ఇతర దేశీయులతో పోల్చితే భారతీయులకు పండుగలు ఎక్కువ. భౌతిక జీవన ప్రభావం నుంచి మనసును పరమాత్మ వైపు తిప్పేందుకు మన పూర్వీకులు చేసిన ఏర్పాట్లే ఈ ఏడాదిపొడవునా వచ్చే పండుగలు. అంటే.. ఉపాసన ద్వారా పరమపదాన్ని పొందేందుకు సోపానాలన్నమాట. ఈ పండుగల జాబితాలో శరన్నవరాత్రి వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవి.

నవరాత్రి

ఇది శరదృతువు. ఇది నిర్మలత్వానికి ప్రతీక. ఈ కాలపు చంద్రుడు ప్రశాంతతకు మారుపేరు. ఈ రెండు లక్షణాలున్న జగన్మాతకు అందుకే ఈ సమయమంటే ఎంతో ప్రీతి. ఇక.. అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఆశ్వీయుజం కాగా తొమ్మిది సంఖ్య పరిపూర్ణతకు గుర్తు. నవరాత్రి సందర్భంగా మనం ఆరాధించే పరాశక్తి సాక్షాత్తూ పరబ్రహ్మానికి, పరిపూర్ణతకు ప్రతిరూపం. ఆ తల్లి ఆనతి మేరకే త్రిమూర్తులు సైతం సృష్టి, స్థితి, లయలను వహిస్తున్నట్లు దేవీ భాగవతం చెబుతోంది. అందుకే శరదృతువు, ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు జరుపుకునే ఈ నవ రాత్రులకు 'దేవీ నవరాత్రుల'ని పేరు. ఈ 9 రోజులూ అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాతీ, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే రూపాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ నవ దుర్గల ఆరాధన జీవితంలో పరిపూర్ణత్వాన్ని అందిస్తుంది.

బంధాల నుంచి మోక్షం దిశగా

ఎంతో పుణ్యం చేసుకొంటేనే లభించే మనిషిజన్మ నుంచి పరమపదాన్ని చేరుకోవాలంటే మానవుడు ఎన్నో బంధనాలు ఛేదించాలి. అప్పుడే శరీరం అశాశ్వతమైనదనే సత్యం బోధపడుతుంది. ఆ స్థితికి మనిషి చేరుకోవాలంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల మద్దతు ఎంతైనా అవసరం. సృష్టిలోని ప్రతిప్రాణిలోనూ ఉన్న ఆ పరమాత్మను గుర్తించి, ఆరాదించినప్పుడే ఆ జగన్మాత తత్వాన్ని అర్ధం చేసుకోగలం. ఈ ప్రయాణమే జన్మరాహిత్యానికి దారితీస్తుంది. సాధారణంగా సంప్రదాయ పద్థతిలో అమ్మవారిని ఆరాధించేవారు ఇంటిలో కలశాన్ని స్థాపించి పాడ్యమి నుంచి దశమి వరకు 9 రాత్రులు, 10 రోజుల పాటు ఆరాధిస్తారు. జీవితంలో ఏ రంగంలోనైనా విజయం కాంక్షించే వారు విజయదశమి నాడు తమ ప్రయత్నం ప్రారంభిస్తారు.

దుర్గ రూప విశేషాలు

పూర్వం ప్రపంచాన్ని పీడిస్తున్న దుర్గమాసురుణ్ణి బ్రహ్మాది దేవతలు అదుపుచేయలేకపోతారు. ఆ స్థితిలో లోకాలను రక్షించమని మునులు జగన్మాతను వేడుకొంటారు. కరుణాస్వరూపిణి అయిన ఆ జగన్మాత మనస్సు కరిగి దుర్గమాసురుడిని సంహరించి నాటి నుంచి 'దుర్గ'గా పూజింపబడుతోంది. మనిషి జీవితం ఎదురయ్యే కష్టాలను హరించే శక్తి ఈ అమ్మ లక్షణం. సృష్టి, స్థిది లయకారిణి, అజ్ఞాన నాశినీ, భయహరిణీ, దుఃఖ నివారిణి, ఆత్మశక్తి ప్రదాయిని అయిన దుర్గామాతను శరణువేడితే దుర్గతి పోయి, సద్గతి ప్రాప్తిస్తుంది. రామాయణ యద్ధానికి ముందు శ్రీరాముడు దేవీపూజ చేసినట్లు, పాండవులు సైతం దేవీ పూజ తర్వాతే కురుక్షేత్ర యుద్ధ రంగంలో అడుగుపెట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నవరాత్రి ఆరంభ సమయాన అమ్మ చరణాలను ఆశ్రయించి ఆ తల్లి కటాక్షాన్ని ఆశీస్సుగా పొందుదాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE