వైశాఖ మాసపు శుక్ల పక్షంలొ పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశిని నృసింహ జయంతిగా జరుపుకోవటం సంప్రదాయం. హరి సర్వాంతర్యామి అన్న బాల భకుడైన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజంచేస్తూ ఆస్థాన స్థంభం నుంచి స్వామి ఆవిర్భవించిన శుభదినమిది. వైశాఖ చతుర్దశి సాయం సంధ్యా సమయాన నర, సింహా రూపాలు కలగలసిన మూర్తిగా,  భూమి, ఆకాశం కాని తన తొడలపై హిరణ్యకశ్యపుని పొట్టను చీల్చి భూమ్యాకాశాలు దద్దరిల్లేలా సింహనాదం చేస్తూ నృసింహుడు ఆవిర్భవించాడు. నృసింహ జయంతి సందర్భంగా స్వామి తత్వాన్ని తెలుసుకొని తరిద్దాం.

అవతార విశేషాలు

 దశావతారాల్లో నాలుగవ అవతారమిది. స్వామి చూసేందుకు భయంకరంగా కనిపించినా భక్తుల విషయంలో ఆయన పరమ దయాళువు. ఒకవైపు హరి సర్వాంతర్యామి అన్న ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిలబెడుతూనే హిరణ్య కశిపుని వరాన్నీ స్వామి గౌరవించి ఈ రూపాన రావటం విశేషం. దశావతారాల్లో ఇలాంటి వచ్చిన ఏకైక అవతారము ఇదే.

ప్రహ్లాదుని గతజన్మ వృత్తాంతం

ప్రహ్లాదుని పూర్వ జన్మ కథ ప్రకారం.. పూర్వం అవంతీ నగరంలో సుశర్మ అనే గొప్ప వేద పండితుడు, అతని భార్య సుశీల ఉండేవారు. వారికి ఐదుగురు కొడుకులు. వారిలో చిన్నవాడైన వాసుదేవుడు పరమ వేశ్యాలోలుడు. ఒకనాడు ఏదో కలహ కారణాన వ్యసనాలకు బానిస అయిన వాసుదేవుని ఆ వేశ్య తిరస్కరిస్తుంది. దీంతో వారిరువురూ ఆ రాత్రి నిరాహారులుగానే గాక రాత్రంతా జాగారం కూడా చేస్తారు. ఆనాడు నృసింహ జయంతి. తెలియక ఆ రోజు చేసిన ఉపవాస, జాగరణకు మెచ్చిన పరమాత్మ వీరిద్దరికీ ఉత్తమ గతులను ప్రసాదిస్తాడు. ఆనాటి వాసుదేవుడే కృత యుగాన ప్రహ్లాదునిగా జన్మించాడు.

పుణ్య విధులు

ఈ రోజు బ్రహ్మముహూర్తంలొ లేచి తలస్నానమాచరించి శ్రీ స్వామివారిని కొబ్బరినీళ్ళు, తేనె, ఆవుపాలతో, శ్రీ సూక్త, పురుష సూక్త సహితంగా అభిషేకించి వడపప్పు, పానకము ఆరగింపు చేస్తారు. ఈ రోజు శ్రీ నారసింహ సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు. శ్రీవైష్ణవులు సంప్రదాయానుసారంగా త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి నుంచి చతుర్దశి నాటి సాయం సమయం వరకు ఉపవాసముండి, ఆ సమయంలో నృసింహ మూర్తిని పూజించి ఉపవాసాన్ని విరమిస్తారు. స్వామి స్థంభం నుంచి ఆవిర్భవించిన గుర్తుగా ఈ రోజు తమ భవంతి స్తంభములకు తిరునామాలు పెట్టి పూజిస్తారు. ఇవన్నీ చేయలేనివారు ఈ రోజున భక్తితో స్వామి నామాన్ని జపించినా ఉత్తమగతులు పొందుతారు.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE