దక్షిణాది చరిత్రలో విజయనగర పాలకుల కాలం స్వర్ణయుగం. సంగీత, సాహిత్య, నృత్య, నిర్మాణ అభిరుచులుగల కళా పోషకులుగా వీరికున్న గుర్తింపు ఎంతో ప్రత్యేకం. వీరికాలపు కట్టడాలు నేటికీ వారి కళా వైభవాన్ని చాటి చెబుతాయి. ఇలాంటి కట్టడాల్లో.. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోట ఒకటి. దేశపు నలుమూల నుంచి వచ్చే వందలాది పర్యాటకులతో సందడిగా ఉండే ఈ కోట విశేషాలు తెలుసుకుందాం.

 చరిత్ర

విజయనగర పాలకులకుల మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి.  క్రీస్తుశకం 1000 లో చంద్రగిరి సమీపానగల నారాయణ వనాన్ని పాలించిన ఇమ్మడి నరసింహ యాదవ రాయలు ఈ కోటను నిర్మించాడు. ఆ తరవాత ఈ కోట  314 ఏళ్ళు యాదవ రాజుల ఆధీనంలో ఉంది. క్రీ.శ. 1565లో జరిగిన రాక్షసి తంగడి (తళ్లికోట) యుద్ధంలో విజయనగర పాలకులు పరాజితులై కర్ణాటకలోని హంపి నుంచి పెనుగొండకు, ఆ తర్వాత ఈ చంద్రగిరికి వచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి వెళ్లిన ప్రతిసారీ ఈ కోటలోనే విడిది చేసినట్లు ఆధారాలున్నాయి. అచ్యుతదేవరాయులను ఈ కోటలోనే గృహనిర్బంధంలో ఉంచారు. ఆ తరువాత 1584-1614 ప్రాంతంలో అరవీటి వంశపురాజులు, 1645 నాటికి గోల్కొండ సుల్తానులు, 1758లో కర్నూలు నవాబు సోదరుడైన అబ్దుల్‌ నవాబ్‌ఖాన్‌ల ఆధీనంలోకి ఈ కోట వెళ్ళింది. చంద్రగిరి చివరి విజయనగర రాజు పెద వేంకట రాయల సామంతుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు ఆగస్టు 22, 1639లో బ్రిటీషు ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్‌ డేకి చెన్నపట్నంలో కోటను కట్టుకొనేందుకు ఈ కోట నుంచే అనుమతి ఇచ్చాడు.

ప్రత్యేకతలు

రెండు పెద్ద ప్రవేశ ద్వారాలు, కోట చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు. పెద్ద రాళ్లతో మలచిన బురుజులు, కోట గోడలను ఆనుకొని లోతైన మొసళ్ల అగడ్తలతో అప్పట్లోనే ఈ కోట ఎంతో ప్రసిద్ధి పొందింది. కొండపై అర్ధచంద్రాకారంగా ఉండే ఈ కోట పైనుంచి శత్రువుల కదలికలను దూరంనుంచే గమనించవచ్చు. కోటకు రక్షణగా దాని చుట్టూ కిలో మీటరు పొడవున దృఢమైన, పెద్ద రాతిగోడ నిర్మించటం మరో ప్రత్యేకత.

 

ప్రత్యేక ఆక్షర్షణ.. రాజమహల్‌

చంద్రగిరి కోటలో గంభీరంగా, రాజసం ఉట్టిపడేలా కనిపించే ప్రధాన భవనమే.. రాజమహల్‌. పలు దశల్లో నిర్మితమైన ఈ 3 అంతస్తుల నిర్మాణం 16వ శతాబ్ధం నాటికి రాచనివాసంగా వినియోగంలోకి వచ్చింది. మూడు ఎత్తైన గోపురాలతో ఉండే ఈ మహలులో దర్బారు హాలు, గోడలు లేకుండా నిర్మించిన కొలువు మండపం ప్రత్యేక ఆకర్షణలు. ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మించిన ఈ కోట పునాదిని రాతితో, పైభాగాన్ని ఇటుక, కరక్కాయ, సున్నం, బెల్లం, గుడ్డు తెల్లసొన మిశ్రమాలతో నిర్మించారు. ఈ భవనంలో ఎక్కడా కలప వాడకపోవటం, పరదాల ఏర్పాటు కోసం గోడలలోనే తగు నిర్మాణాలు చేయటం ఇతర ప్రత్యేకతలు.

రాణీమహల్‌

కోటకు అనుబంధంగా ఉన్న 2 అంతస్తుల నిర్మాణమే.. రాణీమహల్‌. ప్రస్తుతం చాలా వరకు శిధిలమైన ఈ మహల్ వెనుక కోట నీటి అవసరాలకోసం తవ్విన పెద్ద దిగుడు బావి, ఈ బావికి కొద్ది దూరంలో ఖైదీలను ఉరి తీసే 6 స్తంభాల మండపాలు కనిపిస్తాయి. ఈ మహలు మొదటి అంతస్తులో ఉన్నమ్యూజియంలో నాటి ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు కనిపిస్తాయి. ఈ మహల్ రెండో అంతస్తులో రాజసం ఉట్టిపడే సింహాసనాలతో కూడిన నాటి దర్భారును చూడొచ్చు. ఈ మహల్ మూడో అంతస్తులో నాటి కోట నమూనా, ప్రజలజీవన విధానాన్ని తెలియజేసే వస్తువులతో కూడిన ప్రదర్శన శాల, నాటి రాజప్రముఖుల గదులున్నాయి.

ఇతర అనుబంధ నిర్మాణాలు

నాడు ఇక్కడి కొండ పైగల సైనిక స్థావరపు అవసరాలకోసం కొండను తొలచి 2 చెరువులు తవ్వి, కొండకింది పెద్ద చెరువు నుంచి నీటిని  పైకి యంత్రాల సాయంతో పంపేవారు. ఆ సాధనాలను నేటికీ మనం చూడొచ్చు. ప్రస్తుతం రాణీమహల్‌, రాజమహల్‌ వెనుక ఉన్న చెరువును బాగుచేసి, మొక్కలు పెంచి, సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా తీర్చిదిద్దారు. అలాగే రాజమహల్‌కు వెనుక ఖాళీ ప్రదేశాన్ని పెద్ద ఓపెన్‌ ధియేటర్‌గా మార్చి, అందుబాటు రుసుముతో లేజర్‌షో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన ద్వారా పెనుకొండ, చంద్రగిరి సంస్థానాల చరిత్రను పలు భాషల్లో యాత్రికులకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తున్నారు. చంద్రగిరి కోట పరిసరాల్లో సువర్ణముఖీ తీరాన తొండవాడకు వెళ్లే దారిలో ఎడమవైపు పొలాల్లో పురావస్తు శాఖవారు భద్రపరచిన పాడుబడ్డ దేవాలయం, చంద్రగిరి సెంటర్‌లో నమాజ్‌ సమయంలో మోగించే పెద్ద అలారం స్తంభం యాత్రికులకు కనువిందు చేస్తాయి.

రవాణా, వసతి

తిరుపతి నుంచి ప్రతి అరగంటకూ చంద్రగిరికి బస్సులున్నాయి. చంద్రగిరి నుంచి కోట వరకు ఎన్నో ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి గనుక రవాణాకు ఇబ్బంది లేదు. చంద్రగిరిలో కంటే తిరుపతిలోనే మెరుగైన వసతాయి ఉన్నందున, యాత్రీకులు  తిరుపతిలో బసచేసి అక్కడినుంచి ఒక్కరోజులో చంద్రగిరి అందాలను ఆస్వాదించి తిరిగి వస్తుంటారు. అందుకే.. ఈసారి తిరుపతి యాత్రలో చంద్రగిరినీ తప్పక దర్శించి రండి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE