• HOME
  • భక్తి
  • సత్యప్రమాణాల దేవుడు.. కాణిపాకం గణపయ్య

కోరిన వరాలిచ్చే దేవుడిగా, విఘ్న నివారకుడిగా పేరొందిన గణపయ్య చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వరసిద్ది వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. స్వామి స్వయంభువుగా నిలిచిన ఈ క్షేత్రానికి  వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. ఇక్కడి ఆలయం సత్య ప్రమాణాలకు నెలవుగా ప్రసిద్ది పొందింది. 

స్థలపురాణం

వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పుట్టు మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గురు సోదరులు తమ కాణి (ఎకరం బాతిక నేల) లో సాగుచేసుకొని జీవితాన్ని గడిపేవారు. ఒక ఏడాది తీవ్రమైన కరువు వచ్చి ఎక్కడా నీళ్ళు దొరకని పరిస్థితిలో ఆ అన్నదమ్ములు తమ పొలంలోని బావిలో చేరిన పూడిక తీయటం మొదలుపెట్టారు. వారిలో గుడ్డి వాడు నూతి గట్టుమీదే ఉండగా మిగిలిన ఇద్దరు లోపలి దిగి  తవ్వు తుంటే ఠంగ్ మనే శబ్దం వచ్చి ,వెచ్చటి నెత్తురు పైకి చిమ్మింది. నెత్తురు ఒంటిపై పడగానే లోపలున్న ఇద్దరికీ మాట, వినికిడి వచ్చాయి. ఈ నెత్తుటి ధార పొంగి ప్రవహిస్తూ బావి మీదున్న వాడిమీద పడి చూపు రాగానే ముగ్గురూ పరుగెత్తుకు పోయి రాజుకు ఈ సంగతి వివరించారు .రాజు సపరివారంగా అక్కడికి వచ్చి లెక్కలే నన్ని కొబ్బరి కాయలు కొట్టగా నెత్తురు ప్రవాహం ఆగిపోయింది. ఆ కొబ్బరి కాయల నీరు కాణి ( 1.25 ఎకరాల నేల) మేర ప్రవహించటంతో నాటినుంచి ఆ వూరి పేరు  కాణిపాకం అయింది. తరువాత నూతిలో నీరు తోడి చూడగా దెబ్బతిన్న వినాయక విగ్రహం కనిపించగా నాటినుంచి అక్కడే పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కుళోత్తుంగ చోళుడు ఈ స్వామి మహిమ విని ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

ప్రత్యేకతలు

  • గతంలో చిన్నమూర్తిలా దర్శనమిచ్చే స్వామి ఇప్పుడు పెద్ద బొజ్జ, మోకాళ్ళు, భుజాలతో స్పష్టంగా కనిపించటాన్నిబట్టి స్వామి ఏటా పెరుగున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత కాలపు చిత్రాలు, ఆధారాలను పరిశీలించినప్పుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. 1945లో అరగొండపల్లెకు చెందిన భక్తుడైన బెజవాడ సిద్దయ్య, లక్ష్మమ్మ దంపతులు స్వామికి నిండుగా చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోకపోవటంమరో నిదర్శనం .
  • నాటి బావి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ మూలవిరాట్టు చుట్టూ ఎప్పుడూ నీరు ఉంటుంది. నాడు స్వామికి తగిలిన గునపపు దెబ్బకు గుర్తుగా మూర్తి వీపు భాన చిన్న గంటు కనిపిస్తుంది.
  • ఇక్కడి శ్రీవరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్యప్రమాణాలకు నెలవు. ఏదైనా వివాదం వచ్చినప్పుడు రెండు పక్షాల వారూ పవిత్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామి సన్నిధిలో ప్రమాణం చేస్తారు. ఎంతటి వాడైనా స్వామి సన్నిధిలో అసత్యం చెప్పేందుకు ధైర్యం చేయరు. ఆంగ్లేయుల కాలంలోని కోర్టులో ఇక్కడి ప్రమాణాలకు న్యాయమూర్తులు విలువ ఇచ్చేవారు.
  • తీవ్రమైన వ్యసనాలకు, అనైతికమైన అలవాట్లకు బానిసలైన వారు స్వామి ఎదుట ప్రమాణం చేస్తే  తప్పక మానుకుంటారని ప్రతీతి. స్వామిని 11 రోజులు దీక్ష గా పూజిస్తే సంతాన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయని నమ్మకం.  

ఉపాలయాలు

కాణిపాకం ప్రధాన ఆలయానికి అనుబంధంగా వాయువ్యాన శ్రీ మరకదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. బ్రహ్మహత్యా పాతక పరిహారం కోసం రాజరాజ కుళోత్తుంగ చోళ నరేంద్ర మహారాజు ఈ  మణికంఠేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారని అంటారు. ఈ ఆలయంలో ఒక నాగుపాము తిరుగుతూ వుంటుందనీ, అది ఎవరికీ హానిచేయదని చెబుతారు. వినాయక ఆలయానికి ఈశాన్య మూలన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయముంది. దీనిని సర్పయాగ పరిహారంగా  జనమేజయ మహారాజు నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో రోజూ  సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వీరాంజనేయస్వామి ఆలయం, నవగ్రహాలయాలు ఉన్నాయి.

ఆలయ సమాచారం

ఏటా వినాయక చవితి నుంచి తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు, 12 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు యధావిధిగా స్వామివారికి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. మరింత ఆలయ సమాచారం కోసం ఆలయ వెబ్ సైట్ (www.kanipakam.com) ను చూడవచ్చు. 

వసతి, రవాణా:  ఈ క్షేత్రం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు, తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. కాణిపాకంలో బస కోసం తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి,  చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE