దేవతా వృక్షాల జాబితాలో శమీ వృక్షం( జమ్మి చెట్టు) అత్యంత ముఖ్యమైనది. జమ్మిచెట్టు విజయానికి సంకేతం. శమీ వృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణ వచనం. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే కల్పవృక్షం గా పూజలందుకొంటోంది. అందుకే యజ్ఞ యాగాదుల వేళ జమ్మి కొమ్మల రాపిడి ద్వారా మాత్రమే అగ్నిని సృష్టిస్తారు. శమీ వృక్షం దేవీ రూపమని, విజయదశమి రోజు శమీపూజ చేసేవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం చెబుతోంది.

పురాణ ప్రస్తావనలు

పురాణాలలో అనేక ఉదంతాలు శమీవృక్ష విశిష్టతను సూచిస్తాయి. దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఉంది. నాడు శమీవృక్షంతోబాటు ఆవిర్భవించిన తులసి, పారిజాత, బిల్వ వృక్షాలకు 'వనమాలి' అనే ఓ అధిష్టాన దేవత ఉందనీ, ఆమెనే శమీ దేవత అంటారనీ చెబుతారు.

వినాయక పూజలోనూ జమ్మిఆకుకు స్థానం ఉంది. త్రేతాయుగాన వనవాస సమయంలో శ్రీరాముని కుటీరం జమ్మి కలపతోనే నిర్మించారనీ, రావణుడిపై యుద్ధానికి ముందు శ్రీరాముడు శమీ పూజ చేసినట్టు రామాయణం చెబుతోంది. ద్వాపరయుగంలో అజ్ఞాత వాసానికి వెళ్లేముందు పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే ఉంచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయ దశమినాడు ఉత్తర గోగ్రహణం కోసం అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి గాండీవాన్ని ధరించి అద్భుత విజయాన్ని అందుకున్నట్లు మహాభారతం చెబుతోంది. దసరా రోజు శమీ పూజ చేసేవారికి అమ్మవారి కృప లభించటమే గాక శనిదోష నివారణ జరుగుతుందని చెబుతారు.

బంగారు పత్రాలు-స్నేహానుబంధాలు

దసరా సాయంత్రం వేళ ఆలయాలు, చెరువుల వద్ద ఉండే జమ్మి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షణలు చేస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజించి జమ్మి ఆకును ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనిని బంగారంగా భావించి పెద్దలు, కుటుంబ సభ్యులకు ఇచ్చి నమస్కరిస్తారు. తాము అందుకొన్న జమ్మి ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధనస్థానంలో దాచుకోవటం శుభప్రదంగా భావిస్తారు. ఇలా శమీ పూజ నిమిత్తం ఊరి పొలిమేరను దాటటాన్నే తెలంగాణా ప్రాంతంలో ‘జంబికి వెళ్లడం’ అనీ, అందరికీ పంచేందుకు జమ్మి ఆకులనూ, కొమ్మలనూ సేకరించడాన్ని ‘జంబికొట్టడం’ అంటారు. 

శమీ శ్లోకం

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ

అర్జునస్య ధనుర్దారీ రామస్య ప్రియదర్శిని

 

శమీ కమల పత్రాక్షి శమీ కంటక హారిణి

ఆరోగ్యంతు సదాలక్ష్మీ ఆయు: ప్రాణాంతు రక్షతు

ఆదిరాజ మహారాజ వనరాజ వనస్పతే

ఇష్ట దర్శన మృష్టాన్నం కష్ట దారిద్య్ర నాశనం

          ఈ విజయదశమి నాడు మనం కూడా శమీపూజ చేసి, శమీ పత్రాలు పంచుకుని స్నేహభావంతో మెలగి, ఆయురారోగ్యాల్ని పొందుదాం!



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE