దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగల్లో కృష్ణాష్టమి ఒకటి. శ్రావణ మాసపు బహుళ పక్షంలో అష్టమి తిథి రాత్రి రెండో జామున చంద్రుడు రోహిణీ నక్షత్రంతో కలిసిఉన్న వేళ చెరసాలలో  దేవకీదేవి అష్టమ గర్భఫలముగా నల్లనయ్య అవతరించాడు. ఆయా ప్రాంతాల్లో కృష్ణ జయంతి, జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీజయంతి అనే పేర్లతో ఈ పండుగను జరుపుకొంటారు. పాటించే సంప్రదాయాలను బట్టి ఈ పండుగను అష్టమి తిథి నాడు జరుపుకొంటే, మరికొందరు రోహిణి నక్షత్రాన్ని బట్టి  జరుపుకుంటారు. సాక్షాత్తూ నారాయణ అంశ అయిన కృష్ణయ్య బాల్యంలో చూపిన లీలలు అన్నీ ఇన్నీ కావు. ఆ బాలకృష్ణుడి లీలలను తలచుకొని తన్మయం చెందని వారుండరు. నందకులంలోని గోపికల ఇళ్లలో ఉట్టిమీది వెన్న కాజేసి తిన్న నల్లనయ్య చేష్టలను గుర్తుకుతెచ్చేలా నేటికీ కృష్టాష్టమి నాడు ఉట్టి కొట్టే సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఈ రోజు తులసీ దళాలతో కృష్ణయ్యను పూజిస్తే ఎంతటి పాపమైనా తొలగిపోతుందని స్కంద పురాణం చెబుతోంది. 

కృష్ణాష్టమి విధులు

కృష్ణాష్టమి రోజు వేకువనే లేచి తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించి, ఇల్లు, పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ రాసి, గుమ్మానికి తోరణాలు కట్టి  పూజగదిలో ముగ్గు వేయాలి. అనంతరం రాధతో ఉన్న కృష్ణుని ప్రతిమ లేదా చిత్రానికి పసుపు, కుంకుమ గంధం, తులసి మాలతో అలంకరించి యధాశక్తి పూజించాలి. పగలు ఉపవాసముండి, సాయంత్రం వేళ చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి, బంగారం లేదా వెండి చంద్రబింబాన్ని వెండి పాత్రలో ఉంచి పూజించాలి. ఆ తర్వాతే కృష్ణ పూజ చేయాలి. కంచు దీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి. తర్వాత పసుపు రంగు అక్షింతలు, కదంబ, సన్నజాజి పూలతో శ్రీకృష్ణ పూజ చేసి నుదుటన సింధూరం ధరించి, తూర్పు ముఖంగా తిరిగి 'ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు  కూడా చదవొచ్చు. తర్వాత స్వామికి బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, మినప సున్నిపిండి, వడపప్పు, బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించి చివరగా.. ఆవునేతి ఒత్తితో హారతి ఇచ్చి పూజను ముగించాలి.

ప్రత్యేక వేడుకలు

ఈ రోజు ఉరూరా వీధుల్లో ఉట్లు కట్టి యువకులు పోటీపడి వాటిని కొడతారు. చిన్నపిల్లలకు బాలకృష్ణుని వేషధారణ చేసి వారి చేత భగవద్గీత గానం చేయిస్తారు. ముగ్గుతో చిట్టి పాదాలను ఇంటిలోకి వస్తున్నట్లు వేసి.. చిన్ని కృష్ణుడిని తమ ఇంటికి అతిథిగా వచ్చినట్లు భావించి పూజ చేస్తారు. పలు విష్ణు ఆలయాల్లో ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని ఉంచి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE