డ్రై ఫ్రూట్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది జీడిపప్పు. అయితే అధిక కేలరీల శక్తిని అందించే జీడిపప్పు తింటే బరువు పెరుగుతారనీ, ఊబకాయం సమస్య వస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. జీడిపప్పు వినియోగం విషయంలో అపోహలను దూరం చేసే కొన్ని వాస్తవాల గురించి తెలుసుకుందాం. అవి..
- జీడిపప్పులోని సెలీనియం, విటమిన్-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని అరికట్టి క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుతాయి.
- జీడిపప్పు తినటం ద్వారా లభించే జింక్.. పలు రకాల ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది.
- జీడిపప్పులో ఉండే కాపర్ మూలంగా ఎంజైమ్‌ల పనితీరు మెరుగుపడటమే గాక మెదడు చురుకుగా పనిచేస్తుంది.
- జీడిపప్పులో కొవ్వు అధికంగా ఉన్న మాట నిజమే గానీ అది ఆరోగ్యానికి మేలు చేసేదే. ఈ మేలు చేసే కొవ్వు గుండె జబ్బులు రానీయకుండా చూస్తుంది.
- శరీరానికి ఒక రోజుకు సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం. జీడిపప్పులో 29 శాతం మెగ్నిషియం ఉంటుంది గనుక తగినన్ని జీడిపప్పు తీసుకుంటే మెగ్నీషియం కొరత నివారించబడి ఎముకల, కండరాలకు పటుత్వం పెరుగుతుంది.
- జీడిపప్పులో సోడియం బహు తక్కువగా ఉండటమే గాక పొటాషియం ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పు తిన్నప్పుడు శరీరానికి అందే పొటాషియం మూలంగా రక్తపోటును అదుపులో ఉంటుంది.
- కాపర్ అధిక మొత్తంలో కలిగిన జీడిపప్పును తినటం వలన ఒత్తైన జుట్టును పొందటమే గాక బాల నెరువు దూరం అవుతుంది.
- తరచూ జీడిపప్పు తినే మహిళల్లో హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు ఉండవు. జీడిపప్పులోని రిబోఫ్లావిన్, పాంటోథీనిక్ ఆసిడ్, థైయామిన్, నియాసిన్ వంటి విటమిన్లు రక్తహీనత సమస్య రాకుండా చూస్తాయి.
- రోజు జీడిపప్పు తినే వారిలో కిడ్నీ రాళ్ళ సమస్య వచ్చే అవకాశం బాగా తక్కువ.
గమనిక: రుచి బాగుందని అదేపనిగా జీడిపప్పు తినకూడదు. రోజుకు 7 లేదా 8 పప్పులు తింటే చాలు.