దేశపు దక్షిణాగ్రాన నెలకొన్న పవిత్ర శక్తి క్షేత్రం, స్వామీ వివేకాంద జీవితాన్ని మలుపు తిప్పిన సాగరతీరం, బాపూజీ జ్ఞాపకాలను నిలుపుకొన్న స్మారక కేంద్రం, మూడు సముద్రాలు కలిసే త్రివేణీ సంగమం.. తమిళనాడులోని కన్యాకుమారి ప్రత్యేకతల్లో ఇవి కొన్ని మాత్రమే. వేసవి సెలవుల్లో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకునే ఔత్సాహికులంతా తప్పక చూడదగిన  కన్యాకుమారి విశేషాలను తెలుసుకుందాం. 

పట్టణ విశేషాలు

తమిళనాడు దక్షిణ సరిహద్దు జిల్లా కన్యాకుమారి. జిల్లా ప్రధాన పట్టణమూ ఇదే. దీన్ని ప్రస్తుతం 'కన్నియాకుమారి'గా పిలుస్తున్నారు. తిరునల్వేళి జిల్లా, కేరళ సరిహద్దు, దిగువన 3 సముద్రాలు కలిసే సంగమ ప్రదేశాల మధ్య నెలవై ఉన్న ఈ పట్టణం ఒకప్పుడు నాటి ట్రావెంకోర్ సంస్థానంలో భాగంగా ఉండేది. అప్పట్లో కన్యాకుమారి ప్రాంతం ట్రావెంకోర్ ధాన్యాగారంగా పేరుపొందింది. 

అమ్మవారి ఆలయం…

పార్వతీదేవి ఇక్కడ కన్య రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. మూడువైపులా ఎత్తయిన ప్రాకారాలు గల ఈ ఆలయంలో చేత మణిమాల, కన్నుచెదిరే కాంతితో మెరిసే ముక్కెరను ధరించిన అమ్మవారి మూలమూర్తి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది. పూర్వం అమ్మవారి ముక్కెర వెలుగుకు సముద్రంలో పడవ నడిపే నావికుల కన్ను చెదిరి నావలు అక్కడి రేవులోని బండరాళ్లను ఢీకొనేవనీ, అందుకే సముద్రాభి ముఖంగా ఉన్న ఆలయపు ద్వారాన్ని ఉత్సవాల సమయంలో మినహా మిగిలిన రోజుల్లో మూసి ఉంచుతారనీ చెబుతారు. ఆలయ స్థలపురాణం ప్రకారం పార్వతీదేవి పరమశివుడిని వివాహమాడేందుకు పెళ్లికూతురుగా సిద్ధమై, ఆ సుముహూర్త వేళకి స్వామి రాకపోవటంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, ఇతర పెళ్లి సంభారాలను అక్కడే వదిలేసి ఆయనలో ఐక్యమయ్యిందని చెబుతారు. నాడు అమ్మవారు వదిలేసిన రాసులే కాలక్రమంలో రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. దీనికి రుజువుగా నేటికీ కన్యాకుమారి తీరాన బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తాయి. 

వివేకానంద రాక్‌…

కన్యాకుమారి పట్టణంలో తప్పక చూడాల్సిన ప్రదేశం.. వివేకానంద రాక్‌. తీరానికి 400 మీటర్ల దూరాన సముద్రంలో గల ఈ గుట్ట మీదకు  1892లో దక్షిణదేశ యాత్రకు వచ్చిన వివేకానందుడు ఈదుకొంటూ వెళ్లి ఆ రాత్రంతా అక్కడే కూర్చొని ధ్యానం చేశారు. తరువాతి రోజుల్లో ఏకనాథ్ రనడే నేతృత్వంలో స్వామి గుర్తుగా సముద్రంలోని ఈ గుట్టపై నల్ల చలువరాతితో స్మారక కేంద్రంతో బాటు 12 అడుగుల ఎత్తైన వివేకానందుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పలు భారతీయ నిర్మాణశైలుల మిశ్రమంగా కనిపించే ఈ స్మారక నిర్మాణం లోపలి భాగాన స్వామి వివేకానంద జీవిత ఘట్టాలను వివరించే ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. స్మారకంలో భాగమైన వివేకానంద ధ్యాన మండపములో అత్యంత ప్రశాంతమైన నిశ్శబ్ద వాతావరణంలో యాత్రికులు గంటల తరబడి ధ్యానం చేసుకొంటారు. బలమైన ఆధ్యాత్మిక తరంగాల మధ్య ఇక్కడ గడిపిన ప్రతి క్షణమూ జీవితంలో మరచిపోలేని అనుభూతిగా ప్రతి యాత్రికుడూ భావిస్తాడు.

ఇందిరాపాయింట్‌…

కన్యాకుమారి చివరి సరిహద్దులో గల ఇందిరాపాయింట్‌ భారతదేశపు దక్షిణ సరిహద్దు గ్రామం. సూర్యోదయ, సూర్యాస్తమయాలను ఆస్వాదించాలనుకొనేవారు ఈ ప్రాంతాన్ని చూసి తీరాల్సిందే. గంభీరమైన సాగర గర్భాన్ని చీల్చుకొంటూ లేలేత కిరణాలతో ఎగిసి వచ్చే బాలభానుని అందాన్ని ఇక్కడ చూసినట్లు మరెక్కడా చూడలేము. సాయంవేళ ఉదయాన్నే వ స్తానని  మౌనంగా సముద్రంలోకి నిష్క్రమించే తీరు మాటల్లో చెప్పలేము. ఇక.. పౌర్ణమి రాత్రి సాగర తీరాన కూర్చొని ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయ, చంద్రోదయాలను చూసి పులకించని యాత్రికుడుండడు. సూర్యోదయ, సూర్యాస్తమయ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వచ్చే వేలాది పర్యాటకులతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది.

తిరువళ్లువర్‌ విగ్రహం…

వివేకానంద స్మారకాన్ని సమీపాన ప్రముఖ ప్రాచీన తమిళ కవి, తత్వవేత్త అయిన తిరువళ్ళువర్ 133 అడుగుల విగ్రహం పర్యాటకులను ఆకట్టుకొంటుంది. ఆసియా లోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.

 

బాపూజీ స్మారక చిహ్నం…

కన్యాకుమారిలో చూడదగిన నిర్మాణం.. గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచినచోట 1954లో నిర్మించిన ఈ మంటపంలో గాంధీ జయంతి మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించే తీరు నిజంగా అద్భుతం.

ఇతర ప్రత్యేకతలు

ఇక్కడి స్థానికులు సముద్రంలో లభించే గవ్వలు, శంఖాలతో తయారుచేసిన కళాఖండాలు కొనేందుకు యాత్రికులు పోటీ పడుతుంటారు.  కన్యాకుమారి తీరాన ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌’ గా పిలిచే భారీ సైజు రొయ్యలు దొరుకుతాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల తీర పరిధిలో గల సముద్రపు కొండ రాళ్ళ ప్రాంతంలో ఇవి లభిస్తాయి. ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన పుష్పాలు, వృక్షాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. అలాగే.. సుదూర ప్రాంతాల నుంచి ఈ తీరానికి వలస వచ్చే లక్షలాది పక్షులు ప్రకృతి ప్రేమికులకు కను విందు చేస్తాయి.

రవాణా, వసతి

చెన్నై నుంచి 743 కిలోమీటర్ల దూరాన గల ఈ పట్టణానికి ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. విమాన మార్గంలో వచ్చేవారు ముందుగా మధురై లేదా కేరళలోని తిరువనంతపురం చేరి అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. పర్యాటకుల కోసం కన్యాకుమారిలో రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలతో బాటు లెక్కకు మించినన్ని .. పలు చిన్న, పెద్ద హోటళ్లు పర్యాటకులకు అందుబాటు లో ఉన్నాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE