పాయా షోర్వా అనగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ పాతనగరమే. నగరాన్ని సందర్శించే అనేకులు కేవలం ఈ వంటకాన్ని రుచిచూసేందుకే పాత నగరానికి వస్తారంటే అతిశయోక్తి కాదు. మేక, గొర్రె కాళ్లతో వండే ఈ వంటకం తింటే ఎంతటి నడుము, కీళ్ల నొప్పులైనా తగ్గుతాయని చెబుతారు. తీవ్రమైన  కీళ్ల నొప్పుల బారినపడిన నాటి నిజాం ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ కు అఫ్గాన్ వైద్యులు ఔషధాలతో బాటు ఈ మొఘలాయి వంటకాన్ని తినిపించడం, దీనివల్ల చక్కని ఫలితం కనిపించటంతో నాటి నుంచి ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందనీ చెబుతారు. ఇందులో వాడే మసాలాలు జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచటమే గాక తీవ్రమైన మలబద్దకం, విరోచనాలకు ఔషధంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ పాయా షోర్బా ఎలా చేయాలో తెలుసుకుందాం.  

కావల్సినవి

       మేక/ గొర్రె కాళ్ళుమటన్ ముక్కలు - 10,  వెల్లుల్లి- 8 రెబ్బలు, ఉల్లిపాయలు- 4, పసుపు- అరచెంచా, లవంగాలు-5, పచ్చ యాలకులు- 4, లవంగాలు- 6, దాల్చిన చెక్క- 3 అంగుళాలు, గసగసాలు, కొబ్బరి- చెంచా చొప్పున ఉప్పు- రుచికి తగినంత, నెయ్యి- అరకప్పు, కారం- చెంచా, మిరియాల పొడి- అరచెంచా, కొత్తిమీర- చిన్న కట్ట, గరం మసాలా- చెంచా, నిమ్మరసం- చెంచా

తయారీ 

ముందుగా గొర్రె, మేక మోకాళ్ల ను నిప్పులతో కాల్చి చర్మాన్ని తీసి వాటిని ఉప్పు నీటితో కడిగి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి, మరో రెండు ఉల్లిపాయలను వెల్లుల్లితో కలిపి దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద మందపాటి గిన్నె తీసుకొని అందులో 20 కప్పుల నీరు, మటన్ ముక్కలు వేసి ఉడికించాలి. ఉడుకుపట్టగానే ఇందులో వెల్లుల్లి, ఉల్లి మిశ్రమాన్ని, పసుపు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. పాయా మిశ్రమం చిక్కపడుతుండగా మరో 3 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. మరో పొయ్యి మీద పాన్‌ను పెట్టి నెయ్యి వేసి అందులో సిద్ధం చేసిపెట్టుకొన్న ఉల్లి తరుగు వేసి రంగు మారే వరకు వేయించి  తర్వాత కారం, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాయాలో వేసి కలపాలి. చాలా సన్నని మంట మీద దాదాపు 4 గంటల సేపు మరిగించాలి. ఎముకలకున్న కండ పూర్తిగా సూపులో కలిసిపోయే వరకు ఉడికించి తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసి, పైన కొద్దిగా నెయ్యి వేసి మంట తీసేయాలి. నిమ్మరసం కలిపి వేడి వేడిగా నాన్‌ రోటీ, రోటీ, పుల్కాలలోకి వడ్డించాలి. 

గమనిక: ఈ వంటకాన్ని సంప్రదాయ పద్దతిలో కట్టెల మీద చేసినప్పుడే అసలైన రుచి వస్తుంది. దీనికితోడు వాడే మసాలా నాణ్యత, పాళ్ళు కూడా దీని రుచికి కారణం. ఇంటిలో తొలిసారి దీన్ని ప్రయత్నిద్దామనుకొంటే అనుభవం ఉన్నవారి సాయం తీసుకోవటం మంచిది.  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE