పవిత్ర ఖురాన్‌ ఆవిర్భవించిన రంజాన్‌ మాసం పవిత్రతకు, సౌభ్రాతృత్వానికి చిహ్నం.  ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మసీదులన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతాయి. ఈ రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కొన్ని మసీదుల విశేషాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

  • ప్రపంచంలోని అతి పురాతనమైన, అతిపెద్ద మసీదు... మక్కాలోని 'అల్‌ మస్జిద్‌ అల్‌ హెరమ్'. దీన్ని 'గ్రాండ్‌ మాస్క్‌' అంటారు. మక్కా యాత్రికులు ఈ మసీదులోని 'కాబా' చుట్టూ ప్రదక్షిణ చేయటం తెలిసిందే. సుమారు 292 అడుగుల ఎత్తు, 4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ మసీదులో ఏకకాలంలో సుమారు 40 లక్షల మంది ప్రార్థన చేసుకోవచ్చు.
  • చరిత్ర పరంగా చూసినప్పుడు మహమ్మద్‌ ప్రవక్త చేత మదీనాలో నిర్మించబడిన 'అల్‌ మస్జిద్‌ అల్‌ నబావీ' కూడా ఎంతో ముఖ్యమైనది. 'ప్రొఫెట్స్‌ మాస్క్‌' అని పిలిచే ఈ మసీదు ఎత్తు 344 అడుగులు కాగా విస్తీర్ణం 4 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ఏకకాలంలో 10 లక్షల మంది ప్రార్థన చేసుకోవచ్చు.
  • ప్రాచీనమైన మసీదుల జాబితాలో జెరూసలెంలో క్రీస్తుశకం 705 లో నిర్మించిన అల్‌ అక్సా మసీదు ఒకటి. ఈ మసీదు ఎత్తు 121 అడుగులు కాగా విస్తీర్ణం లక్షన్నర చదరపు మీటర్లు. ఇందులో ఒకేసారి రెండున్నర లక్షల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు.
  • ఆసియాలోని ప్రాచీనమైన మసీదుల్లో ఢిల్లీలోని జామా మసీదు ఒకటి. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ దీన్ని కట్టించాడు. ఈ మసీదు నిర్మాణం 1644 నుంచి 1656 వరకు సాగింది. 135 అడుగుల ఎత్తు, 2000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ మసీదులో ఏకకాలంలో 25 వేల మంది వరకు ప్రార్థనలు చేసుకోవచ్చు.
  • ఆధునిక కాలంలో నిర్మించిన పెద్ద మసీదుల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉన్న కింగ్‌ ఫైసల్‌ మసీదు ఒకటి. గుడారం ఆకారపు పైకప్పుతో ఉండే ఈ మసీదును సౌదీ రాజు ఫైసల్‌ ఆర్థిక సాయంతో 1976లో నిర్మించారు. సుమారు 260 అడుగుల ఎత్తు, 54 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ మసీదులో ఏకకాలంలో 2 లక్షల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు.
  • ఆధునికకాలపు మసీదుల్లో మొరాకోలోని కాసబ్లాంకా పట్టణంలోని హసన్‌–2 మసీదు ఒకటి. ‘కాసబ్లాంకా హజ్‌’గా ప్రసిద్ధి పొందిన ఈ మసీదు నిర్మాణం 1993లో పూర్తయింది. దీని ఎత్తు 690 అడుగులు కాగా విస్తీర్ణం 90 వేల చదరపు మీటర్లు. ఇక్కడ ఒకేసారి లక్ష మంది నమాజు చేసుకోవచ్చు.
  • ఇటీవలికాలంలో నిర్మితమైన అతిపెద్ద మసీదుల్లో సుల్తాన్‌ ఖబూస్‌ మసీదు ఒకటి. ఒమన్‌ సుల్తాన్‌ ఖబూస్‌ చేత 1994 డిసెంబర్‌లో ఆరంభించబడిన ఈ మసీదు 2001 మే నెలలో పూర్తయింది. దీని ఎత్తు 295 అడుగులు. విస్తీర్ణం దాదాపు 4 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ఏకకాలంలో దాదాపు 20 వేల మంది వరకు ప్రార్థనలు చేసుకునే వీలుంది.
  • గల్ఫ్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో నిర్మించిన పెద్ద మసీదుల్లో సాలేహ్‌ మసీదు ఒకటి. యెమన్ దేశంలోని సనాలో ఉన్న ఈ మసీదులోకి ముస్లిమేతరులకూ ప్రవేశం ఉంది. యెమెన్‌ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సాలేహ్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ మసీదు 2008 నవంబర్‌ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీని ఎత్తు 130 అడుగులు. విస్తీర్ణం దాదాపు 2 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ఏకకాలంలో 45 వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. మసీదుకు అనుబంధంగా అతిపెద్ద ఇస్లామిక్‌ అధ్యయన కేంద్రం కూడా ఉంది.
  • అతిపెద్ద ఆధునిక మసీదుల్లో అబుదాబిలోని షేక్‌ జాయేద్‌ మసీదు కూడా ఒకటి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దివంగత అధ్యక్షుడు షేక్‌ జాయేద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నాహ్యాన్‌ 1996- 2007 మధ్య కాలంలో నిర్మించిన ఈ మసీదు ఎత్తు 279 అడుగులు. విస్తీర్ణం 1.20 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ఏకకాలంలో 40 వేల మంది వరకు ప్రార్థనలు చేసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE