కృష్ణాష్టమి.. అత్యంత మంగళకరమైన, శుభప్రదమైన రోజు.  ద్వాపర యుగాన ధర్మ సంస్థాపనకై సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువే బాలకృష్ణునిగా అవతరించిన రోజు. శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాటి అర్థరాత్రి దేవకీ, వసుదేవుల నోముఫలంగా చెరసాలలో పరమాత్మ ఉదయించాడు. చెల్లి అయిన దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించే బిడ్డ చేతిలో తనకు చావు తప్పదని తెలుసుకున్న మేనమామ కంసుడు అప్పటికే ఏడుగురు బిడ్డలను సంహరించటంతో దేవకి పొత్తిళ్ళలోని కన్నయ్యను తండ్రి వసుదేవుడు రేపల్లెలోని యశోదా నందులకు  అప్పగించారు. అప్పటినుంచీ పరమాత్మ బాల్యం అంతా  గోకులంలోనే  గడిచింది. కన్నతల్లి యశోద అయినా పెంచిన తల్లి యశోదే  ఎక్కువగా ఆ  కన్నయ్య లీలలను చూసి తరించింది. అందుకే కృష్ణాష్టమిని గోకులాష్టమి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగనే శ్రీ జయంతి అనికూడా పిలుస్తున్నారు.

           దశావతారాల్లో కృష్ణావతారం 8వది కాగా  8వ తిథి అయిన అష్టమినాడు దేవకీదేవి 8వ సంతానంగా పరమాత్మ జన్మించటం విశేషం. మథుర, బృందావనం, ద్వారకలో ఈ కృష్ణాష్టమి వేడుకలను చొసి తరించాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేము. కృష్ణ శబ్దం విన్న మాత్రానే మనసు తెలియని ఆనందానికి లోనవుతుంది. ఒకసారి ఆయన ఉనికిని అనుభూతి చెందగలిగితే జీవితంలో మరేదీ అంత విలువైనవిగా అనిపించవు. ఈ పండుగ పూట కన్నయ్య బాల్యచేష్టలను గుర్తుకు తెచ్చుకొని ప్రతి తల్లీ మురిసిపోతుంది. పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం  కృష్ణాష్టమి. 

పూజా విధి

కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే లేచి, తులసి వేసిన నీటితో తలస్నానం చేసి తులసి తీర్థాన్ని తీసుకోవాలి. పసుపు రంగు బట్టలు ధరించాలి. గడపకు పసుపుకుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. పూజా మందిరంలో ముగ్గులు వేసి పీఠాన్ని ఏర్పరచి దానిపై రాధాకృష్ణుల ప్రతిమను లేక చిత్రాన్ని పెట్టి పసుపు, కుంకుమ,  గంధం, పుష్పాలు, అక్షతలతో అలంకరించుకోవాలి. కంచు దీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి.  సింధూర తిలకాన్ని  ధరించి, తూర్పు దిక్కుకు తిరిగి కూర్చొని 'ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః'  అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత  వేయించిన మినుముల పిండి, చక్కెర మిశ్రమాన్ని, పాలు, పెరుగు, వెన్న, అటుకులను  నైవేద్యంగా సమర్పించి ఆవు నేతి ఒత్తితో హారతి ఇచ్చి పూజను ముగించాలి. కృష్ణష్టామి రోజు ఒంటిపూట భోజనం చేసి భక్తితో కృష్ణ నామ స్మరణ చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

      ఈ పవిత్ర కృషాష్టమి నాడు మనందరిపై ఆ బాలకృష్ణుని కృప వర్షించాలని మనసారా కోరుకుంటూ....Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE