడు. గురువు, నేత, రాజనీతివేత్త, మహర్షి, యోగి, విశ్వసారథి. చివరకు విధిచేతిలో లొంగిన మానవోత్తముడు. 

             దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనలనే త్రిపుటి కృష్ణావతార పరమార్ధం. ఈ ఉద్యమానికి శ్రీకృష్ణుడు విశ్వరథ సారథ్యం వహించాడు. ఆయనలో ఒకపక్క మానవత్వం తొణికిసలాడగా, మరోపక్క దివ్యత్వం ప్రకాశించింది. 

            శ్రీకృష్ణుడు అవ్యక్తధర్మానికి వ్యక్తరూపం. అతడికి ఎవరితోనూ ఘర్షణ లేదు. ఘర్షణ పడినవాళ్లు కూడా తమ దుష్టత్వం వల్లనే విభేదించారు తప్ప కారణం ఉండికాదు. ధృతరాష్ట్రుడు దుష్టుడైనా కృష్ణుడి హితవాక్కు అనుసరించలేకపోవడం జరిగిందిగాని, ఘర్షణ పడలేదు. దుర్యోధనుడు కూడా రాయబార ఘట్టాల్లో పాండవులను నిందించినా కృష్ణుణ్ని నిందించడం చేతకాలేదు. అతడు పాండవులకు ఎంత హితుడో తమకూ అంత హితుడేనని వారికి తెలుసు. ఈ సత్యాన్ని భరించగల హృదయ వైశాల్యం వారికి లేకపోయింది. 

           కృష్ణుడి జీవితంలో ఇతరులకు అతడి నిమిత్తంగా సన్నివేశాలు ఉన్నాయిగానీ అతడికి సంబంధించిన సన్నివేశాలు చాలా అరుదు. చివరకు యాదవ వినాశనంగాని, తన కాలికి తగిలిన బాణంగాని అతడి మనసును తాకిన సన్నివేశాలు కాలేకపోయాయి. అతడి జీవితంలోని సుఖదుఃఖాలకు సంబంధించిన సందర్భాలేవీ అతడి మనసును తాకలేకపోవడం మానవాతీతమైన లీల. కృష్ణుడి జీవితంలో తనకోసం ఆచరించిన ధర్మమూ కనిపించదు. తమ స్వధర్మాన్ని లోకహితంగా ఆచరించడానికి సంకల్పించినవారు సాధువులు. స్వధర్మాన్ని స్వార్థానికి వినియోగించుకునేవారు దుష్కృతులు. సాధువులకు రక్షణ ఇచ్చేందుకు, దుష్కృతులను శిక్షించేందుకు అన్ని కాలాల్లో దిగివస్తూనే ఉంటానని కృష్ణుడు చెప్పాడు. కృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైంది. 

            కృష్ణతత్వాన్ని పరిశీలించడం అంటే- సముద్రం లోతును తెలుసుకునే ప్రయత్నం చేయడమే. మహాభారతం కృష్ణుని పరంగా ఒక దర్శనం. భారతంలో ఇమడ్చటానికి అవకాశం లేక పోయిన కృష్ణుని లీలామయ జీవితాన్ని వ్యాసుడు భాగవతంలో కీర్తించాడు. ఆయన బోధించిన జీవనతత్వాన్ని భగవద్గీతలో వివరించాడు. భారతీయుల ఆధ్యాత్మిక, లౌకిక ఆకాంక్షలకు ఆ మహాపురుషుని జీవితంలో సమాధానాలు లభిస్తాయి.                                      

                                                                                                                    - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావుRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE