ద్రవిడ దేశంలో  ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో  తిరుప్పావై పారాయణ జరుగుతుంది. రంగనాథుని  కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలికకే తిరుప్పావై అని పేరు. తమిళంలో తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం.  తిరుప్పావై ఆళ్వారుల రచిత నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగంగా, మొత్తం తమిళ సాహిత్యంలో ప్రముఖ విశిష్ట స్థానాన్ని పొందింది.  మిగిలిన అన్ని మాసాల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాత సేవ స్థానంలో ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలు గానం చేస్తారు. ఆండాళ్ భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద గా తెలుగులో అందించారు. ఈ మాసమంతా రోజుకొక్క పాశురం చొప్పున గానం చేస్తారు. 12 మంది ఆళ్వార్లలో ఏకైక మహిళ ఆండాళ్!.

చారిత్రిక ఐతిహ్యం

శ్రీ గోదాదేవి శ్రీ విష్ణుచిత్తుల (పెరియాళ్వార్) వారికి నేటి తమిళనాడులోని శ్రీ విల్లి పుత్తూరులో పుబ్బ నక్షత్రం నాడు తులసి వనం లో లభించింది. రోజూ స్వామికి పూలదండలు  కట్టి సమర్పించే తనకు ఆయన  అనుగ్రహంగా దొరికిన ఆ బాలికకు "కొదై " (పూలదండ) అని పేరు పెట్టారు. ఆమెకే "గోదా"అని పేరు వచ్చినది. శ్రీ విష్ణుచిత్తుల ఇంట అల్లారుముద్దుగా పెరిగిన గోదా  తండ్రి తో బాటే మాలలు కట్టి, ముందుగా తాను ధరించి తర్వాత స్వామి అర్పించేందుకు ఇచ్చేది. ఇది తప్పని తండ్రి వారించినా సాక్షాత్తూ రంగనాథుడే ఆమె ధరించిన మాలలే తనకు ఇష్టమని స్వప్నంలో కనిపించి చెబుతాడు. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది. విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇది కానిపని అనుకుంటాడు. అయితే ఇదే సమయంలో  గోదాదేవి భక్తి ఫలించి, అక్కడి పెద్దలకు రంగనాథుడు స్వప్నంలో కనిపించి గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని ఆజ్ఞాపించాడు. పెళ్లికూతురుగా వచ్చిన గోదా గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. 

వర్ణనలు 

తిరుప్పావైలోని తొలి 5 పాశురాలు తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి.తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి స్వామిపూజకు పూలను సేకరించే వర్ణన, తరువాతి ఐదు పాశురాల్లో తాను చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శన వివరాలు ఉంటాయి. చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని, చిట్టచివరి పాశురంలో తాను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ 30 పాశురాలు తాను రచించి పాడాననీ, వీటిని భక్తితో గానం చేసినవారికి స్వామి అనుగ్రహం కలుగుతుందని వివరిస్తుంది.

తిరుప్పావై వ్రతం

విధిగా తిరుప్పావై చదవటాన్ని వ్రతంగా పెట్టుకున్నవారు సూర్యోదయానికి ముందే స్వామికి, ఆండాళ్ కు పుష్ప కైంకర్యం చేయాలి. ఆరాధన, నివేదన పూర్తిచేసి గోదా దేవి పాడుకున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు. వయో లింగ భేదం లేకుండా ఎవరయినా ఈ వ్రతం జరుపుకోవచ్చు.తగిన ఆహార మియమాల్ని పాటిస్తూ, మిత భాషణ, ప్రియ భాషణ చేయాలి. దాన ధర్మాలకు ప్రాదాన్యం ఇవ్వాలి. భోగాలకు దూరంగా ఉండాలి.ఈ తరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికోన్నతికి సోపానం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE