ఒకనాడు తెలుగునేలపై జనప్రియ జీవనవిధానంగా విలసిల్లిన బౌద్ధానికి రుజువు.. నేటి గుంటుపల్లి గ్రామం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో ఉన్న ఈ గ్రామం క్రీ.పూ.3 వ శతాబ్ది నాటికే ప్రముఖ బౌద్ధ కేంద్రంగా ఉండేది. ఇక్కడ బయటపడిన అనేక శాసనాలను బట్టి ఈ గ్రామం భట్టిప్రోలు, అమరావతికి తీసిపోని చరిత్ర గలదనీ, ఒకనాడు జైనం సైతం ఇక్కడ విలసిల్లినదనీ తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణం, అక్కడి కొండల మీది విశాల‌ గుహ‌లు, చైత్య విహారాలు, రాతి, ఇటుక స్థూపాలు పర్యాటకుల మనసులను కట్టిపడేస్తాయంటే ఆశ్చర్యం లేదు. ఇంత విభిన్నమైన బౌద్ధ నిర్మాణాలు ఆంధ‌దేశంలో మ‌రెక్క‌డా లేవని చ‌రిత్ర‌కారుల అభిప్రాయం. ఇక్కడి బౌద్ధ నిర్మాణాలకు, వాటి నిర్వహణకు నాటి పాలకులు ఇచ్చిన దానాల వివరాలు ఇక్కడి శాసనాల్లో కనిపిస్తాయి. ఇంత చరిత్రగల గుంటుపల్లి చారిత్రక విశేషాలను ఓసారి అవలోకిద్దాం. 

విశేషాలు

జీల‌క‌ర్ర‌గూడెం నుంచి ఉప్ప‌ల‌పాడు గ్రామ‌శివారు వ‌ర‌కు సుమారు 10 కి.మీ మేర పాముమెలికలు తిరిగినట్లు ఇక్కడ కొండలు విస్తరించి ఉంటాయి. అందువల్లే దీనికి మ‌హానాగ‌ప‌ర్వ‌త‌మ‌ని పేరు. ఈ కొండల మీద ఒకప్పుడు అద్భుతమైన పాలరాయి మంటపం ఉండేది. ప్రస్తుతం అది పూర్తిగా శిధిలమైనా దాని స్తంభాలపై క్రీ.పూ.2వ శ‌తాబ్దపు క‌ళింగ‌రాజు శాస‌నం ఉంది. క్రీ.పూ. ఒక‌టో శ‌తాబ్ది నాటి బ్ర‌హ్మ‌పైశాచి ప్రాకృత‌ లిపిలో ఉన్న శాసన వివరాలను బట్టి ఈ మంటపం క‌ళింగ చ‌క్ర‌వ‌ర్తి ఖార‌వేలుడు లేదా ఆయన తరువాతి పాలకుడైన సిరిపాలుని చొరవతో నిర్మితమై ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణాలలో ఎక్కడా బుద్ధుని ప్రతిమ లేకపోవటం, అమరావతి మాదిరిగా ఇక్కడి చిత్రాల్లో అలంకరణకు ప్రాధాన్యం లేకపోవటం , నిర్మాణాలు కేవలం కనీస అవసరాలనే దృష్టిలో పెట్టుకొని నిర్మించినట్లు ఉండటం వంటి అంశాల ఆధారంగా ఇవన్నీబౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటివని విశ్లేషకులు చెబుతున్నారు. భౌతికమైన అలంకారాలు ఇంద్రియ నిగ్రహాన్ని దెబ్బతీస్తాయనే బుద్ధుని మాటను తు.చ తప్పక పాటించిన రోజుల నాటి ఈ నిర్మాణాలను పోలిన మరికొన్ని కట్టడాలు గుంటుపల్లి సమీప గ్రామాలైన జీలకర్రగూడెం, కంఠమనేనివారి గూడెం గ్రామాలలో కూడా కనిపిస్తాయి. 

తొలినాళ్లలో గుంటుప‌ల్లి బౌద్ధానికి ఆలవాలంగా ఉన్నప్పటికీ క్రీ.శ‌.12వ శ‌తాబ్దంలో కృష్ణా, గోదావ‌రి తీరప్రాంతాన్ని పాలించిన రాజులు శైవులు కావ‌డంతో వీరి కాలంలో బౌద్ధ‌మ‌తం నిరాద‌ర‌ణ‌కు గురైంది. దీనికి తోడు కామాపురి (నేటి కామ‌వ‌ర‌పుకోట‌) పాలకుడైన కామ‌రాజు వీర‌శైవ‌మాతాభిమాని కావటంతో ఆయన కాలంలోనే ఈ గుంటుప‌ల్లి బౌద్ధారామం ధ‌ర్మ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యంగా మార్చ‌బ‌డి ఉంటుంద‌ని చ‌రిత్ర‌కారుల అభిప్రాయం. తరువాతికాలంలో బ్రిటిష్ పాలకుల నిర్ణయంతో ఈ ప్రాంతం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందని తెలుస్తోంది. 

ఇక్కడి ముఖ్య నిర్మాణాల్లో క్రీ. పూ 3 - 2వ శతాబ్దపు గుహాలయం ఒకటి. వృత్తాకారంలో తొలిచిన ఈ గుహ లోపల స్తూపం, దానిచుట్టూ ఉన్న ప్రదక్షిణామార్గం, గుహ పై కప్పుకు అమర్చిన వాసాలు, ద్వారానికి వాడిన కమానులు బీహార్‌లోని బౌద్ధ నిర్మాణాలను తలపిస్తాయి. ఈ స్తూపాన్నే ఇప్పుడు ధర్మ లింగేశ్వర శివలింగంగా స్థానికులు భావిస్తున్నారు. 

 బౌద్ధ భిక్షువులు నివసించేందుకు ఇక్కడి ఇసుకరాతి కొండ అంచులో గుహాలయాలను నిర్మించిన తీరు నిజంగా అద్భుతం. వీటి మధ్య అమర్చిన గుండ్రని కిటికీలు ఈ గుహలను అనుసంధానిస్తూ ఉండటం విశేషం. క్రీ. పూ 2వ శతాబ్దపు పెద్ద రాతి స్తూపం చూపరులను ఎంతో ఆకట్టుకొంటుంది. దీని పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి కొండపై పలు ఆకారాల్లో నిర్మించిన 60కి పైగా రాతి మరియు ఇటుకలతో నిర్మించిన స్తూపాలు చూడదగినవి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE