మామిడి పండ్లు వచ్చే సీజన్ వచ్చేసింది. ఎండాకాలం అనగానే ఎండలతో బాటు గుర్తొచ్చే ఫలం కూడా మామిడే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా ఆస్వాదించే మామిడికి  మన జాతీయ ఫలం గానూ, పండ్లలో రారాజుగా గుర్తింపు ఉంది. కమ్మని రుచుతో బాటు బోలెడన్ని పోష కాలనూ మామిడి అందిస్తుంది. ఒక కప్పు మామిడి పండు ముక్కల్లో (165 గ్రాములు) ఎన్ని పోషకాలు అందుతాయో తెలుసు కుంటే ఎవరైనా నోరెళ్ళ బెట్టాల్సిందే.

కప్పు మామిడి పండు ముక్కల్లో (165 గ్రాములు)

107 కేలరీల శక్తి

ఒక గ్రామ్ ప్రోటీన్

28 గ్రాముల కార్బోహైడ్రేట్లు

2.6 గ్రాముల పీచు పదార్ధం

3 మిల్లీగ్రాముల సోడియం

ఒక రోజుకు శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి లో 65 శాతం

ఒక రోజుకు శరీరానికి అవసరం అయ్యే విటమిన్ ఇ లో 12 శాతం

ఒక రోజుకు శరీరానికి అవసరం అయ్యే  మొత్తం విటమిన్  బి 6

ఒక రోజుకు శరీరానికి అవసరం అయ్యే ఫోలేట్ లో 20 శాతం వరకూ అందుతుంది.

మామిడి చేసే మేలు

  • కంటికి నేస్తం: కప్పు మామిడి పండు ముక్కలు తింటే 1800 యూనిట్ల విటమిన్ ఎ అందినట్లే. అంటే రోజుకు అవసరమయ్యే మొత్తం విటమిన్ ఎ లో సుమారు 35 శాతానికి సమానం అన్నమాట. ఇది కంటి సమస్యలు రానీయకుండా చూడటానికే గాక పెద్దవయసులోనూ కంటి చూపును భేషుగ్గా ఉండేలా చేస్తుంది.
  • ఎముకలకు బలం: మామిడి పండులోని విటమిన్ సి, ఎ కారణంగా తరచూ దీన్ని తినేవారి ఎముకలు బలంగా తయారవుతాయి. మామిడిలోని పొటాషియం ఎముకల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది.
  • కేన్సర్ నివారిణి: మామిడిలోని పాలీ ఫీనోలిక్ పదార్థాలకు కేన్సర్ కణాల మీద పోరాడే శక్తి ఉంది. ఇవి కణాల మీద ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తొలగించి కేన్సర్ కణాలను కట్టడి చేస్తాయి. మామిడిలోని పాలీ ఫినాల్స్, ప్రత్యేకమైన ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్ మూలంగా బ్రెస్ట్ కేన్సర్, లుకేమియా , ప్రోస్టేట్ కేన్సర్, పెద్దపేగు కేన్సర్ వంతో ప్రాణాంతక వ్యాధులు అంట సులభంగా దరిజేరవు.
  • గుండె పనితీరును మెరుగు పరచటంతో బాటు రక్తపోటును కూడా మామిడిలోని పొటాషియం నియంత్రిస్తుంది.    
  • మామిడిలోని పీచు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. వ్యర్ధాలను, మలినాలనూ వేరు చేస్తుంది. ఈ పీచుకు రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి కూడా ఉంది.
  • మామిడిలోని విటమిన్ సి, ఎ మూలంగా శరీరపు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
  • మామిడి తినే టైప్ 1,2 మధుమేహులలో రక్తంలోని చక్కెర నిల్వలు పడిపోయే ప్రమాదం ఉండదు. అయితే వీటిని వీలున్నంత పరిమితంగానే తీసుకోవాలి. కొన్ని పండ్లకు భిన్నంగా మామిడిలోని గ్లైసిమిన్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల దీన్ని తిన్నప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. అలాగని అదేపనిగా కూడా తినరాదు.
  • మామిడి తిన్నప్పుడు ఉదరంలో ఆల్కలీన్ స్వభావం ప్రేరేపితమై ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. అయితే మామిడిని పాలతో బాటు తీసుకుంటే మాత్రం ఎసిడిటీ బారిన పడాల్సి వస్తుంది.
  • మండే ఎండల మూలంగా శరీరం కోల్పోయే పోషకాలను మామిడి అందిస్తుంది. కాబట్టి మామిడి తింటే వేడి చేస్తుందనే అపోహలు పక్కన బెట్టి ఎంచక్కా తినండి.
  • కొన్ని రకాల పండ్ల మాదిరిగా గాక మామిడి పండు తినటం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా తక్కువే.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE