నగరంలో తెల్లారితే ఉరుకులు పరుగుల జీవితం, గంటల కొద్దీ ట్రాఫిక్‌ తిప్పలు, పనిచేసేచోట తలనొప్పులు, వ్యక్తిగత ఇబ్బందులు... ఇవన్నీ వదిలి కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లి 2 రోజులు ప్రకృతి ఒడిలో వాలి పోవాలని అనుకుంటున్నారా? అయితే.. ఈసారి వారాంతంలో తప్పసరిగా అనంతగిరి వెళ్ళిరావాల్సిందే. విశాఖ జిల్లా అరకు సమీపంలో ఉన్న అనంతగిరి విశాఖపట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడాదిలో సుమారు 8 నెలలు చల్లగా ఉండే అనంతగిరి ఆంధ్రలోని ముఖ్యమైన వేసవి విడిది కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి ఎత్తైన, గంభీరమైన తూర్పు కనుమల శ్రేణులు, కనుచూపు మేర విస్తరించిన పచ్చదనం, లోతైన లోయలు, ఎగసిపడే జలపాతాలు పర్యాటకులను మరోలోకంలో విహరింపజేస్తాయి. ఉత్సాహం కలిగించే ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన దట్టమైన అటవీ ప్రాంతంలో అడుగడుగునా కనిపించే అరుదైన వృక్షజాతులు..ఇక్కడికి వచ్చే ప్రకృతి ప్రేమికులైన పర్యాటకులకు చెప్పలేని, సరికొత్త అనుభూతిని మిగుల్చుతాయి. 

ప్రకృతి సోయగాలు

ఎటు చూసినా పచ్చదనం మధ్య అనంతగిరి కొండల మీద పాము మెలికలు తిరిగినట్లు ఉండే ఘాట్ రోడ్డు గుండా చేసే ప్రయాణం యాత్రీకులకు చెప్పలేని మధురానుభూతి. దారి పొడవునా విస్తరించిన కాఫీ తోటల అందాలు, కమ్మని సువాసన పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇక్కడి కాఫీ సాగులో స్థానిక గిరిజనులను భాగస్వాములను చేసి వారికి స్థిరమైన ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తోంది. మనదేశంలో లభిస్తున్న అత్యుత్తమ ఆర్గానిక్ కాఫీ ఇక్కడిదే. ఈ మార్గంలో కనిపించే పలు రకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. పలు అరుదైన వృక్ష జాతులకు ఆలవాలమైన ఈ ప్రాంతంలో ఎన్నో అరుదైన వనమూలికలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ప్రేమికులు, నవ దంపతులకు ఈ ప్రదేశం స్వర్గధామమంటే అతిశయోక్తికాదు. 

దక్షిణ బధ్రీనాథ్‌…

ఇక్కడి తిరుమలగిరి ప్రాంతంలో గల భవనాశి సరస్సును అత్యంత పవిత్రమైనదిగానూ, ఇక్కడి సరస్సు నీటిని ఔషధ ప్రాయమైనదిగా భావించి తీర్థంగా సేవిస్తారు. ఈ సరస్సు వల్లనే ఈ ప్రాంతానికి దక్షిణ బధ్రీనాథ్‌ అనే పేరు వచ్చింది. అనంతగిరి కొండల మధ్య ప్రవహించే 'ముచికుందా' నది పాయలుగా చీలి వేగంగా దిగువకు పరుగులెత్తే తీరును ఎత్తైన ప్రదేశం నుంచి వీక్షించటం యాత్రికులకు సరికొత్త అనుభూతి. ఇక్కడి పూల తోటల సుగంధాలు, అడుగడుగునా వినిపించే పక్షుల కిలకిలారావాలు, సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో అలరించే గమ్మత్తైన ప్రకృతి శోభ, కొండకొమ్ములనుంచి లోతైన లోయలలోకి వేగంగా దూకే జలపాతాల సౌందర్యం పర్యాటకులకు ఓ జీవిత కాలపు అనుభూతిని మిగుల్చుతాయి. ఇంతటి ప్రకృతి రమణీయత గల అనంతగిరిపై కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి కోవెలను పర్యాటకులు దర్శించుకొంటారు. 

రవాణా, వసతి

అనంతగిరికి హైదరాబాద్‌, విశాఖపట్నంతో బాటు పలు సమీప ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. బస చేసేందుకు ఇక్కడ బోలెడన్ని ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు ఉన్నాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE