అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, తెలంగాణలోని సుప్రసిద్ధ, అతి ప్రాచీన పుణ్య క్షేత్రాలలో గద్వాల్‌ జిల్లా, అలంపురం ప్రసిద్ధికెక్కింది. దీనికి దక్షిణా కాశిగా, శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వారంగా దీన్ని పేర్కొంటారు. ఇక్కడ స్వామివారు బాలబ్రహ్మేశ్వర స్వామిగా పూజలందుకొంటుండగా పరాశక్తి జోగులాంబగా కొలువై ఉంది. ఒకనాడు హలంపుర, హతంపుర, హేమలాపురం, అల్పూరుగా పిలిచిన ఈ అలంపూరు. శిల్పరీత్యా, చరిత్ర రీత్యా, వాఙ్మయం రీత్యా ఈ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. 

క్షేత్ర చారిత్రక విశేషాలు

మౌర్యులు, శాతవాహనులు, బాదామీచాళుక్యలు, రాష్ట్ర కూటులు, కల్యాణీ చాళుక్యులు, కాకతీయులు, విజయ నగర రాజులు, సుల్తానులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. శ్రీ ఆది శంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్ర ప్రతిష్ఠ చేసినట్టు ఆధారాలను బట్టి తెలుస్తోంది. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది. చారిత్రక ఆధారాలను బట్టి జోగులాంబ ఆలయాన్ని మొదట క్రీ.శ.ఆరో శతాబ్దంలో బాదామి చాళుక్యుడైన రెండో పులకేశి నిర్మించాడు. క్రీ. శ. 1480 లో జరిగిన బహమనీ సుల్తానుల దాడిలో ఈ ఆలయం కొంత ధ్వంసం కాగా పూజారులు అమ్మవారి మూలమూర్తిని బ్రహ్మేశ్వ రాలయంలోని ఒక మూలన ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రంలోని ఇతర ఆలయాలు ధ్వంసం కాకుండా నాటి విజయనగర పాలకుడైన మొదటి దేవరాయలు సుల్తానుల సైన్యాన్ని తరిమి క్షేత్రాన్ని రక్షించినట్లు చెబుతారు.బ్రహ్మకు విగ్రహం ఉండటం ఈ క్షేత్రంలోని మరో విశేషం.

జోగులాంబ స్థలపురాణం

తుంగభద్రా నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఆలంపురం అయిదవ శక్తిపీఠం. దక్షయజ్ఞ సమయంలో ఆత్మార్పణ చేసిన సతీదేవి దేహాన్ని పరమ శివుడు భుజాన వేసుకొని తాండవమాడిన వేళ అమ్మవారి పై దవడ భాగం ఈ క్షేత్రంలో పడినట్లు చెబుతారు. కింద దవడకంటే పైదవడ కాస్త వేడిగా ఉంటుంది గనుక అమ్మవారు రౌద్ర స్వరూపిణి. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు ఆలయ కింది భాగంలో జల గుండం ఏర్పాటుచేసారు. యోగులు, ఉపాసకులు పాలిటి కల్పవల్లి అయిన అమ్మవారిని పూర్వం యోగులంబ, యోగాంబ అని పిలిచేవారని, కాలక్రమంలో ఈ పేరు జోగులాంబ గా స్థిరపడిందని ప్రతీతి. నేటికీ ఏడాది పొడవునా సుదూర ప్రాంతాల నుంచి సాధకులు, యోగులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు.

 

జోగులాంబ అమ్మవారిది ఉగ్ర రూపం. అమ్మవారు ఎత్తైన పీఠంపై ప్రేతాసనంలో మహా తేజస్సుతో దర్శనమిస్తుంది. జోగులాంబ అమ్మవారి వెంట్రుకలు చెరిగిపోయి, పైకి లేచి, గాలిలో కదిలాడుతున్నట్టు ఉంటాయి. ఇలా ఉండటాన్ని ‘జట’ అంటారు. పరమేశ్వరుడికి మాత్రమే పరిమితమైన జట ఇక్కడ అమ్మవారికీ ఉండటం విశేషం. ఆ కేశాల్లో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అమ్మవారి కేశాల్లో బల్లుల సంఖ్య పెరుగుతుందనీ, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడ తేళ్లు చేరుతాయని చెబుతారు. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరతాయట. ఆ జీవ కళ పూర్తిగా క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందనీ, అందుకు రుజువుగా అమ్మవారి తల భాగాన ఉన్న కపాలం కనిపిస్తుందని చెబుతారు. జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పిలుస్తారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు, వాస్తుదోష నివారణలకు అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు జోగులాంబ ఆలయంలో చండీహోమాలు, ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజ, రోజూత్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏటా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తారు. ఏటా మాఘ శుద్ధ పంచమినాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవం జరుపుతారు. ఆరోజు భక్తులకు జోగులాంబ నిజరూప దర్శనం ఉంటుంది. అదేరోజు సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు.

ఇతర ఆలయాలు

ఇక్కడి బాలబ్రహ్మేశ్వర లింగాన్ని సాక్షాత్తూ బ్రహ్మ ప్రతిష్టించాడనీ, ఈ ఆలయాన్ని రససిద్ధులు నిర్మించారనే స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి లింగం పై భాగం ఆవుగిట్ట ముద్ర కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ క్షేత్రంలోనే జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉండేదనీ, ఆయన భార్య రేణుకను కుమారుడైన పరశురాముడు సంహరించిన చోటు కూడా ఇదేనని చెబుతారు. అలంపురంలోనే బ్రహ్మ ప్రతిష్టించిన 9 ఆలయాలున్నాయి. వీటినే నవబ్రహ్మ ఆలయాలంటారు. అవి.. తారక బ్రహ్మ ఆలయం, స్వర్గ బ్రహ్మ ఆలయం, పద్మ బ్రహ్మ ఆలయం, బాల బ్రహ్మ ఆలయం, విశ్వ బ్రహ్మ ఆలయం, గరుడ బ్రహ్మ ఆలయం, కుమార బ్రహ్మ ఆలయం, ఆర్క బ్రహ్మ ఆలయం, వీర బ్రహ్మ ఆలయం. వీటికి 1400 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం ముఖ్యమైనవి . ఇక్కడి పాప వినాశని తీర్థంలోని గదాధర విగ్రహ సన్నిధిలో శ్రాద్ధకర్మలు ఆచరిస్తే విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు.

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్‌-కర్నూల్‌ హైవే మార్గంలో కర్నూల్‌కు 10కి.మీ. దూరంలోని అలంపూర్‌ చౌరస్తానుంచి అలంపూర్‌ చేరుకోవచ్చు. హైదరాబాద్‌-కర్నూల్‌ రైలు మార్గంలో కర్నూల్‌ స్టేషన్‌కు ముందు వచ్చే జోగులాంబ హాల్ట్‌ వద్ద దిగి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE