మన సంప్రదాయంలో ఏ పనిచేసే ముందైనా ఓసారి గణపయ్యను తలచుకొంటాం. ఏ శుభకార్యంలోనైనా తొలి పూజ దక్కేది ఆయనకే. ఈ వినాయక చవితి నాడు సర్వలోకాలను విఘ్నాల నుంచి కాపాడుతున్న ఆ గణపయ్య చరిత్రను తప్పక చదివి ఆ స్వామి కరుణకు పాత్రులమవుదాం.

గజాసుర వృత్తాతం

            వినాయకుని జననం, ఆయన మహత్తును గురించి సూత మహాముని శౌనకాది మునులకు ఇలా వివరించాడు. పూర్వం ఏనుగు రూపమున్న గజాసురుడు అనే రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేయగా, స్వామి ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. ఈశ్వరుడిని తన పొట్టలో నివసించమని ఆ రాక్షసుడు కోరగా సరేనన్న శివుడు అతని పొట్టలో ప్రవేశించెను. ఈ సంగతి తెలుసుకొన్న పార్వతి దుఃఖంతో వైకుంఠం చేరి తన భర్తను తిరిగి తీసుకురమ్మని విష్ణువును ప్రార్థిస్తుంది. అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిచి సంగతి చెప్పి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరైనదని నిర్ణయిస్తాడు. ఆ పథకం ప్రకారం శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించి, విష్ణువు గంగిరెద్దు బృంద నాయకుడిగా వేషం వేస్తారు. బ్రహ్మాది దేవతలు తలా ఒక వాద్యము తీసుకొని వెళ్లి ఆ గజాసురుని రాజ భవనం ముందు గంగిరెద్దును ఆడిస్తూ సంగీతం వాయిస్తారు. వారి అద్భుతమైన సంగీత ప్రతిభకు మెచ్చిన గజాసురుడు ఏమి కావాలో కోరుకోమనగా, గంగిరెద్దుల నాయకుడిగా ఉన్న విష్ణువు 'ఇది శివుని వెతుక్కొంటూ వచ్చిన ఆయన వాహనం నంది. కనుక శివుడిని ఇవ్వమ'ని అడుగుతాడు. 

ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయి, తనకు చావు తప్పదని గ్రహించి, నా శిరస్సును అందరూ పూజించే ఏర్పాటు చేయమని కోరగా అందుకు అందరూ అంగీకరిస్తారు. దీంతో విష్ణువు నందిని ప్రేరేపించగా, నంది తన వాడి కొమ్ములతో గజాసురుని కడుపును చీల్చగా లోపలనున్న శివుడు బయటకువస్తాడు. దీనికి దేవతలంతా సంతోషిస్తారు. శివుడు తిరిగి కైలాసం బయలుదేరతాడు.

వినాయక జననం 

భర్త రాక గురించి తెలుసుకొన్న పార్వతి అభ్యంగన స్నానం చేయబోతూ, చేతిలోని ఆ నలుగు పిండిని బాలుడిని చేసి కాపలాగా బయట నిలిపి లోనికి పోతుంది. స్నానం చేసిన పిదప ఆమె అలంకరించుకొని శివునికై ఎదురు చూస్తూ లోపలే ఉండిపోతుంది. ఈ లోపు సింహద్వారం నుంచి పరమేశ్వరుడు లోపలికి పోతుండగా, ఆ బాలుడు అడ్డుకొంటాడు. ఎంత చెప్పినా వినక వాదనకు దిగిన బాలుడి వైఖరికి కోపించిన శివుడు తన శూలంతో బాలుని తలను తెంచి లోపలికి వెళ్తాడు. భర్త కాళ్ళు కడిగి లోపలి తీసుకెళ్లి సేవలు చేసిన తర్వాత మాటల్లో బాలుడి ఆగడం గురించి స్వామి వివరించగా.. దుఃఖించిన పార్వతి, ఆ బాలుని బతికించామని కోరుతుంది. అప్పుడు శివుడు వెంట తెచ్చిన గజాసురుని తలను ఈ బాలునికి మొండేనికి అతికించి 'గజాననుడు' అనే పేరు పెడతాడు. కైలాసంలో అల్లారుముద్దుగా పెరిగిన ఆ బాలుడు తన వాహనమైన ఎలుకపై తిరుగుతూ, తల్లిదండ్రులను భక్తితో సేవించుకొంటూ ఉంటాడు. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను. అతడు మహాబలశాలిగా గుర్తింపు పొందాడు.

గణనాయకుడు..

ఆ సమయంలో ఓ రోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి తాము ఎదుర్కొంటున్న విఘ్నములకు ఒక అధిపతిని నియమించమని ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుడి కోరికపై అతనిని ఆ పదవికి ప్రతిపాదించగా, చిన్న కుమారుడైన కుమారస్వామి నిరాకరించి అన్నగారు 'మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్ధుడ'నీ  గనుక అందుకు తానే సరైన అభ్యర్థినంటాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ' మీరిద్దరిలో ఎవరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానమాడి ముందుగా తిరిగి వస్తే వారే విఘ్నధిపతి పదవికి అర్హుల'ని చెబుతారు. మరుక్షణమే కుమారస్వామి తన నెమలిపై వాయువేగంతో వెళ్లగా, గజాననుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ నెమ్మదిగా తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్రం ప్రభావంతో కుమారస్వామి ఎక్కడికెళ్లినా తనకంటే ముందుగా స్నానం చేసి వెళుతున్న అన్నగారు కనిపిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరిన కుమారస్వామి తన అజ్ఞానాన్ని మన్నించమని తల్లిదండ్రులను, అన్నగారిని వేడుకొని పోటీ నుంచి తప్పుకోగా నాటి భాద్రపద శుద్ధ చతుర్ధినాడు గజాననుడు విఘ్నాధిపతిగా నియమించబడతాడు. నాటి నుంచి భక్తులను సర్వ విఘ్నాల నుంచి స్వామి కాపాడుతున్నాడు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE