• HOME
  • భక్తి
  • చిద్విలాసిని రాజరాజేశ్వరి

శరన్నవ రాత్రులలోచివరి (10వ) రోజును దసరాగా జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. తొమ్మిది రాత్రులు, పగళ్లు మహిషాసురునిపై యుద్ధం చేసిన అమ్మవారు దశమి రోజున అమ్మవారు రాక్షససంహారం చేసింది గనుకఆరోజును విజయదశమి పేరిట పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. ఈ రోజునే రామరావణ సంగ్రామం ముగిసిందనీ, ఇదేరోజు పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తిచేశారని విశ్వాసం. అందుకే ఈ రోజున రావణ వధతో బాటు శమీపూజ చేస్తారు.

పురాణ గాధ

బ్రహ్మ వరముతో మహిషాసురుడు దేవతలను ఓడించి ఇంద్రపదవి చేపట్టగా ఇంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొన్నాడు . వాని అరాచకాలను విన్నప్పుడు త్రిమూర్తుల్లో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారి జగన్మాతగా రూపుదాల్చింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగిన జగన్మాత 18 భుజాలతో కన్నులు చెదిరే తేజస్సుతో నిలిచింది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము,హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది.సింహవాహనగా 9 రోజులు మహిషాసురునితో తలపడిన అమ్మవారు దశమినాడు వాడిని సంహరించింది. మహిషుని పీడ విరగడ అయిన ఆదశమిని దసరా పర్వదినంగా జరుపుకుంటున్నారు.

అవతార విశేషాలు

శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. 'శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం' అని మంత్రంతో ఈ రోజున శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను.రాజరాజేశ్వరి జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. మణిద్వీపంలో శ్రీనగరంలోని చింతామణే ఆమె నివాసం. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది. లడ్డూలు నివేదన ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారికి పసుపు రంగు దుస్తులను అలంకరిస్తారు.నైవేద్యంగా చిత్రాన్నం, లడ్డూలను నివేదిస్తారు.

శ్లోకం

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా

గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా

ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE