మన శరీర భంగిమల్లో కొన్నింటిని యోగశాస్త్రం ఆసనాలుగా గుర్తించింది. మానవ జీవితాన్ని మరింత స్పష్టంగా అర్థంచేసుకోవటానికి, దాని పరమార్ధాన్ని గుర్తించి సమున్నత లక్ష్యాల వైపు నడిపించేందుకు ఈ యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

భావనలను బట్టే భంగిమలు

సాధారణంగా.. మన మానసిక భావాలను బట్టి శరీరం ఆయా భంగిమలోకి మారుతుంది. అంటే.. సంతోషంలో ఉన్నప్పుడు ఒకలా, బాధలో మరోలా ఈ భంగిమలు మారిపోతాయి. కాస్త గమనించగలిగితే.. మనిషి భంగిమనుబట్టి అతని మానసికస్థితి స్పష్టంగా అంచనా వేయవచ్చు. అదే.. యోగాసనాలు వేసేటప్పుడు మాత్రం దీనికి విరుద్ధమైన పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకువెళ్లి, తద్వారా మన లోపలి చైతన్యాన్ని పెంచేలా చేస్తాం. ఈ సమయంలో పాత ఆలోచనలకు భిన్నంగా మనం కోరుకున్న రీతిలో మన ఆలోచనలను మార్చుకోవచ్చు. 

ఆసనాలు కాదు.. వ్యవస్థలు

మన యోగాసనాలలో చైతన్యాన్ని పెంచే 84 ప్రాధమిక ఆసనాలు ఉన్నాయి. ఇక్కడ 84 ఆసనాలు అంటే.. 84 భంగిమలని గాక ముక్తి సాధనకై ఉన్న 84 వ్యవస్థలని తెలుసుకోవాలి. వీటిలో కనీసం ఒక్క యోగాసనంలోనైనా మనం ప్రావీణ్యం పొందగలిగితే .. ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే.. యోగాసనాలంటే సాధారణ వ్యాయామాలు కావు. అవి ప్రాణశక్తిని నిర్దిష్ట దిశలో నడిపించే సున్నితమైన ప్రక్రియలు. వీటిని ఒక స్థాయి ఎరుక (awareness)తో సాధన చేయాలి. అలాగే.. పతంజలి మహర్షి చెప్పినట్లు సాధన చేసే భంగిమ సౌకర్యవంతంగా, సుఖాన్ని అందించేదిగా ఉండాలి. అప్పుడే మనసుకు హాయి, శరీరంలో శక్తి, చైతన్యాల ప్రవాహం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఊరికే కూర్చున్నా ధ్యానంలో ఉన్నట్లే. దీన్నిబట్టి ఆసనం అంటే.. సహజసిద్ధంగా ధ్యానస్థితిని పొందేందుకు వేసే ఒక సన్నాహక యత్నమని అర్థం చేసుకోవాలి. అందుకే.. ఆసనాలు చురుకైన ధ్యాన మార్గాలు.

 

ప్రేమాశీస్సులతో,

 

సద్గురు

(ఈషా ఫౌండేషన్ సౌజన్యంతో )Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE