• HOME
  • భక్తి
  • కృష్ణుడికీ తప్పని పార్వతి శాపం

   పార్వతీదేవి శాపం కారణంగా భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుని చూసిన ఎవరికైనా నీలాపనిందలు తప్పవని పెద్దలు చెబుతారు. సాక్షాత్తూ జగన్నాథుడైన శ్రీ కృష్ణుడూ దీనికి మినహాయింపు కాదు. అందుకే వినాయక చవితి గణేశ పూజ తర్వాత వినాయక చరితంలో భాగంగా శమంతకమణి వృత్తాంతాన్ని చదువుతాము. ఆ కథా విశేషాలు..

పార్వతి శాపం

భాద్రపద శుద్ధ చవితినాడు విఘ్నాధిపతిగా నియమితుడైన గజాననుడు సర్వలోకాల వారు సమర్పించిన కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పులను ప్రీతితో స్వీకరించి భారమైన నడకతో తడబడుతూ సూర్యాస్తమయ వేళకు కైలాసం చేరి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయబోగా, పొట్ట నేలకు ఆని చేతులు నేలకు ఆనలేదు. ఆ చవితినాడు ఇలా ఇబ్బంది పడుతూ నమస్కరిస్తున్న వినాయకుని చూసిన ఆకాశంలోని చంద్రుడు బిగ్గరగా నవ్వగా అతని దిష్టి వల్ల వినాయకుని పొట్ట పగిలి కిందపడి మరణించెను. ఈ ఘోరాన్ని చూసిన పార్వతి 'చవితినాడు నిన్ను చూసిన వారంతా అపనిందలపాలై పోతార'ని చంద్రుని శపిస్తుంది. ఆమె శాప ప్రభావంతో చవితినాటి చంద్రుని చూసిన సప్తఋషుల భార్యలు అపనిందల పాలవుతారు. ఇదిలా కొనసాగితే లోకమంతా అపనిందల పాలు కాక తప్పదని గ్రహించిన దేవతలు పార్వతీదేవిని వేడుకొంటారు. అప్పుడు ఆమె కేవలం భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూసిన వారికే ఈ సమస్య పరిమితమని తన శాపాన్ని సవరిస్తుంది. అదే సమయంలో వారందరి సంకల్పంతో మరణించిన వినాయకుడూ తిరిగి లేస్తాడు. 

శమంతకోపాఖ్యానము

తర్వాత ఒకనాటి భాద్రపద శుద్ధ చవితినాడు శ్రీకృష్ణ, నారదులు పై వృత్తాంతాన్ని చర్చించుకొంటారు. శ్రీకృష్ణుడు ముందు జాగ్రత్తగా నాటి చవితి చంద్రుని చూడరాదని నగరంలో చాటింపు వేయిస్తాడు. అయితే.. కొద్దిసేపటికే క్షీర ప్రియుడైన కృష్ణయ్య ఆ సాయం వేళ గోశాలకు పోయి పాలు పితుకుతుండగా ఆ పాలలో చంద్రుని ప్రతిరూపం కనిపిస్తుంది. ఈ ఘటనకు చకితుడైన కృష్ణుడు రానున్న కాలంలో అపనిందలు తప్పవని అనుకొంటాడు.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు అనే రాజు సూర్యుని గురించి ఘోర తపస్సు చేసి రోజుకు 8 బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణిని పొందుతాడు. తపోవనం నుంచి రాజ్యానికి పోతూ మధ్యలో ద్వారకలో కృష్ణుని ఆతిథ్యం పొందుతాడు. అప్పుడు సత్రాజిత్తు మెడలోని మణిని కృష్ణుడు చూసి ముచ్చటపడి తనకిమ్మని అడగ్గా సత్రాజిత్తు నిరాకరిస్తాడు. సత్రాజిత్తు రాజ్యం చేరిన కొంతకాలం తర్వాత అతని తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లగా , ఓ సింహం ఆ మణిని మాంసం ముద్ద అనుకొని వెంటబడి అతనిని చంపి ఆ మణిని పట్టుకొని వెళ్తుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కూతురైన జాంబవతికి ఆటవస్తువుగా ఇస్తాడు.

మరునాడు తమ్ముని మరణ వార్త విన్న సత్రాజిత్తు శ్రీకృష్ణుడే మణి కోసం తన తమ్ముని చంపాడని ప్రచారం చేస్తాడు. ఆ సంగతి విన్న కృష్ణుడు అది నాటి చవితి నాటి చంద్ర దర్శన ప్రభావమని అనుకోని, ఆ నిందను తొలగించుకునేందుకు ప్రసేనుడు వేటకు వెళ్లిన ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ సింహం, ఎలుగుబంటి కాలి ముద్రలు గుర్తించి ఆ దారిపట్టి వెళ్లగా ఒక గుహలో ఊయలకు కట్టిన మణి కనిపిస్తుంది. కృష్ణుడు దాన్ని తీసుకొని వస్తుండగా, జాంబవతి కేకలు వేయగా ఆమె తండ్రి జాంబవంతుడు కృష్ణుడిని అడ్డుకొని యుద్దానికి తలపడతాడు.

అలా 28 రోజుల యుద్ధం తర్వాత నీరసించిన జాంబవంతుడు వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీహరి అని తెలుసుకొని కృష్ణుడికి నమస్కరించి రామావతార కాలపు వృత్తాంతాన్ని వివరిస్తాడు. త్రేతాయుగాన తాను రామునితో ద్వందాయుద్దాన్ని వరంగా కోరిన సంగతి, మరుజన్మలో తానూ స్వయంగా వచ్చి ఆ కోర్కె తీర్చుతానని నాడు రాముడిచ్చిన మాటను కృష్ణుడికి భక్తితో వివరించి క్షమాపణ కోరి ఆ మణితో బాటు తన కుమార్తె జాంబవతిని కానుకగా ఇస్తాడు. 

ఆ తర్వాత సత్రాజిత్తు నిగరాన్ని చేరిన శ్రీకృష్ణుడు జరిగిన కథ వివరించగా, సిగ్గుపడిన సత్రాజిత్తు క్షమాపణ కోరి ఆ మణితో బాటు కుమార్తె సత్యభామను కృష్ణుడికి సమర్పిస్తాడు. ఆ తరవాత జాంబవతి, సత్యలతో జరిగిన కృష్ణ వివాహానికి హాజరైన మునులు ' పరమాత్మవైన మీకే తప్పని పార్వతి శాపం మాబోటి సామాన్యులను వేధించదా అని భయపడతారు.అప్పుడు శ్రీ కృష్ణుడు "భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు పొరబాటున చంద్రుని చూసినా, ఆరోజు గణపతిని యథాశక్తి పూజించి శమంతకమణి కథను విని అక్షతలు తలపై వేసుకొంటే వారికి ఏ నిందా  రాద' ని అభయమిస్తాడు. నాటి నుంచి ఏటా భాద్రపద శుద్ధ చవితినాడు అందరూ శక్తి కొలది గణపతిని పూజించి ఈ కథను వినటం ఆనవాయితీగా మారింది. మనమూ ఈ చవితినాడు గణపతిని పూజించి, ఈ కథ విని, రాబోయే ఏడాదిలో ఎలాంటి నిందలూ  రాకుండా చూడమని ఆ గణపయ్యను ప్రార్థన చేద్దాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE