వేసవి తాపం పెరిగే కొద్దీ మనసు శీతల పానీయాలు, పండ్ల రసాల మీదికి మళ్ళటం సహజమే. అయితే రొటీన్ కు భిన్నంగా ఇంట్లోనే చేసుకోదగిన, ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే కొన్ని దేశీయ పానీయాల వివరాలు, వాటిని తయారు చేసుకునే పద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ, పుదీనా రసం
కావలసిన పదార్థాలు
అల్లం అంగుళం పాటి
తాజా దానిమ్మ రసం-120 మి.లీ
తాజా పుదీనా ఆకులు- అర గుప్పెడు
పంచదార - చెంచా
నిమ్మకాయ - 1 పెద్దది
తయారీ : ఒక పెద్ద గ్లాసులో నిమ్మరసం, పుదీనా, చక్కెర వేసి బాగా కలుపుకొని ఆ మిశ్రమానికి డీప్ ఫ్రిజ్ లో పది నిమిషాల పాటు ఉంచిన దానిమ్మ రసాన్ని కలిపి పుదీనా ఆకులతో అలంకరించుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలి.
ఆపిల్, దాల్చినచెక్క జ్యూస్
కావలసిన పదార్థాలు
ఆపిల్ రసం -120 మి.లీ
దాల్చిన చెక్క సిరప్-15 మి.లీ
తాజా నిమ్మకాయలు- రెండు
తయారీ : దాల్చిన చెక్క సిరప్ , నిమ్మరసం, ఆపిల్ రసం ఒక పెద్ద గ్లాస్ లోకి తీసుకొని బాగా కలుపుకొని ఆపిల్ ముక్కలు, నిమ్మ బద్దతో గార్నిష్ చేసుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలి.