ధనత్రయోదశి మరునాడు నరక చతుర్దశిగా జరుపుకోవటం ఆనవాయితీ. పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రాగ్-జ్యోతిషపురాన్ని రాజధానిగా పాలించేవాడు. భూదేవి సంతానమైన నరకుడు మునులను హింసించటంతో బాటు 16 వేల మంది కన్యలను చెరబట్టాడు. ఆ రాక్షసుడు దేవతలను సైతం ఇబ్బందులకు గురిజేయటంతో వారంతా  శ్రీకృష్ణుడిని ఆశ్రయించి నరకుని అరాచకాలను వివరించి వాడి పీడ విరగడ చేయమని మొరపెట్టుకున్నారు. అయితే భూదేవి కుమారుడైన నరకుడు తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ చావడని తెలిసిన కృష్ణుడు భూదేవి అంశయైన సత్యభామతో కలిసి అతనితో యుద్దానికి బయలుదేరతాడు. యుద్ధంలో నరకుని ధాటికి శ్రీకృష్ణుడు మూర్చినొంది పడిపోగా భర్త చెంతనున్నసత్యభామ ఆయుధం చేపట్టి నరకుని కోలుకోలేంతగా దెబ్బతీస్తుంది. సత్య భామ సాక్షాత్తూ తన తల్లి అనీ, శ్రీ కృష్ణుడు శ్రీమన్నారాయణుడని గుర్తించిన నరకుడు కృష్ణుని చేతిలో మరణం కోరుకోగా కృష్ణుడు చక్రాయుధంతో నరకుని సంహరించాడు.  నరకాసురుడి వధ జరిగిన ఆశ్వియుజ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకుంటున్నాము.

పాటించాల్సిన విధులు

నరక చతుర్థశి రోజు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి యముని తలచుకొని ఆయనకు నువ్వుల నీటితో తర్పణం ఇవ్వాలి. అనంతరం పూజ చేసుకోవాలి. తిరిగి సాయంత్రం  ప్రదోషకాలంలో తల్లిదండ్రులు లేనివారు పితృదేవతల కోసం 4 ఒత్తులతో కూడిన యమదీపాన్ని ఇంటికి దక్షిణ దిక్కున ధాన్యం పోసి వెలిగిస్తారు . పూర్వీకులు ఎవరైనా నరకంలో ఉంటే వారికీ దీపం స్వర్గమార్గాన్ని చూపుతుందని పెద్దల నమ్మకం. 

అలాగే ఈ రోజు ప్రదోషకాలంలో దీపదానం చేస్తారు. దీనివల్ల ఆ మనిషికి నరక భయం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం ఇంటి ఆవరణలో, తర్వాత ఆలయంలోనూ దీపాలు వెలిగిస్తారు. రాత్రి కాగానే 14 రకాల కూరగాయలతో చేసిన వంటకాలతో బ్రాహ్మణుడికి  భోజనం ఏర్పాటు చేస్తారు. అతిథి భోజనం అయిన తర్వాత ఆయనను యథాశక్తి సన్మానించి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE