పొట్లకాయ, కోడిగుడ్డు కలిపి తింటే ప్రమాదమా? పాలకూర, టమోటో కలిపి వండుకు తింటే కిడ్నీలోరాళ్లు ఏర్పడతాయా? వంటి ప్రశ్నలు మనలో చాలామంది వినేవుంటారు. నిజానిజాల సంగతేమోగానీ వీటిని తినేందుకు ఇప్పటికీ చాలామంది భయపడుతుంటారు. అయితే ఇవన్నీ అపోహలేనని , వీటివల్ల అపారమైన పోషక విలువలున్న ఆహార పదార్థాల ప్రయోజనాలను కోల్పోతున్నారని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశం విషయంలో జనసామాన్యంలో ఉన్న కొన్ని అపోహలను దూరం చేసే ప్రయత్నమే ఇది.

పొట్లకాయ, కోడిగుడ్డు

ఈ రెండు కలిపితింటే విషం తిన్నట్లే అని చాలామంది అనుకుంటారు. అయితే నిజానిజాలను పరిశీలిస్తే పొట్లకాయ  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు లంఖణం చేసినవారికి ముందుగా తేలికగా జీర్ణమయ్యే పొట్లకాయను తప్పక తినిపిస్తారు కూడా . ఇందులో ఉండే కాలరీలు కూడా తక్కువే. పైగా బోలెడంత నీరు, పీచు,విటమిన్ బి ఉంటుంది. ఇక సమీకృత ఆహారంగా చెప్పే కోడిగుడ్డు అందించే మాంసకృత్తులు, పిండిపదార్థం, ఐరన్ తదితర ఆవశ్యక పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది అనుకున్నట్లుగా ఈ రెంటినీ కలిపి తినటం మూలంగా ఎలాంటి సమస్యా రాకపోగా ఈ రెంటిలో ఉండే పోషకాలు అందుతాయి. కాబట్టి నిశ్చింతగా ఈ రెంటినీ కలిపి వండుకు తినొచ్చు.

పాలకూర, టొమాటో

పాలకూరలో క్యాల్షియం, టొమాటోలోనిఆగ్జలేట్స్ కలిసి కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయని కొందరి అపోహ. అయితే ఇందులో ఏమాత్రం నిజంలేదు. జన్యుపరమైన కారణాలు, తక్కువగా మంచి నీరు తాగటం వంటి పలు కారణాల వల్ల మాత్రమే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి తప్ప పాలకూర, టొమాటో కలిపి వండుకు తినటం వల్ల మాత్రం కానేకాదు.

భోజనంతో బాటు పండ్లు

భోజనం పేరిట ఒకేసారి అన్నం, కూరలు, మిఠాయిలు, పాల పదార్థాలు, పండ్ల ముక్కలుతీసుకోవటం, తిన్న ఆహారానికి తగినంత శారీరక శ్రమ లేకపోవటం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావటం కష్టమవుతుంది. కొన్ని సార్లు వాంతులు, కడుపులో నొప్పి  కూడా రావచ్చు. అయితే సదరు ఆహార పదార్థాలు కలిపి తినటం వల్లేనని కొందరు భ్రమ పడుతుంటారు  తప్ప ఇందులో నిజం లేదు. అందుకే ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవటానికి బదులుగా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లుగా తీసుకుంటే ఈ సమస్య అసలు తలెత్తదు.

చేపలు, పెరుగు

అపోహల జాబితాలో ఉన్న మరో కాంబినేషన్ చేపలు, పెరుగు. చేపల రుచిని ఆస్వాదించిన వెంటనే పెరుగు తింటే నోరు పాడవుతుందనే తప్ప ఇందులో మరే ప్రమాదమూ లేదు. పెరుగు జీర్ణ శాంతిని పెంపొందించే ఆహారం. అయితే అత్యంత సులభంగా జీర్ణమయ్యే చేపలు తిన్నప్పుడు ప్రత్యేకంగా పెరుగు తినాల్సిన అవసరం లేదని తప్ప ఇందులో భయపడేందుకు ఏమీ లేదు.

ఇంకా పాలు, అరటి పండు ఒకేసారి తినరాదనీ, కొన్ని నూనెలు కలిపి వాడరాదనే అపోహలూ ఉన్నాయి. అయితే ఆహారం విషయంలో ఉన్న అనుమానాలను పోషకాహార నిపుణల సలహాతో దూరం చేసుకోవాలే గానీ అపోహల పేరిట కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవటం వల్ల పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం తప్పదని ఎందరో గమనించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE