ఈ వేసవిలో ఏదైనా హిల్ స్టేషన్ లో 4 రోజులు గడపాలనుకునే వారికి 'మనాలి' ఒక చక్కని ఎంపిక. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఈ వేసవి విడిది కేంద్రం ప్రకృతి ప్రేమికుల స్వర్గంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని 'సిమ్లా'కు ఉత్తరాన సుమారు 280 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎత్తులో మనాలి నెలకొని ఉంది. ఒకవైపు బియాస్‌ నది గలగలలు , మరోవైపు ఆకుపచ్చని లోతైన లోయలు, పైకి చూస్తే ధవళ కాంతితో మెరిసిపోయే ఆకాశాన్నంటే హిమాలయ శ్రేణుల అందాలు పర్యాటకుల మనసును ఎంతగానో దోచుకొంటాయి. రోజువారీ బాధ్యతల నిర్వహణలో అలసిసొలసిపోయిన సగటు నగరజీవికి మనాలి యాత్ర ఒక జీవితకాలపు అనుభవం. 

చరిత్ర, వాతావరణం 

పూర్వం 'మనువాలయ' అని పిలిచిన ఈ ప్రదేశంలో ధర్మ శాస్త్రాన్ని రచించిన మనువు నివసించినట్లు చెబుతారు. ఆ పేరే కాలక్రమాన మనాలి గా మారినట్లు చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడి ఎత్తయిన కొండలు, లోతైన ఆకుపచ్చని లోయలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో పక్షుల కువకువలు పర్యాటకుల మనసును కట్టిపడేస్తాయి. ఇది పేరుకు వేసవి విడిది కేంద్రమే అయినా మనాలిలో ఏడాదిపొడవునా పర్యాటకులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. అయితే వేసవిలో వీరి సంఖ్య మరింత ఎక్కువ. దేశమంతా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల్లో సైతం ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. 

స్థానికుల జీవనశైలి

మనాలి జనాభా 7 వేలకు లోపే ఉంటారు. స్థానికులు స్థానిక హిమాచల్‌, హిందీ మాట్లాడతారు. మొదటునుంచీ పర్యాటకుల ప్రభావం ఉంది గనుక చక్కని ఇంగ్లీష్‌ కూడా మాట్లాడుతారు.పర్యాటకులతో మర్యాదగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఏడాది పొడవునా ఉండే చలిని తట్టుకునేలా వీరి వేషధారణ ఉంటుంది. భుజాల నుంచి మోకాళ్ళ వరకు ఉండే 'చోళ' అనే ఉన్నికోటును ధరిస్తారు. దీనిపై నడుముకు అడ్డంగా ‘డోరా’ అనే వస్త్రాన్ని కట్టుకొని, ‘సుతాన్‌’ అనే బిగుతు ప్యాంట్లను వేసుకుంటారు. స్థానికుల్లో ఎక్కువమంది ‘టోప’ అనే నల్లని టోపీతో బాటు ‘లాచూ’ అనే మందపాటి దుప్పటిని భుజాల మీద వేసుకొని కనిపిస్తారు. ఇక్కడి ప్రధాన ఆహారపంటలు వరి, గోధుమ. చలివాతావరణంలో ఉంటారు గనుక కోద్ర, సత్యార వంటి అత్యధిక క్యాలరీలుండే ఆహారం తీసుకొంటారు. ఇక్కడి స్థానికులు తేనీటిప్రియులు. ఇంటికో ఆవును మేపుతారు. పాలు, పాల ఉత్పత్తులు వీరి ఆహారంలో ప్రధాన భాగంగా ఉంటాయి. విందువినోదాలు సమయంలో బార్లీతో చేసిన స్థానిక వైన్‌, రెడ్‌ రైస్‌ను సేవిస్తారు. 

చూడదగిన ప్రదేశాలు

  • ఉత్తర భారతాన గల మరో పేరొందిన హిల్‌ స్టేషన్‌ 'కులు' లోయ ఇక్కడికి కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గనుక మనాలి వచ్చే పర్యాటకులు తప్పక కులు లోయ అందాలను దర్శిస్తారు.
  • కులు ప్రాంతం నుంచి 10 కి.మీ. ముందుకు వెళితే ప్రఖ్యాత బిజిలీ మహదేవ్‌ దేవాలయం పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
  • ఇది సముద్ర మట్టానికి 2460 మీ ఎత్తులో ఉండటం విశేషం.
  • భీముడి భార్య, ఘటోత్కచునికి తల్లి అయిన ... రాక్షస సంతతికి చెందిన హిడింబి ఆలయం మనాలిలో ఉంది. దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. దట్టమైన, ఎత్తైన చెట్లతో, ఏడాదిపొడవునా మంచుతో కప్పిఉండే పర్వతపు గుహలో ఉండే ఈ పురాతన ఆలయంలో ఎప్పుడూ ఒక అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. పర్యాటకులు తప్పక హిడింబి ఆలయాన్ని సందర్శించి ఆమె ఆశీస్సులు తీసుకుంటారు.
  • పర్యాటకులు తప్పక సందర్శించే మరో ప్రదేశమే.. రహల్లా జలపాతం. సముద్ర మట్టానికి 2501 మీటర్ల ఎత్తులో మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో రోహతాంగ్‌ కనుమ ప్రాంతంలో ఉన్న జలపాతం అమెరికాలోని నయాగారా జలపాతాన్ని తలపిస్తుంది. 
  • మనాలికి 3 కిలోమీటర్ల దూరంలోవాయువ్య దిశలో ఓల్డ్‌ మనాలి ప్రాంతంలో ఉన్న మనువు ఆలయం, అత్యంత పురాతన కోటలు పర్యాటకులను చరిత్రలోకి తీసుకెళతాయి. మనాలికి 3 కిలోమీటర్ల పరిధిలో మంచుతో నిండిన లోయల మధ్య కనిపించే వేడినీటి కొలనులు పర్యాటకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. 
  • సాహసక్రీడలకు.. మరీ ముఖ్యంగా మంచుపై స్కేటింగ్ ఇష్టపడేవారికి ఇది తగిన ప్రదేశం. ఇక్కడి సోలాంగ్‌ నుల్లా, రోహతాంగ్‌లా వ్యాలీప్రాంతాల్లో పర్యాటకులు శిక్షణ పొందిన సహాయకుల పర్యవేక్షణలో స్కేటింగ్‌ చేస్తుంటారు. పర్వతారోహకులకు కూడా ఈ ప్రాంతం ఎంతో అనుకూలం.

రవాణా సౌకర్యం , వసతి

మనాలిలో లెక్కకి మించి హోటళ్ళున్నాయి గనుక ఇక్కడ వసతికి ఏలోటూ ఉండదు. మనాలి వెళ్లేవారు ముందుగా సిమ్లా చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన మనాలి వెళ్లొచ్చు. విమాన ప్రయాణికులు ఢిల్లీ నుంచి సిమ్లా మీదుగా మనాలికి దక్షిణాన 52 కిలోమీటర్ల దూరాన గల భూంటార్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకొని అక్కడి నుంచి రోడ్డుమార్గాన మనాలి వెళ్ళాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE