చంటిబిడ్డలకు తల్లిపాలకు మించిన పోషకాహారం మరొకటి లేదు. అయితే బిడ్డ వయసు 6 నెలలు నిండిన తర్వాత చనుబాలతో బాటు అనుబంధ ఆహారం కూడా అవసరం అవుతుంది. ఇంట్లోనే సులభంగా, తాజాగా చేసుకొనే వీలుండే ఈ ఆహారం ఇవ్వటం ద్వారా పిల్లల్లో ఎదుగుదల లోపాలను నివారించవచ్చు. ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రతితల్లీ తన బిడ్డ వయసుకు తగినట్లు అనుబంధ ఆహార పరిమాణం, తీరులో మార్పులు చేసుకోవాలి. అప్పుడే బిడ్డ సమగ్ర వికాసం సాధ్యమవుతుంది.

వయసుకు తగ్గ ఆహారం

 • తల్లిపాలతో విటమిన్ సి బహుతక్కువగా ఉంటుంది గనుక బిడ్డకు 4వ నెల నుంచే పండ్ల రసాల వంటి తేలికపాటి ద్రవాహారం ఇవ్వాలి. దీనివల్ల విటమిన్ సి లోపాన్నిభర్తీ చేయవచ్చు.అయితే వీటిని నేరుగా కాకుండా కాచి చల్లార్చిన నీటితో కలిపి ఇవ్వటం వల్ల సులువుగా జీర్ణం అవుతుంది. తొలిరోజుల్లో ఒక్కో చెంచాతో మొదలు పెట్టి క్రమముగా 5 చెంచాల వరకు పెంచుకుంటూ పోవాలి.
 • బిడ్డకు 5వ నెల రాగానే పండిన మామిడి, అరటి, యాపిల్, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును కొంచెం కొంచెం అలవాటు చేయాలి. దీనితో బాటు బార్లీ, సజ్జ, రాగి వంటి తృణధాన్యాల పిండితో కాచిన జావను పలుచగా చేసి చెంచాతో కాస్త కాస్త ఇవ్వాలి.
 • సాధారణంగా పిల్లలకు 6వ నెలలో అన్నప్రాసన చేస్తారు గానీ పెద్దగా ఆహారం మాత్రం పెట్టరు. ఇది సరైన విధానం కాదు. పిల్లలకు ఘన ఆహారం అవసరం మొదలయ్యే ఈ వయసులో బియ్యం, పప్పు దోరగా వేయించి వండి దానికి నెయ్యి జోడించి మెదిపి రెండుపూటలా 2 చెంచాల చొప్పున తినిపించాలి. 7వ నెల వచ్చేసరికి దీనితోబాటు ఇడ్లీ, ఉడికించిన క్యారెట్, చిక్కుడు గింజల వంటివి మెత్తగా చేసి అలవాటు చేయాలి.
 • పిల్లలకు 8 వ నెల వచ్చేసరికి పాలపళ్ళు వచ్చి వస్తువులను నోట్లోపెట్టుకొని కొరుకుతుంటారు. ఘనపదార్థాలు తినే ఈ వయసులో పిల్లలకు అప్పటి వరకూ ఇస్తున్న ఆహారంతో బాటు సన్నగా కోసిన క్యారెట్, బొప్పాయి, బీర, టమోటా వంటి ముక్కలురోజుకు 3,4 సార్లు నెమ్మదిగా అలవాటు చేయాలి.
 • 10వ నెల నిండగానే పిల్లలకు పెద్దలు తినే అన్నంలోనే పప్పు, నెయ్యి వేసి కలిపి నమిలి తినటం అలవాటు చేయాలి. పిల్లల ఆహారంలో ఎక్కువ నూనెలు, కారం, ఘాటైన మసాలాలు వాడరాదు.

ఇతర అంశాలు

 • పిల్లలకు హడావిడిగా, బెదిరించి అన్నం పెట్టకూడదు. వారిని ఎత్తుకొని అటూ ఇటూ తిప్పుతూ కొంచెం కొంచెంగా మురిపెంగా ఆహారం పెట్టాలి. భోజనం సమయం అంటే పిల్లలకు సంతోషం కలిగేదిగా చూడాల్సిన బాధ్యత పెద్దలదే.
 • రోజువారీ ఆహారంలో అన్నంతోబాటు పప్పు ,నెయ్యి, ఉడికించిన కూరగాయలుతప్పనిసరి.
 • పిల్లలకు కాచి చల్లార్చిన శుభ్రమైన నీరు మాత్రమే తాగించాలి.
 • కూరగాయల పై తొక్క, లోపలి గింజలు తీసి ఉడికించి పెట్టటం వల్ల సులువుగా జీర్ణం అవుతుంది.
 • 6 నెలల నుండి ఉడికిన గుడ్డు తెల్లసొన, ఏడాదిన్నర నిండిన పిల్లలకు మాంసాహారం పెట్టవచ్చు.
 • ఆహారం కాస్త మెత్తగా ఉండేలా చూడటం, నమిలేలా పెద్దలు చూడాలి.దగ్గు కారణంగా పొలమారితే కొద్దిగా మంచినీరుఇవ్వాలి. పిల్లలు ఇష్టపడని ఆహారాన్ని బలవంతంగా తినిపించక, వారం పాటు ఆగి ఆ తర్వాత నచ్చజెప్పి తినేలా చేయాలి.
 • పిల్లలకు వాడే గిన్నెలు, చెంచాలు రోజూ వేడినీటిలో మరిగించాలి. భోజనం తినిపించే ముందు పెద్దలు వేడినీటితో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
 • ఫలానా పండు లేక పదార్ధం గిట్టక జలుబు చేసిందనీ, విరేచనం అయ్యిందని అనుకోవటం పూర్తిగా అపోహే. దీనివల్ల పిల్లలకు కొన్ని పోషకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ అపోహలను పక్కనబెట్టి పిల్లలకు అన్ని రకాల ఆహారాలు ఇవ్వాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE