• HOME
  • భక్తి
  • పర్వదినాల సమాహారం కార్తీకం

 అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చేసింది.  శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతి పాత్రమైన మాసమిది. కార్తీక పౌర్ణమితో బాటు మరెన్నో పర్వదినాలను ఈ మాసం తీసుకురానుంది. ఆ పర్వదినాల వివరాలు, వాటి వెనుక వున్న కొన్ని విశేషాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 

యమ ద్వితీయ (నవంబర్ 1): దీపావళి వెళ్లిన 2 రోజులకు వచ్చే శుక్లపక్ష విదియను భాతృ ద్వితీయ, యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం పేరిట పర్వదినంగా జరుపుకుంటారు. ఒకప్పుడు సమవర్తి అయిన యమ ధర్మ రాజు శుక్లపక్ష విదియ నాడు తన సోదరి అయిన యమున ఇంటికి వెళ్లగా ఆమె అన్నగారికి ఎంతో అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇస్తుంది. సోదరికి తన పట్ల గల ప్రేమ, ఆదరణకు మురిసిపోయిన యముడు సోదరిని వరాన్ని కోరుకోమని అనగా  శుక్లపక్ష విదియ నాడు సోదరి ఇంట భోజనం చేసి ఆమెను సంతోషపెడతారో అలాంటి వారికి అపమృత్యు భయం, నరకలోకభయం  లేకుండా చేయమని సోదరుని కోరగా యముడు దానికి అంగీకరిస్తాడు. నాటినుంచి ఆ రోజు సోదరి లేదా సోదరితో సమానమైన వారి ఇంట భోజనం చేయటం సోదరులకు ఆనవాయితీగా మారింది. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి ఉన్నంత కాలం పసుపుకుంకుమలతో ఉంటుందని పెద్దలు చెబుతారు.

నాగుల చవితి (నవంబర్ 4):  శుక్లపక్ష చవితిని  నాగుల చవితి  పేరిట పర్వదినంగా జరుపుకుంటారు. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ( సుబ్రమణ్య స్వామి) చేసి చలిమిడి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా చిన్నారులు పాము పుట్టవద్ద బాణాసంచా  కాలుస్తారు. సాగరతీరంలో పుట్టలో కోడిగుడ్లను వేయడం ఆచారం. ఈ రోజు నాగేంద్రుని పూజించిన వారికి సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. 

ఉత్థాన ఏకాదశి (నవంబర్ 11) : తొలి ఏకాదశి (ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి) నాడు పాలకడలిలో యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడు గనుక దీనికి ఉత్థాన ఏకాదశి  లేదా ప్రబోధన ఏకాదశి  అంటారు.  చాతుర్మాస్య వ్రతం చివరి రోజైన ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి శ్రీమహావిష్ణువును పూజించినవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 

శుక్లపక్ష ద్వాదశి (నవంబర్ 12):  కృతయుగంలో దేవదానవులు శుక్లపక్ష ద్వాదశి నాడే అమృతం కోసం క్షీరసాగర మధనం చేశారు. అందుకే దీనిని  క్షీరాబ్ది ద్వాదశి , చిలుకు ద్వాదశి అంటారు. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన శ్రీమహాలక్ష్మిని నారాయణుడు చేపట్టినదీ ఈ రోజే. దీనికి గుర్తుగా ఈ రోజు ఇంటి తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించటం ద్వారా సకల సంపదలను పొందవచ్చు. 

శుక్లపక్ష చతుర్దశి (నవంబర్ 13):   శ్రీమహావిష్ణువు శుక్లపక్ష చతుర్దశి నాడు వారణాసి క్షేత్రాన్ని సందర్శించి ఈశ్వర దర్శనం చేసుకొని ఆయనను సేవించినట్లు పెద్దలు చెబుతారు. ఇందుకు గుర్తుగా భక్తులు ఈ రోజు శివాలయంలో స్వామిని దర్శించి దీపం వెలిగిస్తారు. 

కార్తీక పౌర్ణమి (నవంబర్ 14) : కార్తీకమాసంలో విశేషమైన ఈ పర్వదినాన నదీస్నానం చేయటంతో బాటు శివాలయాల్లో నిర్వహించే  జ్వాలాతోరణాన్ని దర్శిస్తే కైలాసప్రాప్తి  సిద్ధిస్తాయి. ఈ రోజు సాయంత్రం వేళ శివాలయంలోగానీ, విష్ణు ఆలయంలో గానీ దీపాలను వెలిగించటంతో బాటు సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 

పైన చెప్పుకొన్న ఈ పర్వదినాలలో పుణ్యస్నానంతో బాటు యధాశక్తి  పూజలు, జపాలు, దానాలు  చేయడం వల్ల సకల శుభాలు చేకూరతాయి.  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE