చలి వెళ్ళిపోయింది. చెట్లు మోళ్లుగా మిగిలాయి. పొలాలు ఎండిపోయాయి. జలాలు ఒట్టిపోయాయి. ఎండలు మండుతున్నాయి. వసంత ఋతువు ఆగమనానికి గుర్తుగా ప్రకృతిలో వచ్చే మార్పులివి. సరిగ్గా ఈ సమయంలోనే చెప్పలేనంత ఉత్సాహాన్ని వెంట తీసుకొని హొలీ పండుగ వస్తుంది. ఫాల్గుణ పౌర్ణమి రోజు జరుపుకొనే ఈ పండుగ భక్తి, ఉత్సాహాల సమ్మేళనం. ఉత్తర భారతంలో జరిగే అతిపెద్ద పండుగల్లో ఒకటి. దీన్ని దక్షిణాదిన వసంతోత్సవం, మదనోత్సవం, కాముని పున్నమి పేర్లతో జరుపుకొంటారు. పండుగ జరుపుకొనే తీరులో ఉత్తరాదికి, దక్షిణాదికి తేడాలున్నప్పటికీ పండుగ వెనకున్న స్ఫూర్తి మాత్రం ఒక్కటే. ఈ పండుగను నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి పలు భారత ఉపఖండ దేశాల్లోనూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కుల, మత, వర్గ భేదాలను మరచి జనమంతా ఒక్కటై రంగుల్లో మునిగితేలే హొలీ పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి చక్కని ఉదాహరణ.  

పురాణ గాథ 

ఈ హొలీ  పండుగ కృతయుగం నాటిదని పురాణాలు చెబుతున్నాయి. నాటి పాలకుడైన హిరణ్యకశిపుడు నిరంతరం విష్ణువును ద్వేషిస్తూ  విష్ణు భక్తులను నానా యాతనలు పెట్టేవాడు. అయితే ఆయన కుమారుడైన ప్రహ్లాదుడి చేత మాత్రం ఎంత ప్రయత్నించినా హరినామ స్మరణ మాన్పించలేకపోతాడు. బతిమాలి, బుజ్జగించి, బెదిరించినా బాలుడైన ప్రహ్లాదుడు విష్ణువు నామస్మరణ మానకపోవటంతో అతడిని పాములతో కరిపించటం, ఏనుగులతో తొక్కించటం, కొండల మీది నుంచి తోసివేయించటం వంటి అత్యంత క్రూరమైన శిక్షలు వేస్తాడు.కానీ హరి కటాక్షం చేత అవేమీ  ప్రహ్లాదుడిని చేయలేకపోతాయి. కుమారుడికి ఎలాగైనా బుద్ధి చెప్పి దారికి తెచ్చుకోవాలని భావించిన హిరణ్యకశిపుడు చివరిప్రయత్నంగా తన చెల్లెలు హోలికను పిలిచి కుమారుడిని ఒడిలో కుర్చోబెట్టుకొని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. అగ్ని వల్ల ప్రాణహాని లేకుండా వరం పొందిన చెల్లెలు సురక్షితంగా బయటికి వస్తుందనీ, బాలుడైన ప్రహ్లాదుడు మంటలు చూసి భయపడి తనమాట వింటాడని హిరణ్యకశిపుడు ఆశిస్తాడు. అయితే విష్ణు ప్రభావం చేత ఆ మంటల్లో హోలిక బూడిదైపోగా బాలుడైన ప్రహ్లాదుడు మాత్రం మల్లెపువ్వులా బయటపడతాడు. పరమ భక్తుడైన బాల ప్రహ్లాదుని ఆగమనానికి సూచికగా నాడు జనం రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తపరచారనీ, అదే కాలక్రమంలో హొలీ  పండుగగా మారిందని చెబుతారు. 

పండుగ విధి    

పున్నమి ముందు రోజు రాత్రి హోలికా దహనానికి చిహ్నంగా ఏదయినా కూడలిలో ముగ్గులు వేసి దానిపై భారీగా ఎండు పుల్లలను, కట్లెలను క్రమపద్ధతిలో నిలువుగా పేర్చుతారు. అందులో ఒకచోట హోలిక బొమ్మను పెడతారు. చీకటిపడగానే స్నానాలు చేసి జనమంతా భక్తితో ఆ పేర్చిన కట్టెల చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజించి, పిదప హోళిపాటలు, కాముని పాటలు, కోలాటం పాటలు, జాజిరి పాటలు పాడుకొని అంతిమంగా దానికి నిప్పుపెడతారు. రాక్షసత్వానికి ప్రతీక అయినా హోలిక అంతమైనట్లు భావించి చప్పట్లు కొడతారు. ఒకరికొకరు మిగిలిన బూడిదను తిలకంగా దిద్దుకొని, ఆలింగనం చేసుకొని,  మిఠాయిలు తినిపించుకొంటారు . మరునాటి ఉదయం మొదలు గులాల్ చల్లుకుంటూ పొద్దుపోయే వరకు సంగీత నాట్యాలతో  ఉల్లాసంగా గడుపుతారు. 

ఇదీ ఆంతర్యం

మనసులోని రాక్షసత్వాన్ని దహించి మంచి ఆలోచనలతో ముందుకు సాగాలనేదే హొలీ  పండుగ అసలు ఆంతర్యం. చంద్రుడు మనః కారకుడు. కోరికలకు పుట్టినిల్లై మనసు చంద్రుని చేత ప్రేరింపబడుతుందనీ, ఈ కాముని పున్నమి రోజు మనస్సులో జనించే కోరికలను  కాల్చివేయడం ద్వారా జీవితాన్నిఅర్ధవంతం చేసుకోవాలని ఈ పండుగ మనకు సూచిస్తోంది.  ఆరోగ్యానికి, చక్కని చర్మ సౌందర్యానికి దోహదం చేసే మోదుగుపువ్వు రసాన్ని వాడి చేసే రంగులను ఈ పండుగలో కలపటం వెనక ఆరోగ్యపరమైన కారణాలున్నాయని పెద్దల భావన. సాధారణంగా మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి గనుక ఈ కాలం దాంపత్య జీవితానికి, అన్యోన్యమైన అనురాగానికి అనుకూలమైన కాలమని గుర్తించి కూడా ఈ రంగుల ఏర్పాటు జరిగిందని పెద్దల అభిప్రాయం. 

ఇతర విశేషాలు

ఈ పున్నమి రోజే మధుర ఆలయంలో మీనాక్షీసుందరేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వివాహం కానీ యువతీయువకులు ఈరోజు ఆది దంపతుల్ని అర్చిస్తే సత్వరం వివాహం జరుగుతుందని చెబుతారు. అయ్యప్పస్వామి జన్మదినం కూడా ఏ ఈరోజే. డోలా పూర్ణిమగా చెప్పే ఈ రోజున బాలకృష్ణుడికి వెన్నముద్దల నైవేద్యంపెట్టి, వూయలకట్టి వూపితే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు.

ఇన్ని విశేషాల సమాహారమైన ఈ హొలీ పండుగ మనందరి జీవితాల్లో సరికొత్త, సానుకూలమైన మార్పులకు వెంట తెస్తుందని ఆశిస్తూ.. మీకందరికీ హొలీ శుభాకాంక్షలు .Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE