• HOME
  • భక్తి
  • సుబ్రమణ్య షష్ఠి మాహాత్మ్యం

 మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రమణ్య షష్ఠిగా జరుపుకోవటం మన సంప్రదాయం. తారకాసురుని వధించేందుకు సుబ్రహ్మణ్యుడు ఈ రోజే స్వామి అవతరించాడు. భక్తులు స్కంద, కుమార, మురుగ, షణ్ముఖ (ఆర్ముగ),కార్తికేయ, శరవణ, దండపాణినామాలతోకూడా స్వామిని కొలుస్తారు. అష్టాదశ పురాణాల్లో ఒకటైన స్కాంద పురాణం ఈ స్వామి చరిత్రను వివరిస్తుంది. ఈ పండుగనే తెలుగునాట సుబ్బారాయ షష్ఠిగా జరుపుకుంటారు. సుబ్బయ్య, సుబ్బమ్మ, సుబ్బారావు, సుబ్బారాయుడువంటి పేర్లన్నీఈ స్వామి పేరిట వచ్చినవే. స్వామి వాహనం నెమలి. వల్లీ దేవసేనా సమేతుడిగా దర్శనమిచ్చే ఈ స్వామిని సుబ్రహ్మణ్య షష్టి నాడు కొలిచిన వారికి సకల శుభాలూ చేకూరుతాయి.

పురాణ గాథ

 పార్వతీ పరమేశ్వరులకు జన్మించిన పుత్రుడేలోక కంటకుడైన తారకాసురుని సంహరించగలడని తెలుసుకున్న దేవతలు శివుడిని ప్రణయంలోకి దించేందుకు మన్మథుని ప్రేరేపిస్తారు. ఆయన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేయబోగా శివుడు మూడోకన్ను తెరచి మన్మధుని భస్మం చేస్తాడు. మన్మథ ప్రేరేపణ ఫలితంగా శివునినుండి అప్పుడు వెలువడిన దివ్యతేజస్సును పార్వతీదేవి భరించలేదని దేవతలు అనగా ఆ తేజస్సునుముందుగా అగ్ని, తర్వాత భూమాత స్వీకరించినా భరించలేక చివరకు గంగాగర్భంలో నిక్షిప్తం చేస్తారు. ఒక దశలో గంగమ్మ కూడా ఈ శక్తిని భరించలేక బయటకు వదలగాప్రవాహంలో కొట్టుకుపోయిన ఆ శక్తి ఆరుగురు బాలకులుగా మారి శరవనం ( రెల్లుపొదలతో కూడిన తటాకం) చేరుతుంది. అక్కడఆరుగురు కృత్తికలు (అప్సరసలు) ఆ బాలకులకు చనుబాలిచ్చి పెంచుతారు. కొంతకాలానికి కృత్తికలు తమ లోకానికి వెళ్లగాఈ విషయం తెలిసిన పార్వతీ దేవి'స్కందా' అని పిలుస్తూ స్వామిని అక్కున జేర్చుకొంటుంది. అప్పటివరకు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల బాలకులను అమ్మవారు ఒకే బాలునిగా మార్చి అల్లారుముద్దుగా పెంచుతుంది. ఆయనే తరువాతి కాలంలో దేవతలకు నాయకుడైత్రిపురాసురుని అంతమొందిస్తాడు.

నామవిశేషాలు

శరవనంలో పెరిగిన కారణంగా స్వామికి శరవణ భవుడుఅనీ, కృత్తికలు పాలిచ్చి పెంచారు గనుక కార్తికేయుడని పేరు వచ్చింది. శూలము (దండము, శక్తి,వేలం)నుఆయుధముగా కలిగిన వాడు గనుక స్వామికి వేలాయుధుడు, శక్తివేల్,దండపాణి అని పేరు. గంగా గర్భమున ఉన్న కారణంగా గాంగేయుడిగా,దేవతల సేనానాయకుడు గనుక సేనాపతిగా, సాక్షాత్తూ పరమేశ్వరునికే ప్రణవ మంత్రపు అర్ధాన్ని వివరించినందున శివగురు, స్వామినాధుడుగా,‘సు’ అంటే మంచి, ‘బ్రహ్మణ్యుడు’ అంటే వికాసము, తేజస్సు కలవాడు గనుకసుబ్రహ్మణ్యుడుగా స్వామి పిలువబడ్డాడు. క్రౌంచపర్వతమును భేదించడం వలన క్రౌంచధారణుడుగాపేరుగాంచాడు.

అవతార విశేషాలు

కృత్తిక అంటే కత్తెర అని అర్థం. కృత్రికా నక్షత్రానికి తగినట్లు ఆరు చోట్ల కత్తిరించబడిన స్వామి రూపం ఏడు ముక్కలయింది. ఆ ఏడు ముక్కలే శరీరంలోని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక , అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలనే సప్త చక్రాలు. యోగసాధకుల దృష్టిలో స్వామిఆరు ముఖాలు పంచ భూతాలు, ఆత్మకు సంకేతాలు.స్వామివారి దేవేరులైన వల్లీ దేవసేనలు ఇఛ్చాశక్తి, జ్ఞానశక్తిలకు ప్రతీక అనీ, ఈ రెండు శక్తులతో కూడిన స్వామి వారు క్రియాశక్తి స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమని ఉపాసకులు చెబుతారు. స్వామి ఆయుధం శక్తి విజ్ఞానానికి, తెలివికీ ప్రతీక.పాము కాల స్వరూపం కనుక జ్ఞాన స్వరూపుడైన స్వామి కాలాతీతుడు. ఆయన సన్నిధిలో ద్వేషాలు, దోషాలలకు అవకాశం ఉండదు.

స్వామిక్షేత్రాలు

తెలుగునాటకృష్ణా జిల్లా మోపిదేవి, తూర్పుగోదావరిజిల్లాలో మల్లవరం, సికింద్రాబాద్ స్కందగిరి వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. శివారాధన విశేషంగా కనిపించే తమిళ నాడులోని పళని, తిరుత్తణి, స్వామిమలై, తిరుచెందూర్, తిరుప్పరంకుండ్రం, పళముదిచ్చొళై అనే 5 సుబ్రమణ్య క్షేత్రాలున్నాయి. ఈ పండుగ నాడుపాలు, పంచదారాలతో కూడిన కుండలు పెట్టిన కావడిని తీసుకు వెళ్లే కావడి ఉత్సవం తమిళదేశంలో ఎంతో పేరుగాంచింది. అలాగే కర్ణాటక లోనూ 3ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలైనఆదిసుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య), మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక సుబ్రహ్మణ్య) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలున్నాయి. ఈ మూడూ కలిపితే సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను దర్శించి, స్వామిని ఆరాధించిన వారికి సకల గ్రహ దోషాలు పరిహరింపబడి, స్వామి అనుగ్రహం లభిస్తుంది.

ఈ నాటి పూజావిధి

వేకువనే నిద్రలేచి, తలస్నానం చేసి, ఇంటిలో యధాశక్తి పూజ చేసుకొని పాయసం, కందిపప్పుతో కూడిన వంటకాన్ని నివేదిస్తారు.అనంతరం ఆలయంలోని స్వామిని లేదా రావి చెట్టు కింద సర్పమూర్తిని ఆవుపాలతో అభిషేకించి, పూజించి, అరటిపండు,చలిమిడి నివేదించాలి. చెవి, కన్ను సంబంధిత దోషాలున్నవారు ఈ రోజు పుట్టను పూజించి పుట్ట మన్ను చెవులకు రాసుకుంటే మంచిది. సంతానం కోరే దంపతులు పగలంతా ఉపవాసం ఉండిసర్పపూజ చేసి , వెండి పడగలను పుట్టలో వేసి సాయంత్రం బ్రహ్మచారియైన బ్రాహ్మణుడినిస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి,పంచెల జతను తాంబూలంతో ఇవ్వడం వల్ల సత్సంతానం కలుగుతుంది. ఈ రోజు స్కంద షష్ఠి కవచం, సుబ్రహ్మణ్య భుజంగ స్త్తోత్రం, స్కాంద పురాణం పఠించటం వల్ల మనోవికారాలు దూరమవుతాయి.కొలిచిన వారికి కొంగుబంగారమై, ధర్మార్ధకామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగిన స్వామి ఆశీస్సులు మనపై ఉండాలని మనమంతా ప్రార్థిద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE