• HOME
  • భక్తి
  • ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

            దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత విశిష్టమైన రోజు. ఈ పండుగను హిందువులతో బాటు సిక్కులు, జైనులూ జరుపుకుంటారు. పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో, నేపాల్లో కూడా ఈ పండుగ చేసుకోవడం కనిపిస్తుంది. రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు.

శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు, సోదరుని చేతికి ''రాఖీ'' కట్టి, ''పది కాలాలపాటు చల్లగా ఉండాలని'' మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సోదరిపై ఆమె సోదరులకు ఆత్మీయత బలపడి ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధపరచటమే ఏ పండుగ ఆంతర్యం. 

రాఖీ గాథలు 

ఒక పురాణ గాథ ప్రకారం.. రాక్షస రాజైన బలి చక్రవర్తి, విష్ణుమూర్తిని శాశ్వతంగా తన పాతాళ భవనంలో ఉండి పొమ్మని ప్రార్థించగా, అందుకు అంగీకరించిన విష్ణువు అక్కడే ఉండిపోతాడు. ఇది నచ్చని లక్ష్మీ దేవి, బలి చక్రవర్తి చేతికి రక్షాబంధం కడుతుంది. దీంతో బలి చక్రవర్తి ఆమెను తన సోదరిగా భావించి ఆమె కోరిక ప్రకారం విష్ణువును వైకుంఠానికి వెళ్లేందుకు అంగీకరిస్తాడు. అలాగే.. కృష్ణుని చేతికి ద్రౌపది, యముని చేతికి యమున రక్షా బంధనములు కట్టి నట్లు పురాణాలు చెబుతాయి. 

చరిత్రను పరిశీలిస్తే నాటి రాజపుత్ర స్త్రీలు పొరుగు రాజులకు ఈ రక్షా బంధనాలు పంపినట్లు తెలుస్తుంది. అలాగే యుద్ధ సమయంలో అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తముని కి రక్షాబంధనం కట్టిందనీ, ఆ కారణంగా పురుషోత్తముడు ఆమెను సోదరి గా మన్నించి అవకాశం వచ్చినా అలెగ్జాండర్ ను చంపకుండా విడచి పెట్టాడని చెబుతారు. అలాగే.. రాణి కర్ణావతి 1535 లో బహదూర్ షా దండ యాత్ర సమయంలో తన రాజ్యాన్ని కాపాడమని కోరుతూ హుమయూన్ కి రక్షా బంధనం పంపుతుంది. అయితే.. సమయానికి హుమాయూన్ రాకపోవటంతో శత్రువులు కర్ణావతి భర్తను చంపి రాజ్యాన్ని చేజిక్కించుకొంటారు. దీంతో కర్ణావతి ప్రావేపయోశం చేయగా, హుమయూన్ ఆ శత్రువులను జయించి, కర్ణావతి కుమారుదీని రాజుగా చేసినట్లు చెబుతారు.

 హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బ తీయటానికి బ్రిటిష్ పాలకులు బెంగాల విభజన చేయగా, విశ్వకవి రబీంద్ర నాథ్ టాగోర్ రక్షా బంధన్ స్ఫూర్తి గా హిందూ మహమ్మదీయ ఐక్యతను నిలిపారు. లక్షలాదిమంది హిందూ ముస్లింలు ఒకరికొకరు రాఖీ కట్టుకొని బెంగాల్ ఒక్కటేనని నినదించటం ఆధునిక భారత చరిత్రలో నిజంగా అపురూప సన్నివేశం. ఇలా రక్షా బంధన్ పండుగ కేవలం సోదరీ సోదరుల ఆత్మీయతకు మాత్రమే చిహ్నం కాకుండా పలు వర్గాల మధ్య ఐక్యతకు కారణం కావడం ఈ పండుగ ఔన్నత్యం. ఈ రక్షబంధన్ సందర్భంగా మీ అందరికీ బీపాజిటివ్ తరపున హార్థిక శుభాకాంక్షలు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE