గోదారమ్మ గలగలలు, ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు కనిపించే గంభీరమైన కొండలు, కను చూపు మేర పరచుకున్న పచ్చని ప్రకృతి, బంగారు రంగు ఇసుకతిన్నెలపై కమ్మని భోజనం, నాగరికతకు దూరంగా సరికొత్త లోకంలో నివసించే అమాయకులైన గిరిపుత్రులు.. ఇవీ పాపికొండల ప్రస్తావన రాగానే కంటిముందు మెదలాడే దృశ్యాలు. వందలాది కిలోమీటర్ల దూరం కనుచూపుమేర వెడల్పుతో నెమ్మదిగా సాగే గోదారమ్మ పాపికొండల దగ్గరికి వచ్చేసరికి చిన్న ఏరులా మారే తీరు నిజంగా అద్భుతం. ఎంత చెప్పినా చాలని ఆ పాపికొండలకు సంబంధించిన కొన్ని విశేషాలు మీకోసం...

పాపికొండలు యాత్రకు 2 మార్గాలున్నాయి. ఒకటి.. రాజమండ్రి నుంచి వెళ్ళటం, పాపికొండల ఎగువనున్న కూనవరం నుంచి దిగువకు ప్రయాణించటం. మేము రెండో మారాన్ని ఎంచుకొన్నాం. ముందుగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకొని సీతారాములను దర్శించుకొన్నాం. అక్కడ పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన బస్సులో శ్రీరామగిరి చేరి అక్కడ గోదారమ్మకు నమస్కరించి మా కోసం సిద్ధంగా ఉన్న లాంచీ ఎక్కి పాపికొండల యాత్ర మొదలుపెట్టాం.

 లాంచీ బయలుదేరిన కాసేపటికే నదికి ఇరువైపులా ముచ్చటగా ఉండే చిన్నచిన్న గిరిజన గూడేలు, అమాయకులైన గిరిపుత్రులు కనిపించారు. ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతుంటే మనసుకు ఏదో తెలియని హాయి. నాకైతే.. ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటుపడిన నగరజీవికి ప్రకృతి పలికే స్వాగతమా అనిపించింది. అక్కడి నుంచి పేరంటాలపల్లి గ్రామం చేరి అక్కడి కొండపై ఉన్న ఆశ్రమం (శ్రీ రామకృష్ణ మునివాటము), అందులోని శివాలయం దర్శించుకొన్నాం. ఇది అక్కడి కొండరెడ్ల చేత నిర్వహించబడుతున్న ఆలయం. ఇక్కడ ఏ పూజారి గానీ పూజావిధానాలూ ఉండవు. నైవేద్యం మాత్రం ఆశ్రమం వారు చేసినదే నివేదిస్తారు. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదనీ, మౌనంగా ఉండాలని గైడ్ చెప్పారు. మౌనంగా ధ్యానం చేసుకొని స్వామిని దర్శించి బయలుదేరాం. ఆశ్రమ నిర్వహణకు ఎవరైనా సాయం చేయాలనుకొంటే ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప ధన, వాస్తు రూప సాయాన్ని నిర్వాహకులు స్వీకరించరు. అక్కడి నుంచి బయలు దేరి నది వద్దకు వచ్చి లాంచీ ఎక్కి కాస్త ముందు ఆగి వేడి వేడి భోజనాలు చేసి తిరిగి మరో 3 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే దూరం నుంచే పాపి కొండలు కనిపించాయి. కొండల దగ్గరకు లాంచీ వెళ్లే కొద్దీ చెప్పలేని ఉద్విగ్నత. భద్రాచలంలో 2 కిలోమీటర్ల వెడల్పున కనిపించిన గోదారమ్మ చిన్న ఏరులా ఉరకలు వేస్తూ గంభీరమైన ఆ కొండల మధ్య భీతిగొలిపే హోరుతో దూకే సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితకాలం గుర్తుండిపోయే క్షణాలవి. పాపి కొండల దిగువ నుంచి తిరిగి వెనక్కు మళ్ళి వచ్చిన దారినే తిరిగి మరునాడు హైదరాబాద్ చేరుకున్నాం. 

పాపికొండల అందాలను, అక్కడి గోదారమ్మ పరవళ్లను మీరూ చూసి పరవసించాలనుకొంటే ఈ వీకెండ్లో ప్లాన్ చేయండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే శాశ్వతంగా కనుమరుగు కానున్న ఈ అందాలను తప్పక చూసిరండి. పర్యాటక శాఖ వారి ప్యాకేజీల గురించి తెలుసుకోవాలనుకునే వారు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ మీదున్న పర్యాటక శాఖ కార్యాలయం, బేగంపేటలోని గ్రీన్‌ ల్యాండ్‌లోని టూరిజం ప్లాజా, సికిందరాబాద్ యాత్రీ నివాస్‌లలో సంప్రదించవచ్చు . మరిన్ని వివరాలకు www.telanganatourism.gov.in ఉచిత నంబరు 1800-425-46464కు ఫోను చేసి వివరాలు తెలుసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE