ఆరోగ్యానికి వాము చేసే మేలు అంతాఇంతా కాదు. వాము మొక్క వేరు, ఆకు, కాండం, పువ్వు ఇలా.. దీని ప్రతి భాగమూ ఔషధమే. మనలో చాలామంది తాజా వాము ఆకుతో చేసే బజ్జీలు రుచి చూసే వుంటారు. వాము ఆకు పచ్చడి సైతం ఎంతో రుచిగా ఉంటుంది. ఆహా అనిపించే రుచిగల ఈ పచ్చడి తయారీ వివరాలను తెలుసుకొందాం.
కావలసినవి
తాజా వాము ఆకులు - పావు కేజీ, శనగపప్పు- 2 చెంచాలు, మినప్పప్పు- చెంచా , ధనియాలు- చెంచా, జీలకర్ర- చెంచా, వెల్లుల్లి రేకలు- 4, ఎండుమిరపకాయలు- 4, చింతపండు- కొద్దిగా, నూనె- గరిటెడు చెంచాలు
తయారీ
ముందుగా మూకుడులో 4 చెంచాల నూనె వేసి అందులో శనగపప్పు,మినప్పప్పు,ధనియాలు,జీలకర్ర వేయించుకొని ఇవన్నీబాగా వేగాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రేకలు వేసి వేయించుకొని చల్లారే వరకు మూకుడును దించి పక్కన బెట్టాలి. ఇప్పుడు మరో మూకుడులో కడిగిన వాము ఆకులు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తాలింపు గింజలు ఆరగానే వాటితో బాటు కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమంలోనే మగ్గిన వాము ఆకులు, కొద్దిగా ఉప్పు వేసి మరో తిప్పు తిప్పి చివరగా పోపు వేసుకుంటే వాము ఆకు పచ్చడి రెడీ అయినట్లే.