ఆధునిక యుగంలో చాలామంది  బాలలు, యువత  ఊబకాయం బారినపడుతున్నారు. మారిన ఆహారపుటలవాట్లు, చదువు పేరుతో ఆటపాటలకు దూరం  కావటం,  రోజంతా టీవీలు, కంప్యూటర్ల ముందు గడపటం, నీడపట్టున ఉద్యోగాలు చేసేవారి సంఖ్య పెరగటం, ఆకలి కంటే రుచికి ప్రాధాన్యం పెరగటం, మానసిక ఒత్తిళ్లు అధికం కావటమే ఈ సమస్యకు ప్రధాన కారణాలు. నివారించదగిన 10 ప్రమాదకర అనారోగ్య సమస్యల్లో ఒకటిగా ఊబకాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అధికబరువుతో మొదలయ్యే ఈ సమస్య  ఊబకాయంగా మారి, చివరికి ప్రాణాంతకం కావటం నిజంగా విచారకరం. మనదేశపు పట్టణ, నగర ప్రాంతాల్లోని ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది, పురుషుల్లో 32 శాతం మంది ఊబకాయ బాధితులేనని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. సమస్య వచ్చిన తర్వాత ఇబ్బందిపడే కంటే ముందుగా నివారణ మీద దృష్టిపెడితే ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని జాగ్రత్తలు, పాటించాల్సిన జీవన శైలి మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

 • కనీసం నెలలో 2 సార్లు బరువు చూసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. దీన్నేబాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) అంటారు. బీఎంఐ 20-25 ఉంటే సాధారణ బరువనీ, 25-30 మధ్య ఉంటే అధికబరువుగానూ, 30-35 మధ్య ఉంటే ఊబకాయం అని భావించాలి. బీఎంఐ 40కి మించితే మాత్రం ప్రాణాంతక స్థితిగా భావించాలి. ఈ దశలో మనిషి తన రోజువారీ దినచర్య నిమిత్తం ఇతరులమీద ఆధార పడాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ఈ దశలో తిండి తగ్గించినా ఆశించిన మేరకు బరువు తగ్గదు. బరువు పెరిగినప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ పరిస్థితిని నివారించవచ్చు.

 

 • అధిక బరువు ఉన్నవారు భోజనానికి అరగంట ముందు వీలున్నన్ని మంచినీళ్ళు త్రాగితే ఆకలి ప్రభావం తగ్గి పరిమితంగా ఆహారం తీసుకుంటారు. అలాగే భోజనం చేసిన 2 గంటల తర్వాత అరగంటకోమారు కనీసం అరలీటరు చొప్పున నీరు తాగటం వల్ల త్వరగా ఆకలి కాకపోవటమే గాక ఒంట్లో చేరిన వ్యర్ధాలు, మాలిన్యాలు సులభంగా బయటకి పోతాయి.

 

 • భోజనం పేరుతో ఒకసారే ఎక్కువ ఆహారం తినటం కంటే విడతల వారీగా తగిన విరామం ఇచ్చి తీసుకుంటే ఆహారం మీద అదుపు ఉంటుంది. అధిక బరువు బాధితులు పగలు కప్పు అన్నం, ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు, రాత్రిపూట ఒక చపాతీ, కాస్త కూరతో సరిపెట్టాలి. మరీ ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిలు పండో తినండి.
 • హడావుడిగా భోజనం చేయటం, నమలకుండా మింగటం వంటి అలవాట్లు మానుకోవాలి. భోజన సమయంలో నెమ్మదిగా ప్రశాంతంగా ఆహారాన్ని నమిలి చక్కగా ఆస్వాదిస్తూ తినాలి.
 • చిరుతిండి అలవాటు ఉన్న అధికబరువు బాధితులు నూనెలో వేయించిన పదార్థాలు కంటే ఆవిరి మీద ఉడికించిన వంటకాలు, నీరు పోసి వండిన వంటకాలు, మొలకెత్తిన గింజలు, గ్రీన్ టీ వంటివి తీసుకుంటే సరి. జంక్ ఫుడ్జో, శీతలపానీయాల జోలికి మాత్రం పోవద్దు.
 • అపార్ట్ మెంట్ లో ఉండేవారు లిఫ్టుకు బదులుగా మెట్లు ఎక్కటం మంచిది. కీళ్ళ వ్యాధులు, హృదయ సంబంధిత సమస్యలున్న వారు ఈ విషయంలో వైద్యుని సలహా తీసుకోవటం మంచిది.
 • సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి వ్యాయామాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. అందుకే రోజూ కనీసం అరగంటపాటైనా చెమట పట్టేంత వ్యాయామం చేయాలి. ఇంకాస్త కష్టపడితే చక్కని శరీరాకృతి కూడా సొంతమవుతుంది. అధిక బరువు ఉన్నవారు ఒక బృందంగా ఏర్పడి రోజూ ఏదైనా ఆట ఆడటం వాళ్ళ తగినంత బరువు తగ్గుతారు.
 • బరువు తగ్గాలనుకున్నవారిలో చాలామంది వ్యాయామం మొదలుపెట్టిన రెండు, మూడు రోజులకే బద్దకించి ఆ ప్రయత్నాన్ని మానుకుంటారు. అందుకే ముందుగా మీ ప్రణాళిక గురించి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహోద్యోగులకు చెప్పటం ద్వారా వారు తరచూ మీ బాధ్యతను గుర్తుచేస్తూ ఉంటారు.
 • ఒక్కసారే బరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేసేబదులు దాన్ని ఒక రోజువారీ వ్యాపకంగా మార్చుకుంటే ఆరోగ్యంతో బాటు ఆహ్లాదం కూడా తోడవుతుంది.
 • ధూమపానం ఊబకాయానికి దారితీస్తుంది గనుక ఆ అలవాటుకు స్వస్తి పలకాలి. వ్యాయామానికి అరగంట ముందు, తర్వాత చేసే ధూమపానం మరింత ప్రమాదాన్ని కొనితెస్తుంది.
 • చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచటం ద్వారా భవిష్యత్తులో ఈ జాడ్యం బారిన పడకుండా చూడొచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE