అమృతమయి అయిన ఆదిశక్తి అఖిల బ్రహ్మాండాన్ని రక్షించడానికి అపరకాళిగా అవతారం దాల్చింది. సప్తమినాడు దుర్గాదేవిని కాళరాత్రీదేవి అవతారంలో ఆరాధించడం సంప్రదాయం. కాళరాత్రి నల్లని మేఘపు రంగులో, విరబోసుకొన్న జుట్టుతో, గాడిద మీద ఆసీనురాలై భీకరమైన వికటాట్టహాసంతో మృత్యువుకే భయం కలిగిస్తుంది. మిరుమిట్లు గొలిపే ఇనుపముళ్ల మాలలను కర చరణ కంకణాలుగా,కుండలాలుగా, కంఠ మాలలుగా ధరించి ఉంటుంది. ఎర్రని మూడు నేత్రాలతో, తీక్షణమైన చూపులతో చూపరులను భయావహులను చేస్తుంది. అమ్మ ఉచ్వాస నిశ్వాసలు అగ్ని కీలల్ని వెడలగ్రక్కుతుంటాయి. నాలుగు చేతుల్లో కుడివైపు ఒకచేత అభయముద్రను ఒకచేత వరద ముద్రను, ఎడమవైపు ఒకచేత ఇనుప కంటకపు ఆయుధాన్ని ,మరొకచేత రక్తసిక్తమైన ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. 

నలుపు రంగులో శోభిల్లే కాళరాత్రిని ఆరాధిస్తే తెల్లని, చల్లని వెన్నలాంటి మనసుతో సుభిక్షను ప్రసాదిస్తుంది. దుర్గుణాలనూ, దుష్టశక్తులనూ పారద్రోలి, సత్యకర్మలను ప్రేరేపిస్తూ, మంచి బుద్ధులను వృద్ధి చేస్తూ మానవాళికి ప్రేరణనిస్తుంది.  అమ్మవారు చూచేవారికి మహౌగ్ర రూపిణిగా కనిపించినప్పటికీ ధర్మ మార్గంలో పయనించే వారిని సర్వకాల సర్వావస్థల్లో అన్ని సంకటాల నుంచీకాపాడుతుంది. అందుకే అమ్మను 'శుభంకరి' అంటారు. దుష్టులను అంతమొందించడమే ఈ అవతార పరమార్ధం . కాళరాత్రి పేరు విన్నంతనే దుష్టగ్రహాలు సర్వభూతప్రేత పిశాచాలు, రాక్షస సమూహాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొనిపరుగులు తీస్తాయి. భక్తితో అమ్మను ఉపాసించే వారికి రాత్రి, అగ్ని, నీరు, జంతువులు, అపజయంగానీ, క్షుద్రశక్తుల భయం గానీ ఉండదు. 

ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ సాధకునికి బోధపడతాయి. సాధకులు కాళరాత్రి మాత రూపాన్ని హృదయంలో నిలుపుకొని నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ తల్లి సాక్షాత్కారం పొందిన వారి సమస్త పాపాలు, విఘ్నాలు క్షణకాలంలో పటాపంచలైపోతాయి. అమ్మస్మరణ, ధ్యానము, పూజ అక్షయ ఫలితాన్నిస్తాయి. ఈ రోజున పలురకాల కూరగాయలతో ముఖ్యంగా పచ్చదనం నిండిన వాటితో శాకాన్నం లేదా కూరగాయలతో కలగాయ కూర పులుసూ, అన్నం గానీ అమ్మవారికి నివేదించాలి.

శ్లోకం

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా ।

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE