• HOME
  • భక్తి
  • ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించే ధనత్రయోదశి  

ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ఉత్తరాదిన 'ధన్‌ తేరస్‌' పేరిట, దక్షిణాదివారు ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ పండుగనే కొన్ని ప్రాంతాల్లో యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అనే పేర్లతో వ్యవహరిస్తారు. దేవవైద్యుడైన ధన్వంతరి జన్మదినం, శ్రీమన్నారాయణుడు వామనుడిగా వచ్చి బలిదానాన్ని స్వీకరించినదీ ఈ రోజే. ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కోసం ఈ రోజు యముడిని, ధన్వంతరిని, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

ఈ పండుగకు సంబంధించిన పురాణ గాథ ప్రకారం కలియుగం తొలినాళ్లలో త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారనే విషయాన్ని పరిశీలించేందుకు భృగు మహర్షి వైకుంఠానికి వెళతాడు. ఏకాంతంగా ఉన్న లక్ష్మీ నారాయణులు మహర్షి రాకను పట్టించుకోకపోవటంతో కోపోద్రిక్తుడైన భృగుమహర్షి శ్రీహరి వక్షస్థలాన్ని కాలితో తన్నగా, శ్రీహరి హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవి తన స్థానాన్ని అవమానించినందుకు అలిగి వైకుంఠాన్ని వదిలి నేటి మహారాష్ట్రలోని కొల్హాపూర్ (కరవీరపురం) చేరుతుంది. అలా అమ్మవారు ధన త్రయోదశినాడు భూమ్మీద తొలిసారి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. 

ఈ పండుగకు సంబంధించిన మరో గాథ కూడా ప్రచారంలో ఉంది.  పూర్వం హిమవంతుడనే రాజుకు వివాహమైన చాలా ఏళ్లకు కొడుకు పుడతాడు. బాలుడి జాతం చూసిన జ్యోతిషులు వివాహమైన నాలుగో రోజు సర్పగండం కారణంగా ప్రాణాలు కోల్పోతాడని చెబుతారు. కుమారునికి 16 ఏళ్ళు రాగానే హిమవంతుడు కుమారుడికి పెళ్లి చేస్తాడు. సర్పగండం తప్పించుకునేందుకు పెద్దల సలహా మేరకు హిమవంతుని కోడలు వివాహమైన నాలుగో రోజు రాత్రి తమ భవనాన్ని దీపాలతో అలకరించి, ఆ రాత్రంతా శ్రీమహా విష్ణువును వెండి, బంగారం, రత్నాలతో పూజిస్తుంది. యువరాజు ప్రాణాలను హరించేందుకు పాముగా వచ్చిన యమధర్మరాజు అక్కడి దీప, బంగారు కాంతులకు కన్ను చెదరి ఆ వైభవాన్ని అలా చూస్తూ ఉండిపోయి, వచ్చిన పనిని మరచిపోయి మరునాటి ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోవటంతో యువరాజు ప్రాణగండం నుంచి బయటపడతాడు. అందుకే మహిళలు ఈ రోజున తమ పసుపుకుంకుమలు పదికాలాలు ఉండేలా ఆశీర్వదించమని కోరుతూ లక్ష్మీనారాయణులను పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. 

ఈ రోజు ఎవరు ఏ పనిని చేస్తారో ఏడాదంతా అదే పని చేస్తారని పెద్దలు చెబుతారు. అందుకే గతంలో ధన త్రయోదశి రోజున దానము, గో సేవ వంటి ఉత్తమమైన పనులు చేసి సంవత్సరం అంతా అదే భాగ్యం దొరకాలని కోరుకునేవారు. ఇందులో భాగంగానే ఆ రోజున ఏదైనా విలువైన వస్తువు సమకూర్చుకోవటమూ సంప్రదాయంగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో ఈ సంప్రదాయం పెడధోరణిగా మారి ఏది ఏమైనా ఆరోజు బంగారం కొనాల్సిందేనని, లేకపోతే నష్టమనే ప్రచారం జరుగటం నిజంగా దురదృష్టకరం. 

సంపూర్ణమైన ఆయువును ప్రసాదించమని ఈ రోజున యమధర్మరాజును భక్తితో పూజిస్తారు. ధనత్రయోదశి సూర్యాస్తమయ సమయంలో ఇంటి సింహద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. దీనితో బాటు ఇంటి దక్షిణ దిక్కున ఏదైనా ధాన్యం పోసి దానిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఇలా యమ దీపాలు పెడితే యముడు సంతసించి వారికి సంపూర్ణమైన ఆయుస్సును అందిస్తాడని చెబుతారు.

 క్షీరసాగర మథనం జరిగినప్పుడు ధనత్రయోదశినాడేధన్వంతరి ఉద్భవించిన కారణంగా ఈ రోజున ఆయనను పూజించిన వారికి మంచి ఆరోగ్యం సమకూరుతుంది. 

శుచిగా ఉండే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది గనుక ఈరోజు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని ముగ్గులు పెడతారు. అనంతరం అభ్యంగన స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ధన పూజచేస్తారు. ఇంట్లో ఉన్న బంగారు వస్తు వులను, వెండి వస్తువులను పాలతో కడుగు తారు. ఈ రోజు వ్యాపారస్తులు గడచినా ఏడాది లెక్కను సరిచూసుకుని లక్ష్మీ పూజ చేస్తారు.ఈ రోజు మినుములు, మినప ఆకు చేర్చి వండిన వంటకాలు తయారు చేసి నైవేద్యంగా పెట్టి ఆరగిస్తారు. 

శక్తి ఉన్నవారు బంగారు కాసును  తమలపాకుపై పెట్టి పసుపుకుంకుమలతో పూజించి వస్త్రంలో కట్టి డబ్బు పెట్టె చోట దాచుకుంటారు. బంగారం కొనలేని వారు 18 బియ్యం లేదా గోధుమ గింజలతో బాటు  తులసి లేదా మారేడు దళం పెట్టి పసుపు రాసిన తెల్లని వస్త్రంలో కట్టి దాచుకుంటారు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE