కొంచెం అమాయకంగా, మరికొంచెం గారంగా కనిపించే వర్తమాన నటి రెజీనా. మాతృభాష తెలుగు కాకున్నా అచ్చు తెలుగమ్మాయిలా ఉండే రెజీనా తన అందం, అభినయంతో అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసులో చక్కని స్థాన్నాన్ని సంపాదించుకొంది. చిన్న సినిమాలతో కెరీర్ ఆరంభించినా వరుస విజయాలతో ఇప్పుడు అగ్ర నటుల సరసన నటించేందుకు సిద్ధం అవుతోంది. నటిగా రాణింపు సాధించటంలో అందం ఎంత ముఖ్యమో ఫిట్ నెస్ కూడా అంతే ముఖ్యం అంటున్న రెజీనా బీపాజిటివ్ తో పంచుకున్న విశేషాలు..

నేటి యువత ప్రాధాన్యాల్లొ ఫిట్ నెస్ స్థానం?

నేటి యువత ఫిట్ గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇందు కోసం శరీరాన్ని కాస్త కష్ట పెట్టేందుకు వెనకాడటం లేదు. వ్యాయామం మీద అవగాహన పెరగటం, అందుకు తగిన సౌకర్యాలు అందుబాటులోకి రావటంతో వారు మరింతగా ఈ అంశంపై దృష్టి సారించగ లుగుతున్నారు. ఇక పిల్లల చదువు మీద ఎంతో శ్రద్ధ చూపే తల్లిదండ్రులు వ్యాయామం, ఆటపాటల దగ్గరకొచ్చే సరికి పెద్దగా పట్టించుకోరు. ఈ ధోరణీ మారాల్సిన అవసరం ఉంది.

చిన్నప్పటినుంచే వ్యాయామం అలవాటు ఉందా?

అవును. అయితే అది ఆటల రూపంలో ఉండేది. జిమ్ లో సాధన చేసింది అసలు లేదనే చెప్పాలి. ప్రతి రోజూ బాస్కెట్ బాల్ ఆడటం, ఈత కొట్టటం అలవాటు. ఏళ్ళ తరబడి ఈ రెండూ నా దినచర్యలో భాగం అయ్యాయి. వ్యాయామాలే అయినా నేను ఇష్టపడిన వ్యాపకాలవి.

రోజూ యోగ, ప్రాణాయామం వంటివి చేస్తుంటారా?

కొద్ది సేపు యోగా చేస్తాను. ఇందుకోసం హైదరాబాద్ విక్రం యోగా సెంటర్ లో శిక్షణ తీసుకున్నాను.

జీరో సైజు, సిక్స్ ప్యాక్ మీద మీ అభిప్రాయం?

వేలంవెర్రిగా కాకుండా క్రమబద్ధంగా సాధన చేయగలిగితే ఇవి మంచివే అనుకుంటాను.

ఆరోగ్యాన్ని పణంగా పెట్టి బరువు తగ్గాలనుకునే వారికి మీ సలహా?

బరువు తగ్గాలనుకోవటం తప్పుకాదు . అయితే అందుకు అనుసరించే విధానాలు శరీరాన్ని ఇబ్బందికి గురిచేసేలా ఉండకూడదు. అన్నింటికీ మించి తక్కువ సమయంలోనే బరువు, కొవ్వు తగ్గించుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఈ విషయంలో ఏ మార్పు అయినా నెమ్మదిగా జరగాల్సిందే తప్ప రాత్రికి రాత్రి కాదు.

మీకు ఫిట్ నెస్ ట్రైనర్ ఉన్నారా? రోజూ ఏ వ్యాయామం చేస్తారు?

అవును. హైదరాబాద్, చెన్నైలోనూ ఒక్కో ట్రైనర్ ఉన్నారు. నిజానికి నాకు జిమ్ లో వ్యాయామం చేయటం అస్సలు ఇష్టం ఉండదు. అయినా మా ట్రైనర్స్ కనీస స్థాయి వ్యాయామాలు చేయిస్తారు.

అవుట్ డోర్ షూటింగ్ సమయాల్లో ఎలాంటి వ్యాయామం చేస్తారు?

వాతావరణం బాగుంటే ఆరుబయట, బీచ్ వద్ద జాగింగ్, రన్నింగ్, వాకింగ్ చేస్తుంటా. లేకపోతే జిమ్ బాట పడతా.

ఇష్టమైన వ్యాయామాలు?

ఆటలు ఆడటం, డాన్స్ చేయటం, అవుట్ డోర్ వ్యాయామాలు

మీ ఫిట్ నెస్ ఐకాన్?

నా కోచ్

రోజువారి వ్యాయామ ప్రణాళిక?

రోజూ లేక వారం అని నిర్దిష్ట వ్యాయామ ప్రణాళికలు అంటూ లేవు. వాతావరణం, అప్పటి మూడ్ తదితరాలను బట్టి తరచూ వేరు వేరు వ్యాయామాలు చేస్తా.

అందం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

గ్లామర్ రంగంలోని వారంతా అందం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందే. నేనైతే పేస్ ప్యాక్ కోసం పసుపు, గంధం వంటి సహజసిద్దమైన వాటివి ఎక్కువగా వాడుతా. క్రీముల వాడకం చాలా తక్కువ. చర్మానికి సంబంధించి ఇబ్బంది వస్తే వైద్యుల సలహా తీసుకొంటా.

కాస్మెటిక్ విధానాల మీద మీ ఆలోచన?

సహజసిద్దమైన రూపమే అసలు రూపం. కత్తిగాటుతో వచ్చే అందాలన్నీ తాత్కాలికమైనవే. అలాంటివాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.

అందం విషయంలో మీఋ తీసుకొనే ప్రత్యేక జాగ్రత్తలు?

షూటింగ్ అయిన వెంటనే మేకప్ తీసేసి చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవటం, కాస్త మాయిస్చ్యరైజర్ రాసుకుంటా.

మీరెప్పుడూ వెంట తీసుకు వెళ్ళేవి?

మేకప్ రిమూవర్, లిప్ బాం

వృత్తి , వ్యక్తిగత జీవితాలను ఎలా సమన్వయ పరచుకుంటారు?

రెండూ ముఖ్యమే అయినా దేని ప్రాధాన్యం దానిదే. ఉన్న సమయాన్ని బట్టి సమన్వయం చేసుకొంటూ పోవటమే.

నేటి అమ్మాయిలకు అత్యవసరమైన అంశాలు?

చదువు, ఆత్మ విశ్వాసం

ఆరోగ్యం గురించి మీరిచ్చే సలహాలు?

ఉన్నంతలో అవకాశాన్ని బట్టి అందరూ తగిన పోషకాహారం తీసుకోవాలి. అంటే ఖరీదైన ఆహారం అనుకోవాల్సిన పనిలేదు. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, తృణ ధాన్యాలు తీసుకోవచ్చు. రుచికి ప్రాధాన్యం ఇస్తూనే పోషకాల సంగతీ పట్టించుకోవాలి. అందుకే ఏ సీజన్లో దొరికే దొరికేవి ఆ సీజన్లో తప్పక తినాలి. పరిశుభ్రమైన నీరు కూడా తగినంత తీసుకోవాలి. తీసుకున్న ఆహారానికి తగినంత వ్యాయామం తప్పక ఉండేలా చూసుకోవాలి. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే నూటికి 90 శాతం అనారోగ్య సమస్యల్ని నివారించొచ్చు.

 

బయోడేటా

పూర్తిపేరు      :    రెజీనా కసాండ్రా

పుట్టినతేదీ     :    13 డిసెంబర్ 1988

సొంత ఊరు     :    చెన్నై

చదువు       :   సైకాలజీలో గ్రాడ్యుయేషన్

ఎత్తు         :   160 సెంటీమీటర్లు

రాశి          :   ధనుస్సు

హాబీలు        :  సైక్లింగ్, వాటర్ రాఫ్టింగ్, విహారయాత్రలు

ఇష్టమైన ప్రదేశం  :   నెల్లూరు జిల్లా తడ జలపాతంRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE