మనదేశంలో ఉన్న రెండు ప్రాచీన సరస్వతీ క్షేత్రాల్లో బాసర ఒకటి. పావన గోదావరీ తీరాన ఉన్న ఈ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్  జిల్లా ముధోల్ మండలంలో వుంది. ఈ క్షేత్రంలో చదువుల తల్లి సరస్వతి  మహాలక్ష్మి, మహాకాళి సమేతంగా భక్తులకు దర్శనమిస్తోంది.  బాసరలోని శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేసుకున్నపిల్లలు చదువుల్లో గొప్పగా రాణిస్తారని ప్రతీతి.

క్షేత్ర విశేషాలు

బాసరలో అమ్మవారు కొలువై ఉన్న ఆలయం  చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఇతర ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా, సాదాసీదాగా ఉంటుంది. వసంత పంచమి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ,  మహా శివరాత్రి పండుగల సందర్భంగా బాసర క్షేత్రం భక్తకోటితో నిండిపోతుంది. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎంతో గొప్పగా జరుగుతాయి. రోజూ 64 ఉపచారములతో వైభవంగా చేసే పూజలు, శ్రీదేవీ భాగవత, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహర్నవమి రోజున చండీ హోమము, విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము తో బాటు సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి.  బాసర వచ్చే యాత్రికులకు దేవస్థానం తరపున నిత్యాన్న దాన పథకం అందుబాటులో ఉంది.

స్థలపురాణం

కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోసం కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఈ క్షేత్ర ప్రశాంతతకు  ముగ్ధుడై  కుటీరం నిర్మించి తపస్సు చేసుకుంటుండగా జగన్మాత దర్శనమిచ్చి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురమ్మల మూర్తులను చేసి ఇక్కడ ప్రతిష్టించాడు. వ్యాసుడు నివాసమున్న క్షేత్రం గనుక వ్యాసపురి , వ్యాసర పేర్లతో పిలువబడిన ఈ క్షేత్రం కాలక్రమంలో  బాసరగా మారింది.

రవాణా, వసతి

రోడ్డు మార్గంలో వెళ్లేవారు నిజామాబాద్ నుంచి 35 కి.మీ దూరం ప్రయాణిస్తే బాసర చేరుకోవచ్చు.నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా నుండి ప్రతి అరగంటకు బస్సు సర్వీసు ఉంది.  హైదరాబాదు నుంచి బాసర సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బాసరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.  రైలు ప్రయాణీకులు హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో ఉన్న బాసర రైల్వేస్టేషన్ లో నేరుగా దిగొచ్చు. దేవస్థాన నిర్వహలో ఉన్న వసతి గృహాలతో బాటు అనేక లాడ్జీలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

చూడదగిన స్థలాలు

సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి దక్షిణాన శ్రీ వ్యాస మందిరం,  తూర్పు భాగాన ఉన్న ఔదుంబర వృక్షఛాయలో ఉన్న దత్త మందిరం, పడమర వైపు ఉన్న కాళీ మందిరాన్ని దర్శించుకొంటారు. బాసర యాత్ర తర్వాత అక్కడికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న  శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్  చేరుకోవచ్చు. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ చెంతన సూర్యాస్తమయాన్ని తిలకించడం ఓ అందమైన అనుభవం. అక్కడి నుంచి అరగంట ప్రయాణం చేసి నిర్మల్ పట్టణం చేరుకుని మరుసటి రోజు ఉదయాన్నే నిర్మల్‌లోని అందమైన బొమ్మలను చూసి అక్కడి నుంచి కుంతాల జలపాతానికి చేరి తిరుగు ప్రయాణం కావచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE