బొప్పాయి పండులో ఉండే పోషకాలు మరే ఇతర పండ్లలోనూ లేవనేది పోషకాహార నిపుణులు చెబుతున్న మాట. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. వైద్య పరంగా చూసినప్పుడు ఉదర సంబంధిత సమస్యలకు బొప్పాయి చక్కని పరిష్కారం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోదగిన పండు బొప్పాయి.కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే బొప్పాయి ఊబకాయం బాధితులకు చక్కని ఆహారం. ఇందులోని పపైన్ అనే పదార్థం వలన తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై పోతుంది. బొప్పాయి పండు విశేషాలు, అందులో ఉండే పోషకాల వివరాలను తెలుసుకుందాము.

పోషక విలువలు ( ప్రతి 100 గ్రాములకు)

పిండిపదార్థాలు 9.81 గ్రాములు

చక్కెరలు 5.90 గ్రాములు

శక్తి  40 కిలో కేలరీలు

పీచుపదార్థాలు 1.8 గ్రాములు

కొవ్వు పదార్థాలు 0.14 గ్రాములు

మాంసకృత్తులు 0.61 గ్రాములు

వైద్యపరమైన ఉపయోగాలు

 • బొప్పాయిలోని బీటా కెరోటిన్‌ క్యాన్సర్‌ నివారిణి గనుక తరచూ బొప్పాయి తినే వారికి హృద్రోగాలూ, పేగు క్యాన్సర్ బెడద లేనట్టే.
 • మామిడి తర్వాత అంత మొత్తం విటమిన్ ఎ లభించే పండు బొప్పాయే. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.
 • బొప్పాయిలో లభించే పపైన్ నొప్పి నివారిణిగానూ( పెయిన్‌కిల్లర్‌) పనిచేస్తుంది. గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.
 • మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. బొప్పాయిపండులో ఉండే పీచు మొలల సమస్యను దరిచేరనీయదు. పచ్చి బొప్పాయి జీర్ణ ప్రక్రియకు తోడ్పడితే పండిన పండు పోషకాలనిస్తుంది.
 • ఆకలి లేకపోవటం, అరుచి, అరుగుదల లోపాలకు బొప్పాయి మేలైన ప్రత్యామ్నాయం.
 • జలుబు,చెవినొప్పి బాధితులు ఈ పండు తినడంవల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
 • బొప్పాయిపండు తామర వ్యాధిని తగ్గిస్తుంది.
 • రోజూ పచ్చి బొప్పాయి ముక్కలు రెండు తింటే అధిక రక్తపోటుని (హై బీపీ) అదుపులో ఉంటుంది.
 • నేత్ర సంబంధిత సమస్యలను దూరం చేసే బీటాకెరోటిన్‌ బొప్పాయిలో పుష్కలంగా లభిస్తుంది.
 • ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరిగేందుకు, దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బొప్పాయిలోని విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

సౌందర్య పోషణకు

 • వారానికి కనీసం 3 సార్లు ముఖానికి బొప్పాయి గుజ్జు రాసుకుంటే ముఖానికి మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి.
 • బొప్పాయి గుజ్జుతో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే జిడ్డు చర్మం సైతం నిగారిస్తుంది.
 • చర్మానికి బొప్పాయి మేలు చేస్తుంది గనుకే సబ్బులు, క్రీముల్లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు.

జాగ్రత్తలు

 • క్యారెట్‌ మాదిరిగానే బొప్పాయిని ఎక్కువగా తింటే కెరటెనిమియా వ్యాధి వస్తుంది.
 • బొప్పాయిలోని పపైన్ కారణంగా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉన్నందున గర్భిణులు పచ్చి బొప్పాయి తినరాదు. అయితే పండిన బొప్పాయిని గర్భిణులు, బాలింతలు ఏ అనుమానం లేకుండా తినవచ్చు.
 • కొందరిలో బొప్పాయి పాలు దురదకు కారణమయ్యే అవకాశం ఉన్నందున పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు.
 • బొప్పాయి పండు, గింజలు, ఆకులు, పాలల్లో కారైశ్బన్‌ అనే యాంథెల్‌మింటిక్‌ ఆల్కలాయిడ్‌ ఉంటుంది. ఇది ఎక్కువయితే ప్రమాదకరం గనుక బొప్పాయిని పరిమిత గానే తినాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE