మన పంచాగం ప్రకారం మార్గశిరం.. తొమ్మిదవ నెల. విష్ణువుకు అత్యంత ప్రియమైన మాసమిది. మాసానాం మార్గ శీర్షోహం అని సాక్షాత్తూ కృష్ణ భగవానుడే గీతలో ప్రస్తావించాడు. అంటే ఈ మాసాన్ని నేనే అని అర్థం. ఈ మాసమే హేమంత ఋతువుకు ఆరంభ సమయం. ఈ మాసంలో చంద్రుడు మృగశిరా నక్షత్రానికి సమీపంలో చరిస్తాడు గనుక దీనికి మార్గశీర్షమనే పేరు వచ్చింది. ఈ మాసంలో ప్రతీక్షణం 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెల విష్ణు ప్రీతికరమైనది కావడం చేత ఆ శ్రీమహాలక్ష్మికి కూడా ఎంతో ప్రీతికరమైనది. ఈ కారణంగానే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో  శ్రీమహాలక్ష్మిని విశేషంగా పూజిస్తారు. 

ధనుర్మాసం

సృష్టికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యుడు మార్గశిరంలోనే  వృశ్చికరాశిలోంచి ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే నెలపట్టడం అంటారు. అప్పట్నుంచి సంక్రాంతి రోజు వరకూ 30 రోజుల్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు. ఈ నెలరోజులూ వైష్ణవులకు అత్యంత పవిత్రమైన సమయం.  ఈ నెలంతా వేకువనే వైష్ణవ ఆలయాల్లో గోదాదేవి తమిళంలో రచించిన 'తిరుప్పావై' పాశురాలు చదువుతారు. హరిదాసుల గానాలు , ప్రతి ఇంటి ముందు తీర్చి దిద్దిన ముగ్గులు, వాటిపై అమర్చిన గొబ్బెమ్మలతో ఈ సంక్రాంతి వరకు వీధులన్నీ కొత్త శోభను సంతరించుకొంటాయి. 

పర్వదినాల సమాహారం

మార్గశీర్ష శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకొంటారు. సంతానం కోరే స్త్రీలు ఈ రోజు స్వామిని పూజిస్తే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆ మరునాడు వచ్చే సప్తమిని మిత్ర సప్తమి అంటారు. ఈరోజు సూర్య భగవానుని ఆరాధన చేస్తారు. మార్గశిర శుద్ధ అష్టమిని 'కాలభైరవాష్టమి'గా వ్యవహరిస్తారు. శివుడు కాలభైరవుణ్ణి సృష్టించిందీ రోజేనని పురాణ కథనం. మార్గశీర్ష త్రయోదశినాడు కొన్ని ప్రాంతాలలో హనుమద్వ్రతము చేస్తారు. ఈరోజున ఆంజనేయస్వామికి వడమాలలు, అప్పాలమాలలు సమర్పించి తమలపాకులతో పత్రిపూజ చేస్తారు. అత్రి,  అనసూయ దంపతులకు త్రిమూర్తి స్వరూపంగా దత్తుడు జన్మించిన మార్గశీర్షమాస పౌర్ణమిని దత్తజయంతిగా జరుపుకుంటారు. మార్గశీర్ష శుద్ధ ఏకాదశిని మోక్ష ఏకాదశిగా జరుపుకొంటారు. కురుక్షేత్రంలో తాతతండ్రులునూ బంధుగణాల్నీ చూసి అస్త్రసన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీతాబోధ చేసిందీ ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును 'గీతాజయంతి'గా వ్యవహరిస్తారు. ఆవేళ కృష్ణుణ్ని పూజించి, గీతాపారాయణ చేస్తే మంచిదని ప్రతీతి. ద్వాదశినాడు తిరుపతిలో స్వామి పుష్కరిణిలో అరుణోదయసమయంలో స్నానం చేయడం మోక్షదాయకం అని చెప్తారు.

 

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE