ఎన్నో పోషకాలతో బాటు బోలెడంత పీచు అందించే పండ్లలో జామది ప్రత్యేక స్థానం. ఆంగ్లంలో దీన్ని 'గువా' అంటారు. ఆపిల్ తో పోల్చితే ఎక్కువ పోషకాలు, తక్కువ ధర ఉండే జామను 'పేదవాడి ఆపిల్' గానూ పిలుస్తారు. ఆకట్టుకొనే రంగు, రుచి, రూపంతో బాటు ఏడాది పొడవునా అందుబాటు ధరలో లభించటం దీని ప్రత్యేకత. ఆరోగ్యానికి మేలు చేసే యాంటిఆక్సిడెంట్లు, బీటాకెరోటిన్లు, పాలిఫినాల్స్, కెరటి నాయిడ్స్ వంటి ఎన్నో పోషకాలనందించే జామలో రవ్వంత కూడా హానికారక కొలెస్ట్రాల్ ఉండదు. నారింజలో కంటే జామలో 5 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకే.. పోషకాల రీత్యా ఎన్నో విశేషాలున్న జామ పండును నిర్లక్ష్యం చేయకుండా తరచూ తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది.
- జామ పండు తింటే గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి పలు జీర్ణకోశ సమస్యలు, జలుబు దూరమవుతాయి. భోజనం తర్వాత ఒక జామ ముక్క తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మధుమేహూలుసైతం నిరభ్యంతరంగా తినదగిన ఫలం. జామ చెట్టు బెరడు డికాక్షన్ తాగితే పొట్టలోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి.
- తరచూ జామకాయ తినేవారిలో చిగుళ్లు, దంతాలు బలోపేతమవుతాయి. జామలోని విటమిన్ సి వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది. రోజూ 2,3 లేత జామ ఆకులు నమిలితే నోటిదుర్వాసన తగ్గటమే గాక దంతాలు శుభ్రపడతాయి.
- తరచూ జామకాయ తినేవారికి మలబద్ధక సమస్య రాదు. ఈ సమస్య బాధితులు పండిన జామ పండ్ల ముక్కల మీద మిరియాల పొడి చల్లి, 4 చుక్కలు నిమ్మరసం పిండి తింటే ఎంతటి మలబద్దకమైనా వదిలిపోవాల్సిందే. దీనితో బాటు అతిసార, జిగట విరేచనాలు, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, గర్భిణుల్లో వాంతులకు జామ మంచి ఔషధంగా పనిచేస్తుంది.
- శారీరక బలహీనత ఉన్నవారు పండిన జామలోని గింజలు తీసి ఆ గుజ్జును పాలు, తేనెతో కలిపి తీసుకొంటే తగినంత విటమిన్ సి, క్యాల్షియం లభించి శారీరక దృఢత్వం చేకూరుతుంది. ఎదిగేవయసు పిల్లలు, గర్భిణుల ఆరోగ్యానికీ ఇది ఎంతగానో దోహదం చేసుంది. అలాగే.. క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలున్న వారికి సైతం పండిన జామ గుజ్జు ఔషధంగా పనిచేస్తుంది.
- వేసవిలో దాహార్తిని తీర్చేందుకు జామ ఉపయోగపడుతుంది. వేసవిలో వృత్తిపరంగా బయట తిరిగే వారు, దూరప్రయాణాలు చేసేవారు గుప్పెడు జామ ముక్కలను 3 గంటలపాటు నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే దాహార్తి తీరుతుంది.
- దోర జామపండును సానరాయి మీద అరగదీసి ఆ లేపనాన్ని నుదుటి మీద రాస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా మైగ్రెయిన్ బాధితులు సూర్యోదయానికి ముందే ఇలా చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
- రోజూ కనీసం ఒక ముక్క దోర జామకాయ తింటే రక్తపోటు అదుపులో ఉండటమే గాక ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.
- జామలోని కెరొటినాయిడ్స్, ఐసోఫావో నాయిడ్స్, పాలిఫినాల్స్ మెదడు కణాలు చురుకుగా ఉండేలా చూసి మెదడు పనితీరును పెంచుతాయి.
- కాలిన గాయాలకు జామ గుజ్జును రాస్తే త్వరగా మానటమే గాక మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
100గ్రాముల జామలో ఉండే పోషకాలు
శక్తి 112 కేలరీలు
పిండి పదార్థం 23.6గ్రా
పీచు 8.9గ్రా
మాంసకృత్తులు 4.2గ్రా
కొవ్వు పదార్థం 1.6 గ్రా
పొటాషియం 688మి.గ్రా
భాస్వరం 66 మి.గ్రా
విటమిన్ ‘సి’ 377 మిగ్రా
ఫోలిక్ ఆమ్లము 81 మి. గ్రా