అఖిల్.. అక్కినేని వంశంలో మూడోతరం నటుడు. నడక నేర్వక ముందే సిసింద్రీ గా ప్రేక్షకుల్ని అలరించిన చిచ్చర పిడుగు. చక్కని తెలుగు ఉచ్చారణ, చెదరని చిరునవ్వు, చురుకైన చూపులతో తెలుగు యువ కథానాయకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న నటుడు. 'మనం'లో క్షణకాలం తళుక్కున మెరిసి అభిమానుల్ని అలరించినా, కథానాయకుడిగా పరిచయమైన 'అఖిల్' సినిమాతో అక్కినేని అభిమానుల్ని ఔరా అనిపించాడు. ఫిట్ నెస్, ఆహారం అంశాల గురించి బీ పాజిటివ్ తో అఖిల్ పంచుకొన్న కొన్ని విశేషాలు... 

ఎప్పుడూ హాయిగా నవ్వుతూ, ఉత్సాహంగా కనిపిస్తారు? ఇదెలా సాధ్యం?

మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఉత్సాహంగా, ఫిట్ గా ఉంటుంది. ఇది మిస్సయితే పైకి ఎంత దాచినా ఏదోరూపంలో మన కంగారు బయట పడుతుంది. నచ్చినట్లు ఉండటం, నచ్చిందే చేయటం వల్ల ఎవరైనా ప్రశాంతంగా ఉండొచ్చు.

ఫిట్ నెస్ విషయంలో మీ రోల్ మోడల్?

నాన్న. ఆయన సినిమాలోని పాత్రను బట్టి తన రూపాన్ని మలచుకుంటారు. దీనికోసం ఆహారం, వ్యాయామం విషయాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకుంటారు. అందుకే ఈ విషయాల్లో నాన్న పద్ధతులు ఫాలో అవుతా.

రోజూ ఎంతసేపు వర్కౌట్ చేస్తారు?

ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా జిమ్ చేస్తా. తీసుకునే ఆహారం, వాతావరణం, చేసే వ్యాయామాలను బట్టి ఎంత సేపు చేయాలని నిర్ణయించుకుంటా తప్ప రోజూ ఖచ్చితంగా ఇంత సమయం చేయాలనే నియమం ఏమీ లేదు.

యోగా చేస్తారా?

వీలున్నప్పుడు మాత్రమే చేస్తా. ఇప్పుడు ప్రపంచం అంతా యోగా గురించి మాట్లాడుతోంది. శారీరక, మానసిక దృఢత్వానికి పనికొచ్చే యోగా అందరికీ అవసరమే.

ఇష్టమైన ఆహారం?

బిర్యానీ. రోజూ పెట్టినా ఇష్టంగా తింటా. మొదటి నుంచి ఇరానీ, మొఘలాయ్ వంటకాలు, రంజాన్ సమయంలో చేసే హలీం అంటే బాగా ఇష్టం. సెలవు రోజుల్లో కాస్త స్పైసీగా తిన్నా మిగిలిన రోజుల్లో మాత్రం తగుమోతాదులో ఉప్పు, కారం, నూనె వాడి తయారు చేసిన ఆహారాన్ని ఇష్టపడతాను. ఎంత నచ్చిన ఫుడ్ అయినా మోతాదుకు మించి తినటం అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్ అలవాటు లేదు. 

బయట భోజనం చేసేటప్పుడు ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు?

ఫుడ్ విషయంలో రుచి కంటే నాణ్యత ముఖ్యం. దీనితో బాటు వడ్డించే పద్దతి, అక్కడి వాతావరణం వంటివి కూడా పరిగణలోకి తీసుకుంటాను. అలాగని ఎప్పుడూ బయట తినాలని అనుకోను. ఎప్పుడూ ఒకే చోట కాకుండా కొత్త కొత్త హోటల్స్ కి వెళ్లటానికి ఇష్టపడతాను. 

 మీ రోజువారీ డైట్ ప్లాన్?

ఉదయం అల్పాహారంగా మిల్క్ షేక్ విత్ బనానా, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. లంచ్ సమయంలో ఇంట్లో చేసిన వంటకాలతో బ్రౌన్ రైస్, ఒక మిల్క్ షేక్ తీసుకుంటాను. రాత్రి తేలికపాటి ఆహారం, మరో మిల్క్ షేక్ తో ముగిస్తా. 

ఫిట్ నెస్ విషయంలో యువతకు సలహా?

యువత కెరీర్ మీద వెచ్చించే సమయంలో సగమైనా ఆరోగ్యం, ఫిట్ నెస్ కోసం వెచ్చించటం ఎంతైనా అవసరం. ఎన్ని పనులున్నా రోజూ ముఖ్యంగా వేళకి తినటం, తిండికి తగిన వ్యాయామం చేయటం తప్పనిసరి. వ్యాయామం పేరిట 1 గంట జిమ్ చేయటంతో సరిపెట్టకుండా ఫుట్ బాల్, క్రికెట్ , హాకీ వంటి ఆటలు ఆడాలి. ముఖ్యంగా దీనికి తోడు యోగా కూడా చేస్తే మానసిక ఒత్తిళ్ళూ దూరం అవుతాయి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE