• HOME
  • భక్తి
  • విశేషాల పండుగ.. వినాయక చవితి

భాద్రపద మాసంలో వచ్చే ఈ వినాయక చవితి పండుగ వెనక అనేక వైద్య, ఆధ్యాత్మిక, పర్యావరణ, ఆహార పరమైన విశేషాలు దాగున్నాయి. వాటిని రుజువు చేసే విధి విధానాలూ ఈ పండుగలో కనిపిస్తాయి. అవేమిటి చూద్దాం.

మట్టి వినాయకుడు

సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం మట్టే. ఇది ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, బీదా, ధనిక అనే తారతమ్యం లేదు.   ప్రకృతి స్వరూపమైన మట్టి నుంచే సకల జీవులు సృష్టించబడటం, పెంపుపొందటం, చివరికి నశించి తిరిగి మట్టిలో కలవటం జరుగుతుంది. ఒకప్పుడు ఎవరికివారు కొత్త మట్టితో వినాయక ప్రతిమను చేసి పూజించేవారు. ఇప్పటిమాదిరిగా వీధికో విగ్రహాన్ని ప్రతిష్టించటం గాక ఊరికో పెద్ద విగ్రహాన్ని పెట్టి పూజించేవారు. ఊరి జనమంతా గ్రామపు చెరువులోని ఓ మాదిరి తడిగా ఉన్నచోట మట్టి తవ్వి ప్రతిమను చేసి సహజ రంగులైన పసుపు, కుంకుమ, గంధం, సింధూరం వంటివాటితో అలంకరించి పూజ చేసేవారు. దీంతో పండుగకు ముందే ఊళ్ళో అందరూ చెరువు దగ్గరకు రావటం, విగ్రహ ఏర్పాటులో పాలు పంచుకోవటం, పండుగ తర్వాతి నిమజ్జన ఏర్పాట్లు చేయటం వంటి వన్నీ జరగటంతో చెరువు ఆలనాపాలనా చక్కగా జరిగేది. ఈ క్రమంలో చెరువులు, వాగులు, కుంటలు నిండితే వచ్చే ప్రమాదాలూ ముందుగా చర్చకు వచ్చేవి. ఇలా నాటి గ్రామాల అవసరాలకు మూలమైన చెరువుల ఉనికిని కాపాడేందుకే మన పెద్దలు మట్టితో ప్రతిమలను చేసే సంప్రదాయాన్ని రూపొందించారు. 

పత్రిపూజ

గణనాథుని 9 రోజులపాటు, 21 రకాల పత్రితో పూజించడం ఆచారం. ఈ పత్రపూజ స్వామికి ఎంతో ప్రీతికరం. శ్రీహరి దశావతారాలు, శివుని ఏకాదశ రూపాల మొత్తం 21 కనుకే 21 రకాల పత్రిని వాడతారు. ఈ పూజకు వాడే ఔషధ మొక్కల భాగాల నుంచి 9 రోజుల పాటు విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిసి గ్రామంలోని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా.. వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి. 

నిమజ్జనం

9 రోజుల తరవాత పూజించిన వినాయక ప్రతిమను సమీపంలోని స్వచ్ఛ జలంలో నిమజ్జనం చేస్తారు. సాధారణంగా చెరువులు, కుంటలు, నదులు, కాలువలు, బావుల్లో ఈ నిమజ్జనం జరుగుతుంది. 21 రకాల పత్రి నీటిలో పడిన 23 గంటలకు వాటిలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ నీటిలో కలియటంతో నీటిలోని హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

విశేష ప్రసాదాలు

వినాయకచవితి రోజున నూనెలేని, ఆవిరిమీద ఉడికించిన కుడుములను, ఉండ్రాళ్ళను గణపయ్యకు నివేదిస్తాం. వర్షఋతువులో జీర్ణశక్తి తగ్గుతుంది గనుక నూనె వంటకాలకు బదులుగా ఆవిరి వంటకాలు తింటే అనారోగ్యం రాదనే సూచన ఉంది. ఈ ఆవిరి వంటకాలు సులభంగా జీర్ణమై, పిత్త దోషాలను హరిస్తాయి. ఇక.. చలిమిడిలోని నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగించి నేత్రరోగాలను రాకుండా చేస్తాయి. అందులోని బెల్లం జీర్ణశక్తిని కలిగించి, వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. ఆరోగ్యాన్ని పెంచేలా ఈ 9 రోజులు గణేశ మంటపాల్లో రోజుకోరకం ధాన్యం చొప్పున 9 రోజుల్లో నవ ధాన్యాలు ప్రసాద రూపంలో తినే ఏర్పాటు కూడా ఈ పండుగలో కనిపిస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE