ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ఇస్లాం ప్రబోధిస్తోంది. ఇస్లాం యొక్క 5 మూలస్తంభాల్లో చివరిది హజ్. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలు అచంచలమైనభక్తి, విశ్వాసాలతో చేసే ఈ యాత్ర ఎన్నో నియమాలతో కూడుకొన్నది.కాబా దర్శనంతో మొదలయ్యే ఈ యాత్ర సైతాన్‌ను రాళ్లతో కొట్టడంతో ముగుస్తుంది. ఏటా సుమారు 80 లక్షల మంది భక్తులు హాజరయ్యే ఈ యాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద సాంవత్సరిక యాత్రగా గుర్తింపు పొందింది.ఈ ఏడాది హజ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.

రకాలు

హజ్ లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఉమ్రా. దీన్నే చిన్న హజ్ అని కూడా అంటారు. దీన్ని హజ్ దినాల్లోకాకుండా ఏడాదిలో ఎప్పుడైనా చేయవచ్చు. రెండవది అసలైన హజ్ యాత్ర. దీనినిజుల్ హిజ్జా (ఇస్లామీయ కాలెండర్ లో ఆఖరి మాసం) మాసం లోనే చేయాలి.

అర్హతలు

ముస్లిం మాత్రమే హజ్ యాత్రకు అర్హుడు. హజ్ యాత్రీకుడు శారీరకంగా దృఢoగా ఉండి, కాబాను సందర్శించే ఆర్ధిక స్థోమత కలిగి ఉండాలి. హజ్ యాత్రీకుడు స్వతంతృడై ఉండాలి. బానిసత్వంలో ఉన్నవారు ఈ యాత్రకు అనర్హులు. వీలున్నంత మేరకు యుక్త వయసులో ఈ యాత్ర చేయాలి. మానసికంగా పరిపక్వత ఉన్నవాడై ఉండాలి.ఈ యాత్ర చేసే మహిళలు మహ్రం (మగతోడు) అవసరం. భర్త, తోబుట్టువు, తండ్రి, కొడుకు, తండ్రి అన్నదమ్ములు, తల్లి అన్నదమ్ములథ్ కలిసి యాత్ర చేయవచ్చు. మరణించిన వారి కోసం ఈ యాత్ర చేసే వ్యక్తులు అంతకు ముందే ఈ యాత్రను చేసి ఉండాలి. జీవించి ఉన్న వారికోసం ఈ యాత్ర చేసేటట్లైతే ఆ జీవించి ఉన్న వ్యక్తి ఆరోగ్యంసరిగాలేనివాడై ఉండాలి.

ఎవరు అనర్హులు 

 కష్టపడి సంపాదించిన డబ్బుతోనే హజ్‌ యాత్ర చేయాలి. అప్పులున్నవాడు, వడ్డీలు,సబ్సిడీలు,దానధర్మాల డబ్బుతో యాత్ర చేయదలచినవాడు, కుటుంబ బాధ్యతలు పూర్తిగాతీర్చనివాడు, తనపై ఆధారపడిన బిడ్డలు,పెళ్ళికాని కూతురు ఉన్నవాడు, రోగపీడితుడు ఈ యాత్రకు అనర్హుడు.

ప్రధాన ఘట్టాలు 

సౌదీ అరేబియాలోనిమక్కా నగరంలో గల మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) లో ఉన్న పవిత్రమైన కాబా గృహం దర్శించటం ఈ యాత్రలో ప్రధాన ఘట్టం. కాబా అనేది ఒక ప్రాచీన రాతి కట్టడం. ఇది ఇబ్రహీం ప్రవక్తచే నిర్మింపబడినది. హజ్ యాత్రీకులంతా'కాబా గృహం చుట్టూ ఏడుసార్లు కాబా వైపు తిరిగి అపసవ్య దిశలో తవాఫ్ (ప్రదక్షిణ) లు' చేస్తారు. ఇక్కడ చేసే ఒక నమాజ్‌లక్ష నమాజ్‌లకు సమానమని భక్తుల నమ్మకం.కాబా గోడలో అమర్చిన రాయిని పరలోకం నుండి వచ్చిన రాయిగా భావించి యాత్రీకులు తాకి ముద్దు పెట్టుకుంటారు.

ఈ యాత్రలో మరో ప్రధానమైన ప్రదేశం జమ్ జమ్ బావి. ఇస్లాం ధర్మ శాస్త్రాల ప్రకారం ఇబ్రహీం ప్రవక్త మరియు హాజిరా ల తనయుడైన ఇస్మాయిల్ బాల్యంలో ఒకసారి తీవ్రమయిన దాహంతో బాధ పడతాడు. ఆ సమయంలో ఆయా తల్లి హాజిరా నీటి కొరకు అన్వేషిస్తున్న సమయంలో సఫా, మర్వా అనే కొండల మధ్య నల్లరాతి నేలలో దైవదూత తన రెక్కలతో నేలను కదిలించగా ఈ జమ్‌ జమ్‌ బావి ఏర్పడి అందులోనుంచి జలంపెల్లుబికిందని చెబుతారు.ఎడారి ప్రాంతంలో అల్లా అనుగ్రహంతో ఇస్మాయిల్ పాదాల చెంతనే ఆవిర్భవించిన ఈ బావి నీటిని పరమ పవిత్రమైన అల్లా ప్రసాదంగా భావించి యాత్రికులు తమతోపాటు తీసుకువస్తారు. ఈ నీరు దప్పికనేగాక ఆకలినిగూడా తీరుస్తుందనీ, సర్వరోగనివారిణి అని వారి నమ్మకం. హజ్ యాత్రికులు తమ ఇహ్రామ్ (హజ్ సమయంలో ధరించే వస్త్రాలు) లను ఈనీటితో తడిపి పవిత్రంచేసి తీసుకువస్తారు. ఈ వస్త్రాలను తమ కఫన్లు( అంత్యక్రియల సమయంలో ధరింపజేసే తెల్లని వస్త్రాలు) ఈ నీటితో పవిత్రం చేయాలనీ, దీనివల్ల తమ పరలోక యాత్ర సానుకూలంగా సాగుతుందని విశ్వసిస్తారు.

అనంతరంయాత్రికులు అక్కడి అరాఫత్ మైదానంలో నమాజ్‌ చేసి అనంతరం ముజ్దలిఫాకు వచ్చి ఏడు కంకర రాళ్లను ఏరుకొని మూడురోజుల పాటు జుమ్రాద్‌ వైపు వెళ్లి సైతాన్‌ మీదకు ఆ రాళ్లు విసురుతారు .అనంతరంఖుర్బానీ ఇచ్చి తాము చేసిన హజ్‌ను ఆమోదించమని వేడుకుంటారు. పురుషులు శిరోముండనం లేదా నిర్ణీత పొడవునా జుట్టును కత్తిరించుకుంటారు. 

ఇతర విశేషాలు

  • హజ్ యాత్రను తొలిసారి క్రీ.శ. 628 లో ముహమ్మద్ ప్రవక్త తన అనుచరులతో చేశారు.
  • ఈ యాత్రకు వెళ్లే పురుషులు ముందుగా రెండున్నర మీటర్ల, రెండు బట్ట ముక్కలతో కూడిన ఎహ్రాం (వస్త్రం)ను,ధరిస్తారు. మహిళలలైతే సంప్రదాయ దుస్తులు ధరించి నమాజ్ చేసి హజ్ యాత్రకు బయలుదేరతారు.
  • హజ్ యాత్ర చేసిన వారిని హాజీలు అంటారు. వీరు జీవితాంతం దైవం పట్ల భక్తి శ్రద్దలతో ఆయన మార్గంలో పయనించాలి. తోటివారికి సహాయపడాలి. క్రమశిక్షణతో జీవితాన్ని గడపటంతోపాటు చీమకు కూడా హాని తలపెట్టరాదు. అబద్ధాలు ఆడకుండా, ఒకరిపై చాడీలు చెప్పకుండా ఓర్పు, సహనంతో నడవడిక కొనసాగాలి. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడే ఈ యాత్ర చేయగలిగితే జీవితాన్ని మరింతగా సార్ధకం చేసుకోవచ్చని పెద్దలు చెబుతారు.
  • హజ్ కు వెళ్లే స్తొమత లేనివారు వెళ్ళివచ్చిన వారికి స్వాగతమివ్వడం పుణ్యదాయకమని తలుస్తారు.
  • హజ్‌ చేస్తారో వారు తల్లి కడుపులో నుంచి పుట్టిన పసిబిడ్డలా స్వచ్ఛంగా తిరిగి వస్తారని ఇస్లాం చెబుతోంది. 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE