బంగారం పోతపోసినట్లు ఉంటుందామె. సౌందర్యానికీ, సౌకుమార్యానికీ ఆమె ప్రతిరూపం. అందమైన ఆమె నవ్వు మనసును గిలిగింతలు పెడుతుంది. 16 ఏళ్ళకే వెండి తెరపై మెరిసి  హిందీ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో అతి తక్కువ కాలంలోనే అగ్ర నటిగా ఎదిగిన అభినేత్రి తమన్నా. శ్రీ, హ్యాపీడేస్, 100 % లవ్, రచ్చ, బాహుబలి చిత్రాలతో తెలుగులో నటిగా అగ్రస్థానాన కొనసాగుతున్న నటి. వయసుతో నిమిత్తం లేకుండా, తనలోని పసిదనాన్ని వసివాడనీయకుండా చూసుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుందనీ, ఆశావహ దృక్పధంతోనే ఎలాంటి విజయాలనైనా అందుకోగలమనీ చెబుతున్న తమన్నతో బీ పాజిటివ్ ముచ్చట్లు......

బాల్యం

మాది పెద్ద కుటుంబం. తరచూ ఏదో ఒక కార్యక్రమంలో అందరం కలిసే వాళ్ళం. అన్ని మధ్య తరగతి కుటుంబాల పిల్లలకుండే అనుభవాలే నాకూ ఉన్నాయి.

నా స్కూల్ డేస్ సమయంలో ఇప్పుడున్నత టెక్నాలజీ లేదు. వీకెండ్ లో అమ్మా, నాన్నలతో కలిసి బయట భోజనం చేయటం, తోటి పిల్లలతో ఆడుకోవటమే అప్పటి వ్యాపకం.

కుటుంబం

నాన్న మర్చంట్ నేవీ లో పని చేసి రిటైర్ అయ్యాక నగల మార్కెటింగ్ చేసేవారు. అమ్మ కొంతకాలం టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేసారు. తర్వాత నా బాగోగులు చూసుకునేందుకు గృహిణిగా మారారు. నాకో అన్నయ్య. ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేశాడు.

మీ  పేరు వెనకున్న విశేషం?

తమన్నా అంటే  ప్రగాఢమైన కోరిక. నాన్న ముందునుంచీ అమ్మాయి పుట్టాలని కోరుకునే వారట. కానీ అన్నయ్య పుట్టాడు. రెండో సారైనా అమ్మాయి అయితే బాగుండనుకుని ఆ పేరు పెట్టారు.

చదువు

ఇంటర్ వరకూ ముంబై లోనే. నటిగా గుర్తింపు రావటంతో తాత్కాలికంగా చదువుకు స్వస్తి చెప్పా. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా చదువుకునే వెసులుబాటు ఉంది గనుక తప్పక చదువును కొనసాగిస్తా.

స్కూల్ డేస్

స్కూల్ రోజులను ఎప్పుడూ మరచిపోలేను.  ఏటా జరిగే వార్షికోత్సవంలో నా  డాన్సు షో తప్పక ఉండేది. మొదటినుంచీ దాన్స్అంటే చాలా ఇష్టం. టీచర్లు కూడా బాగా ప్రోత్సహించే వారు. చదువులో మాత్రం యావరేజ్ స్టూడెంట్ నే. క్లాస్ లో విన్నది గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయటమే తప్ప బట్టీ పట్టి చదివింది లేదు. చిన్నప్పటినుంచీ షేక్స్పియర్ సాహిత్యమంటే చాలా ఇష్టం. ఆయన నాటకాల్లోని డైలాగ్స్ చదివి, గుర్తు పెట్టుకునేందుకు ప్రయత్నించే దాన్ని. సాహిత్యంతో బాటు ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ అంటే ఇష్టం.

నటనలో తొలి అడుగులు

 పదో తరగతి నాటికే అప్పటికే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేసి ఉండటంతో పదో తరగతి పరీక్షలకు తయారవుతున్న సమయంలో శ్రీ సినిమా కోసం డైరెక్టర్ దశరద్ గారు ఫోన్ చేసారు. అప్పటికి సినిమా అంటే ఆసక్తే తప్ప అనుభవం, అవగాహన లేవు. మోహన్ బాబు గారు, డైరెక్టర్ గారు మాట్లాడిన తీరు చూశాక కాస్త ధైర్యం వచ్చింది. పరీశాల తర్వాత సెలవుల్లో ఉండగా శేఖర్ కమ్ముల గారు హ్యాపీడేస్ కోసం ఫోన్ చేసారు. సెలవులలో ఎదో ఒకటి చేస్తే పోలా అనిపించి ఆ సినిమాకు ఒప్పుకున్నాను. ఎలాంటి ప్రచారం, అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో అందులో నటించిన అందరికీ చక్కని పేరొచ్చింది.

ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?

ఏ మాత్రం సమయం దొరికినా విశ్రాంతి తీసుకుంటాను. ఇంకా వీలయితే స్నేహితులను కలుస్తాను. నేను మొదటినుంచీ ఖాళీగా ఉండటానికి ఇష్టపడను. అందుకే షూటింగ్ లేని రోజుల్లో పరమ బోర్ అనిపిస్తుంది. అవకాసం ఉన్నప్పుడల్లా పెబెల్ ( నా పెంపుడు కుక్క)ను తీసుకుని బయటికి వెళ్తుంటా.

నటన విషయంలో మీకు ప్రేరణ

నాకు మొదటినుంచీ మాధురీ దీక్షిత్ అంటే చాలా ఇష్టం. ఆమె సినిమాలు టీవీలో చూస్తూ ఆ  డైలాగ్స్, డాన్సులు సాధన చేసే దాన్న. ఇప్పటికీ ఆమె సినిమాలు టీవీలో వస్తే అవే చూస్తా. కరిష్మా కపూర్ ప్రభావం కూడా ణా మీద ఉంది. వీరిలాగా నేనూ మంచి పేరు తెచ్చుకోవాలని అనిపించేది.

తెలుగు ఇండస్ట్రీ లో మీకు నచ్చే అంశాలు

సినిమాకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఎంతో మంది నిపుణులున్నారు. కొత్త నటీనటులను ప్రోత్సహించటం, వారితో మర్యాదగా వ్యవహరించటం నాకు ఇక్కడ బాగా నచ్చిన అంశాలు.

మీరిప్పటిదాకా పొందిన ప్రశంశలు..

 హ్యాపీడేస్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన ప్రశంస ది బెస్ట్ అంటాను. ఆయన పాజిటివ్ థింకింగ్, సింప్లిసిటీ నాకెంతో నచ్చుతాయి.

ఫటా ఫట్ రౌండ్

ఫేవరెట్ యాక్టర్                       చిరంజీవి, నాగార్జున, హృతిక్ రోషన్

ఫేవరెట్ నటి                           మాధురీ దీక్షిత్

అభిమాన గాయని                    శ్రేయా ఘోషాల్

అభిమాన దర్శకులు                 రాజమౌళి

ఇష్టమైన సంగీత దర్శకులు       దేవీశ్రీ ప్రసాద్, తమన్

ఇష్ట దైవం                                 దేవుడు ఒక్కడే. ఆయన నిరాకారి.

ఫేవరెట్ హాలిడే స్పాట్                 పారిస్

ఇష్టమైన ఆహారం                       రుచిగా ఉన్న ఏదైనా ఓకే (పెరుగు తప్ప)

నచ్చే ఆట                         క్రికెట్

ఫేవరెట్ డ్రింక్                      కోక్

ఫేవరెట్ కలర్                    తెలుపు, నారింజ

మీ బలం                          నా ఉత్సాహం,

బలహీనత                        నా వృత్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోలేక పోవటం

ఎదుటివారిలో మీకు నచ్చేవి     నిజాయితీ, నిక్కచ్చిగా మాట్లాడటం

నచ్చనివి                                  మరొకరి గురించి చెడుగా మాట్లాడటం

 

మీ దృష్టిలో ఆరోగ్యం అంటే?

ఫిట్ గా ఉండటమే. ప్రపంచమంతా దీనిమీద దృష్టి పెట్టాలి. ఇప్పటికీ మన దేశంలో ఆహారం విషయంలో అవగాహన తక్కువే. ఉమ్మడి కుటుంబాలు తగ్గేకొద్దీ మంచీ చెడు చెప్పే పెద్దలు ఉండటంలేదు. ఆరోగ్యం విషయంలో ఎంతో కీలకమైన ఆహారం విషయమే ఇలా ఉంటే ఇక వేరే అంశాల గురించి ఏం చెప్తాం. ఈ పరిస్థితి వల్లే థైరాయిడ్, పీసిఓడీ వంటి సమస్యలు జలుబు, దగ్గు మాదిరిగా వస్తున్నాయి. ముందుతరం వాళ్ళు విన్నని సమస్యలివి. ఇక పిల్లలకు ఆదుకునేందుకు మైదానాలు లేవు. వీరందరికీ కంప్యూటర్, మొబైల్  తప్ప మరో కాలక్షేపం లేదు.  నూటికి తొంభై మార్కులు రావాలనుకునే పేరెంట్స్ వ్యాయామం విషయంలో మాత్రం శ్రద్ధ చూపటం లేదు. దీంతో ఒబేసిటీ వంటి సమస్యలు వస్తున్నాయి. ఆహరం, వ్యాయామం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందాని నేను పూర్తిగా నమ్ముతాను. శరీరం బాగుంటేనే  మనసూ బాగుంటుంది.

ఫిట్ నెస్ గురించి..

రోజూ లేవగానే పళ్ళు తోముకున్నట్టే ఒంటికి వ్యాయామం కావాలి. అందుకే రోజూ కనీసం గంట పాటు ఏదో రకమైన వ్యాయామం చేస్తాను. వాతావరణాన్ని బట్టి కూడా వ్యాయామాలలో మార్పులు చేసుకుంటాను. చేసే వ్యాయామాన్ని బట్టి డైట్ ప్లాన్ చేసుకుంటాను. ఎక్కువగా కార్డియో వ్యాయామాలు చేస్త్తుంటా. రన్నింగ్, జాగింగ్,వాకింగ్, డాన్సు కూడా ఇందులో భాగమే. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు రోజూ  యోగ  చేస్తాను. డైటింగ్ పేరుతొ కడుపుమాడ్చుకోవటం కంటే శారీరక అవసరాలకు తగిన ఆహారాన్ని తీసుకుంటూ అందుకు తగ్గ వ్యాయామం చేస్తే చాలనుకుంటాను.

పసితనపు ఛాయలను  కాపాడుకునేందుకు ఏం చేస్తారు?

మనసులోని భావాలను ముందుగా ప్రతిబింబించేది మన ముఖమే. మనసు ఎంత అమాయకంగా, యవ్వనంగా ఉంటే ముఖం అంట ప్రశాంతంగా ఉంటుంది. మనసు బాధపడుతుంటే ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా అది దాగదు. నామట్టుకు నేను ఇతరుల విషయాలు పట్టించుకోను. నా  పనేదో నాది అన్నట్టు ఉంటాను. ఒత్తిడికి దూరంగా, ఇష్టమైన పనిని చేసుకుంటూ పోతే ఎంత వయసు వచ్చినా చిన్న పిల్లల్లాగే కనిపించొచ్చు.

పాజిటివ్ థింకింగ్ గురించి..

మనిషి ఆశాజీవి. అలాగే ఉండటం మంచిది కూడా. ఎప్పుడూ మంచే జరుగుతుందనే నమ్మకమే పాజిటివ్ థింకింగ్. ప్రతి మనిషికీ ఇది అవసరం. ఎంతటి వారికైనా మనసు నిరంతరం మంచి,  చెడుల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. అది చెడు వైపు చూసినప్పుడల్లా దానిని సమాధానపరచి తిరిగి మంచి వైపు తిప్పుకోవాలి. ఇందుకు నవ్వటం, ఏడవటం, డాన్సు చేయటం, యోగా సాధన వంటి ఎన్నో మార్గాలున్నాయి. ఆలోచనలను బలవంతాన పట్టి ఉంచకుండా ఎప్పటికప్పుడు వ్యక్తం చేయాలి.

మీ ఆరోగ్య రహస్యం?

ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు పాటిస్తాను. ఎక్కువ నూనెతో చేసినవి తినను. వీలున్నంత వరకు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు, వంటలు తీసుకుంటాను. ప్రతి 2 గంటలకు ఒకసారి కొంచం కొంచంగా ఆహారం తీసుకుంటాను. వారంలో కనీసం 5  రోజులు క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తాను. అనుకున్న పనిని అనుకున్న టైం ప్రకారం ఎలాంటి వాయిదాలూ వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తాను గనుక లేని పోని టెన్షన్ ఉండదు.

మేలైన ఆరోగ్యం విషయంలో  మీరిచ్చే సూచనలు?

గతంలో కంటే ఇప్పుడు సౌకర్యాలు పెరిగినందున మనిషికి శారీరక శ్రమ లేకుండా పోయింది. దీనివల్ల నగర,  పట్టణ ప్రాంతాల్లో  చిన్న వయసులోనే పలు అనారోగ్యాల బారిన పడ్డాల్సి వస్తోంది. ఈ అంశం మీద అందరూ దృష్టి పెట్టాలి. ఆరోగ్యం లేకపోతే అన్నీ వున్నా ఏమీ లేనివారుగా మిగిలిపోవాల్సిందే. ఉన్నతలో మంచి ఆహారం, కనీస వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే చాలావరకు ఎలాంటి సమస్యలూ రావు. ఆరోగ్యాన్నిమించిన వరం మరొకటి లేనేలేదని అందరూ గుర్తుంచుకోవాలి. 

ఫిట్ నెస్ ప్లాన్

 • రోజూ వ్యాయామం చేస్తాను.
 • ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా వెంట ట్రైనర్ ఉండాల్సిందే. అవుట్ డోర్ షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం బీచ్ దగ్గరలో రన్నింగ్, జాగింగ్ చేస్తా.
 • మారే వాతావరణాన్ని బట్టి కార్డియో, యాబ్స్, క్రంచెస్, వెయిట్ లిఫ్టింగ్, ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలు, జిమ్నాస్టిక్స్ వంటివి మార్చి మార్చి చేస్తుంటా.
 • ఒత్తిడి దరిచేరకుండా ఉండేందుకు యోగా, ప్రాణాయామం చేస్తా.
 • తగినంత నిద్ర ఉండేలా చూసుకుంటా
 • డాన్స్, రన్నింగ్ వీలున్నప్పుడల్లా చేస్తా.

డైట్ వివరాలు

 • అల్పాహారంగా పాస్తా లేదా అన్నం, పప్పు
 • లంచ్ లో ఎగ్ వైట్, చికెన్ వంటి ప్రోటీన్ ఫుడ్
 • డిన్నర్ లో సూప్, ఏదైనా తేలికపాటి ఆహారం
 • వేసవిలో రోజూ కొబ్బరి నీరు
 • జంక్ ఫూడ్కు దూరంగా ఉండటం
 • వేళ పట్టున తినటం
 • ఉదయాన్నే నానబెట్టిన బాదం గింజలు తినటం
 • ఒంట్లోని వ్యర్ధాలను వదిలించుకునేందుకు గ్లాసెడు గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకు తాగటం
 • రోజంతా వీలైనన్ని నీళ్ళు తాగటం
 • పండ్ల రసాలు, కూరగాయల రసం తాగటం
 • కాఫీ, టీ లకు బదులుగా గ్రీన్ టీ తాగటంRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE